breaking news
next Uttar Pradesh Chief Minister
-
యూపీ సీఎం ఎంపిక ఎందుకు ఆలస్యం?
లక్నో: దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన పంజాబ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ చక్రం తిప్పి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది రేపు (శుక్రవారం) బీజేపీ తేల్చనుంది. అయితే ఉత్తరప్రదేశ్‌లో చరిత్రాత్మక విజయం సాధించిన కమలం పార్టీ.. ఎన్నికల ఫలితాలు వెలువడి ఆరు రోజులు కావస్తున్నా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమవుతోంది? దీనికి కారణాలున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడానికి బీజేపీ పరిశీలకులు నిన్న (బుధవారం) లక్నో వెళ్లి.. ఈ రోజు (గురువారం) సమావేశం కావాల్సివుంది. అయితే చివరి నిమిషంలో లక్నో పర్యటనను రద్దు చేశారు. బీజేపీ నాయకుల సమాచారం మేరకు.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో ఆ పార్టీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. యూపీ విషయంలో చిన్న పొరపాటు కూడా చేయరాదని భావిస్తోంది. ఎమ్మెల్యేలనే ఢిల్లీకి పిలిపిస్తున్నారు. పరిశీలకులతో పాటు ఇతర సీనియర్ నేతలు వారితో మాట్లాడి, అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఎన్నికలు జరిగిన ఇతర నాలుగు రాష్ట్రాలతో పోలిస్తే యూపీకి బీజేపీ ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని కుల సమీకరణలపై, ఎన్నికల హామీలను నెరవేర్చడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆయన బృందం దృష్టిసారిస్తోంది. అంతేగాక 2019 జరిగే లోక్‌సభ ఎన్నికల్లో యూపీపై భారీ ఆశలు పెట్టుకుంది. ఢిల్లీ పీఠాన్ని మళ్లీ కైవసం చేసుకోవాలంటే యూపీ నుంచి ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడంతో పాటు పార్టీలో అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లగల సరైన నేత కోసం అన్వేషిస్తోంది. యూపీ ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెలిచినా.. ఏ ఎమ్మెల్యేకూ సీఎం అయ్యే అవకాశం రాకపోవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్రం నుంచే బలమైన నేతను యూపీ సీఎంగా పంపనున్నట్టు చెప్పారు. ముఖమంత్రి అభ్యర్థిని అగ్రవర్ణాల నుంచి ఎంపిక చేయలా లేక యాదవేతర బీసీలకు అవకాశం ఇవ్వాలా అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. సీఎం పగ్గాలు ఓ వర్గానికి అప్పగిస్తే.. డిప్యూటి సీఎంను మరో వర్గం నుంచి ఎంపిక చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. యూపీ సీఎం పదవికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మనోజ్ సిన్హా, బీజేపీ యూపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రాజ్‌నాథ్‌ను యూపీ ముఖ్యమంత్రిగా పంపిస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని నేరుగా రాజ్నాథ్తోనే ప్రస్తావించగా.. ఆయన కొట్టిపారేశారు. యూపీ కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనా? -
పారికర్ దారిలో మరో కేంద్ర మంత్రి..?
లక్నో: మరో కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనోహర్ పారికర్ రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసి గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా.. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి రేసులో ముందున్నారు. యూపీ ముఖ్యమంత్రిగా రాజ్‌నాథ్‌ను పంపాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా యోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. 40 సీట్లున్న గోవాలో బీజేపీ 13 సీట్లే గెలిచినా ఇతర పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా పారికర్ ముఖ్యమంత్రి కావాలని కోరడంతో బీజేపీ అధిష్టానం అంగీకరించింది. గోవాతో పోలిస్తే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 403 సీట్లున్న యూపీలో కమలం పార్టీ ఏకంగా 312 సీట్లు గెలిచింది. యూపీకి ఎంతో ప్రాధాన్యమిస్తున్న బీజేపీ సరైన వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ హామీలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడి, అభివృద్ది దిశగా నడిపించగల నాయకుడి కోసం అన్వేషిస్తోంది. రాజ్‌నాథ్ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనైతే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడటంతో పాటు పార్టీ నేతలను కలుపుకొని వెళ్లగలరని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంపై అమిత్ షా ఆ రాష్ట్ర నాయకులతో చర్చిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నాయకులను సంప్రదించారు. సీఎం అభ్యర్థి ఎంపిక విషయంపై రాజ్‌నాథ్ సింగ్‌తోనూ షా చర్చించారు. సీఎం పదవికి యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య, కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కాగా రాజ్‌నాథ్ అందరికంటే ముందున్నారు. యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని బుధవారం ప్రకటించనున్నారు.