ఎంఐఎం బలపరిస్తే రాజ్యసభకు పోటీ : జెసి
                  
	హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యేలు బలపరుస్తామంటే తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి రాజ్యసభకు పోటీ చేస్తానన్న మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి అన్నారు.  అసెంబ్లీ లాబీల్లో జేసీ, శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ  మధ్య ఈరోజు ఆసక్తికర చర్చ జరిగింది. ఈ సారి కాంగ్రెస్‌కు నాలుగు రాజ్యసభ సీట్లు రావని, రెండు సీట్లు మాత్రమే ఆ పార్టీ  గెలవవచ్చని  జేసీ అన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ హైకమాండ్ నిలిపే అభ్యర్థికి ఓటు వేసేందుకు సుముఖంగా లేరని చెప్పారు.
	
	ఎంఐఎం  తరఫున అభ్యర్థిని పోటీకి నిలపాలని జెసి అక్బర్‌కు సూచించారు. మీరే నిలబడవచ్చు కదా అని  అక్బరుద్దీన్ జెసితో అన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు బలపరుస్తామంటే తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి రాజ్యసభకు పోటీ చేస్తానని చెప్పారు. సమైక్యవాదులెవరైనా  ఇండిపెండెంట్‌గా రాజ్యసభ అభ్యర్థిగా పోటీచేస్తే  గెలవడానికి అవకాశం ఉందని ఆయన అన్నారు. తమ తరఫున ఇండిపెండెంట్లను బరిలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.