breaking news
MLA Raghupati Kona
-
తిరుమలలో తప్పులు రాష్ట్రానికే అరిష్టం: కోన
సాక్షి, తిరుపతి : దేవాలయాలు, అర్చకులకు జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తిన రమణ దీక్షితులుకు మద్దతుగా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రమణ దీక్షితులు అడుగుతున్న ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పట్లేదని ప్రశ్నించారు. తిరుమలలో జరుగుతున్న తప్పుల వల్ల రాష్ట్రానికే అరిష్టమని అన్నారు. 65 ఏళ్లుకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని పునరాలోచించాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రమణదీక్షితులు లేవనెత్తిన అంశాలపై సీబీఐ విచారణ జరిపి, ఆయనను తక్షణమే ప్రధానార్చకులుగా నియమించాలని డిమాండ్ చేశారు. 65 ఏళ్లు నిండాయని ఆయనను పక్కన పెట్టడం దురదృష్టకరమని తెలిపారు. ఆయన బాధను చెప్పుకోవడానికి ఇక్కడ అవకాశం లేక పక్క రాష్ట్రానకి వెళ్లి చెప్పుకునే పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. చంద్రబాబు దేవాలయాలను నాశనం చేసిన వ్యక్తి, విజయవాడలో కూల్చిన దేవాలయాలను ఎక్కడ తిరిగి నిర్మించలేదని ఆరోపించారు. దేవతా సేవల వేళల్లో ఇష్టానుసారం మార్పులు చేయడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని శాస్త్ర వ్యతిరేక పనులే చేస్తున్నారని విమర్శించారు. మిరాశీ కుటుంబీకుడు ప్రశ్నించడం తప్పా, ఆస్తుల లెక్కలు భక్తులకు చెప్పమని కోరడం తప్పా అని ప్రశ్నించారు. 2017 డిసెంబర్లో వంటశాలను మూసివేసి తవ్వకాలు జరపడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కోర్టు తీర్పును కూడా బేఖాతరు చేస్తూ మిరాశీలను 65 ఏళ్లకే తొలగిస్తామనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రహ్మణులతో పెట్టుకుంటున్నారు జాగ్రత్త అని హెచ్చరించారు. గతంలో ఐవైఆర్ కృష్ణారావును అలానే అవమానించారు. ఇప్పుడు రమణదీక్షితులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. సన్నిధి గొల్లలకు కూడా చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. దేవాలయాలన్నింటికి ధూప దీప నైవేద్యాలుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిధులిచ్చి సంస్కృతి, సాంప్రదాయాలను బ్రతికించారని తెలిపారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అలానే హామీ ఇచ్చారని అన్నారు. -
సూర్యలంక తీరం అభివృద్ధి చేస్తా
బాపట్ల: సూర్యలంక సముద్ర తీరం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. సూర్యలంకలో ఆక్రమణలు తొలగించి నూతనంగా నిర్మించతలపెట్టిన షాపురూముల నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే కోన, ఆర్డీవో నరసింహం పరిశీలించారు. తీరానికి వచ్చే పర్యాటకులు, భక్తులకు షాపులు అసౌకర్యం కలిగించకూడదనే ఉద్దేశంతో కొన్నింటిని తొలగించి వాటిస్థానంలో తాత్కాలిక షాపులు ఏర్పాటు చేయించామని ఎమ్మెల్యే కోన వివరించారు. షాపుల ద్వారా వచ్చే అద్దెలను పంచాయతీ అభివృద్ధికి ఖర్చు చేసేవిధంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నిజాంపట్నం-చీరాలకు సముద్రం వెంబడి 24కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణం చేపడితే గన్నవరం విమానాశ్రయానికి వెళ్లేందుకు కూడా 55 కిలోమీటర్లు దూరం తగ్గిపోతుందని కోన తెలిపారు. తీరంలో రూ.15 కోట్లుతో శాశ్వత షాపింగ్కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. షాపులకు ఎదుట సిమెంటు రోడ్డు నిర్మాణం చేపట్టడం ద్వారా పర్యాటకులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. అభివృద్ధి పనులకు సహకరిస్తామని ఆర్డీవో నరసింహం హామీఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వడ్డిముక్కల రత్నమణి, తహశీల్దార్ టి.వల్లయ్య, సర్పంచ్ బొడ్డు సుబ్బారెడ్డి, నాయకులు వడ్డిముక్కల డేవిడ్, కౌన్సిలర్ సయ్యద్ షేక్ పీర్ ఉన్నారు.