breaking news
mrps protest
-
ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అసెంబ్లీ ను ముట్టడించేందుకు బుధవారం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ప్రయత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు. మల్కాపురం గ్రామం నుంచి వచ్చిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలంతా అసెంబ్లీలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఎం చంద్రబాబు తమకు అన్యాయం చేస్తున్నారని.. ఎస్సీ వర్గీకరణ బిల్లు త్వరగా పెట్టాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా 30 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మల్కాపురం గ్రామంలోని ఓ ఇంట్లో మంగళవారం నుంచి సుమారు 30 మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రహస్యంగా మకాం వేసి ఉన్నారని పోలీసులు అంటున్నారు. -
సీఎం వైఖరిపై ఎమ్మార్పీఎస్ నిరసన
కాకినాడ సిటీ : ఎస్సీ వర్గీకరణ హామీని విస్మరించి, మాదిగలను అణచివేసే ధోరణితో ముఖ్యమంత్రి అవలంబిస్తున్న తీరు, నిరంకుశ వైఖరిని నిరసిస్తూ శనివారం కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. ఎమ్మార్పీఎస్ ఆందోళన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద, రామారావుపేటలోని టీడీపీ కార్యాలయం వద్ద పోలీసులు ఉదయం నుంచి పెద్ద ఎత్తున మోహరించారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు, జిల్లా అధ్యక్షులు ఆకుమర్తి చిన్నా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ముందుగా కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ధర్నా నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీగా జెడ్పీ సెంటర్ మీదుగా టీడీపీ కార్యాలయానికి చేరుకుని ముట్టడించారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు రావాలంటూ పట్టుపట్టడంతో స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ దశలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి బైఠాయించారు. వర్గీకరణపై పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని ఎమ్మెల్యేని నిల దీశారు. సర్దిచెప్పే ప్రయత్నం చేసినా శాంతించకపోవడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. సుమారు నాలుగు గంటల పాటు ఆందోళన చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ చంద్రబాబు మాదిగలను నమ్మించి నట్టేట ముంచారని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాదిగలు అండగా ఉండి అధికారంలోకి రావడానికి పాటుపడ్డారన్నారు. చంద్రబాబును దూషించిన జూపూడి ప్రభాకర్, కారెం శివాజీ వంటి వారిని నెత్తిన ఎక్కించుకుని మాదిగలను అణచి వేస్తున్నారని ధ్వజమెత్తారు. కారం శివాజీకి ఇచ్చిన పదవిని వెనక్కు తీసుకోవాలని, ఎస్సీవర్గీకరణపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అధిక సంఖ్యలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
బాబు పర్యటనను అడ్డుకునేందుకు ఎమ్మార్పీఎస్ యత్నం, అరెస్ట్
పుంగనూరు: చిత్తూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మంగళవారం ఉదయం పుంగనూరు నుంచి బయలుదేరిన ఎమ్మార్పీఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మిద్ది వెంకటస్వామి సహా 100 మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మార్పీఎస్ ఆందోళన నేపధ్యంలో దళితవాడల్లో చెక్కుల పంపిణీ ని అధికారులు నిలిపివేశారు.