breaking news
no bank
-
బ్యాంకుల మూసివేతపై క్లారిటీ
న్యూడిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు త్వరలో మూత పడనున్నాయన్న కథనాలు ఆందోళన నేపథ్యంలో ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ స్పందించాయి. గతరెండు వారాలుగా సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలలో చక్కర్లు కొడుతున్న వదంతులపై వివరణ ఇచ్చాయి. ఈ మెసేజ్‌లన్నీ నిరాధారమైనవనీ, సత్యదూరాలని కొట్టి పారేశాయి. ఖాతాదారుల డిపాజిట్ సొమ్ము సురక్షితంగా ఉంటాయని హామీ ఇచ్చాయి. ఈ పుకార్ల పట్ల ప్రతి ఒక్కరూ విజ్ఞతగా ఉండాలని సూచించారు. తొమ్మిది ప్రభుత్వరంగ బ్యాంకుల మూత వేత అనే అంశం హాస్యాస్పదంగా ఉందని, ఇది నిరాధారమైందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మరోవైపు ఈ వదంతులను నమ్మవద్దని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా ఖాతాదారులను కోరారు. సోషల్ మీడియా సందేశాల్లో ప్రచారమవుతున్న తప్పుడు సమాచారంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం, ఈ బ్యాంకులు..భారీగా పేరుకుపోయిన బ్యాడ్ లోన్లు, తక్కువ మూలధన బఫర్ కు సంబంధించి బలహీనంగా ఉన్నాయని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆర్బీఐ చర్యలు చేపడుతోందని చెప్పారు. ప్రాంమ్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీఈఏ) పరిధిలో ఈ బ్యాంకుల పనితీరును సకాలంలో మెరుగుపరుస్తామని ముంద్రా పేర్కొన్నారు. కాగా ముఖ్యంగా ఎస్బీఐ అనుబంధ బ్యాంక్‌ల విలీనం తరువాత బ్యాంకుల కన్సాలిడేషన్ వైపు కేంద్రం యోచిస్తోందన్నవాదనలు వినిపించాయి. తద్వారా మొత్తం 3-4 అంతర్జాతీయ బ్యాంక్‌లను రూపొందించనుందనీ, అందుకే ప్రస్తుతం ఉన్న 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను 12కు తగ్గించే ప్రతిపాదనలు సిద్దం చేస్తోందని కథనాలు వినిపించాయి. అలాగే గత కొన్ని వారాలుగా వాట్సాప్ గ్రూపులలో తొమ్మిది ప్రభుత్వ రంగ బ్యాంకులు (కార్పొరేషన్ బ్యాంక్, యూకో బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆంధ్రా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మూత పడనున్నాయని, అప్రమత్తంగా ఉండాలన్న సందేశాలు విపరీతంగా షేర్ అవుతున్న సంగతి తెలిసిందే. -
అతిపెద్ద టమాటా మార్కెట్‌ను తాకిన నోటు దెబ్బ
బెంగళూరు: డీమానిటేజేషన్ కష్టాలు కోలార్ టమోటా మార్కెట్ ను భారీగా తాకాయి. ఒకవైపు పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, మరోవైపు బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో లేకపోవడంతో రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, కూలీలు, రవాణా ఎజెంట్లు, ట్రక్ డ్రైవర్లు అష్టకష్టాలు పడుతున్నారు. ఆసియాలోని రెండవ అతిపెద్ద టమోటా మార్కెట్ గా పేరుగాంచిన కోలార్ మార్కెట్ యార్డ్ లో ఒక్క బ్యాంకు గానీ, ఏటీఎం సెంటర్ గానీ లేకపోవడం ఆందోళనగా మారింది. కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలోని కోలార్ లోని టమాటా మార్కెట్ దేశంలో అతిపెద్ద మార్కెట్ గా ప్రసిద్ధి చెందింది. పింపాల్ గాన్, నాసిక్ తర్వాత దక్షిణ భారతదేశం అతి పెద్దదైన కోలార్ ..కర్ణాటక రాజధాని బెంగళూరుకు కేవలం 70 కి.మీ ల దూరంలో ఉంది. అయితే ఇక్కడ ఉన్న బ్యాంకు పనిచేయక, సమీపంలో ఎలాంటి బ్యాంకు గానీ, ఏటీఎం సెంటర్ గానీ లేక ఇక్కడి వ్యాపారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దిగుబడి బాగా వచ్చినా, సరిపడినంత డిమాండ్ ఉన్నా వ్యాపారం చేసుకోలేని పరిస్థితి దాపురించిందని వ్యాపారి మునియప్ప చెప్పారు. ఇంకా పాతనోట్లతోనే వ్యాపారం చేస్తున్నామనీ, వీటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం పెద్ద సమస్యగా మారిందన్నారు. దీంతో తమ సిబ్బంది వేతనాల చెల్లింపు ఆలస్యం కానుందన్నారు. రైతులు నగదు చెల్లింపులకోసం ఒత్తిడి చేస్తున్నారనీ, చెక్ లను అంగీకరించడం లేదన్నారు. దీంతో తమకు నగదు కొరత ఏర్పడిందన్నారు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటీఎం కేంద్రం క్యూలో తమ కూలీలు ఎక్కువసేపు నిలబడ్డ మూలంగా పనులకు అంతరాయం కలుగుతోందని మరో వ్యాపారి వాపోయారు. తమ దగ్గర వెంటనే బ్యాంకింగ్ సౌకర్యం ఏర్పాటు చేసి, బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించాలని కోరారు. అయితే రైతుల, ఇతర వ్యాపారుల కష్టాల నేపథ్యంలో జాతీయ బ్యాంకు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు మార్కెట్ కార్యదర్శి రవి కుమార్ తెలిపారు. కోలార్ మార్కెట్ లో ఉన్న డీసీసీ బ్యాంకు గత ఎనిమిది నెలలగా పనిచేయడం లేదని చెప్పారు. దీనిపై కర్ణాటక వ్యవసాయం మంత్రి కృష్ణ బైర్ గౌడ్ స్పందించారు. త్వరలోనే బ్యాంక్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. డీమానిటైజేసన్ పై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి ముఖ్యంగా అగ్రి వస్తువుల వర్తకంలో నగదు కొరత ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఏపీఎంసీఎస్ (అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ) పరిధి అంతటా 35 శాతం ప్రభావితం మయిందని తెలిపారు. కాగా కోలార్ మార్కెట్ సంవత్సరానికి సుమారు 1.5 లక్షల టన్నుల వ్యాపారాన్ని చేస్తుంది. బిహార్, బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, పంజాబ్ , మధ్య ప్రదేశ్, డిల్లీ, ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు, రాష్ట్రాలతో్ సహా బంగ్లాదేశ్, పాకిస్తాన్, దుబాయ్ దేశాలకు విమానాల ద్వారా టమాటాను ఎగుమతి చేస్తుంది.