breaking news
N. Vijaykumar
-
వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
పెనుగంచిప్రోలు, న్యూస్‌లైన్: గ్రామంలోని శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో తొలి పవిత్రోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక జలాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ఆలయ ఈవో ఎన్.విజయ్‌కుమార్, చైర్మన్ నెల్లూరి గోపాలరావు గణపతి పూజ అనంతరం ఉత్సవాలను ప్రారంభించారు. తొలిసారిగా పవిత్రోత్సవాలు నిర్వహించనుండడంతో ఏర్పాట్లు పటిష్టంగా చేశారు. ఉదయం మండపారాధన, సాయంత్రం అగ్ని ప్రతిష్ఠాపన, రాత్రికి ఆలయం చుట్టూ అమ్మవారి ఊరేగింపు, పంచహారతుల అనంతరం దేవతామూర్తులకు పవిత్రములు ధరింపజేశారు. ఉత్సవాల ప్రారంభంతోపాటు శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని పాలు, పొంగళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఈ వైకుంఠరావు, ఏఈఓలు ప్రసాదరావు, గోపాలరావు, సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, పాల్గొన్నారు. -
30 నుంచి శ్రీతిరుపతమ్మ పవిత్రోత్సవాలు
పెనుగంచిప్రోలు, న్యూస్‌లైన్ : గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో ఈనెల 30 నుంచి మూడు రోజుల పాటు మొదటిసారిగా పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ ఈవో ఎన్.విజయ్‌కుమార్ తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి శుక్రవారం ఆలయ సిబ్బంది, వేద పండితులు, అర్చకులతో అవగాహనా సమావేశం నిర్వహించారు. ఆలయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నందున పలు సూచనలు చేశారు. ఉత్సవాల విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు ఉంటాయన్నారు. ఆలయ ఈఈ వైకుంఠరావు, ఏఈవో సీహెచ్.ప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు, కుంకుమ పూజలు.. పాడిపంటలు, అష్టైశ్వర్యాలు, పసుపు కుంకుమలతో నిండు నూరేళ్లు వర్ధిల్లేలా దీవించమని కోరుతూ మహిళలు అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించిన సామూహిక వ్రతాలు, కుంకుమ పూజల్లో దాదాపు వెయ్యిమంది మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. మహిళలకు వ్రతం, కుంకుమార్చనకు అవసరమైన సామగ్రి మొత్తం ఆలయం వారే సమకూర్చారు. వ్రతం అనంతరం మహిళలకు లక్ష్మీదేవి రూపు, గాజులు, పసుపు, కుంకుమ అందజేశారు వ్రతంలో ముస్లిం మహిళలు పొల్గొనడం విశేషం. కార్యక్రమంలో చైర్మన్ నెల్లూరి గోపాలరావు, పాలకవర్గ సభ్యులు యర్రంశెట్టి సుబ్బారావు, కోటేశ్వరరావు, సముద్రాల లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.