breaking news
Mild steel pipeline
-
గ్రేటర్‌కు జూరాల జలాలు
-
గ్రేటర్‌కు జూరాల జలాలు
►కొత్త ప్రాజెక్టుకు జలమండలి శ్రీకారం ►సిద్ధమైన పథకం ఫైలు.. సీఎం ఆమోదమే తరువాయి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి మహబూబ్‌నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను తరలించి శివారు ప్రాంత దాహార్తిని తీర్చేందుకు జలమండలి మరో బృహత్తర మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టింది. సుమారు 123 కిలోమీటర్ల దూరం నుంచి నగరానికి నీటిని తరలించే ఈ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు వ్యయం కాగలదని అంచనా. ఈ పథకం ద్వారా నగరానికి రోజువారీగా 90 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించాలన్నది లక్ష్యం. ఈ పథకానికి సంబంధించిన ఫైలును ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనకు పంపినట్లు తెలిసింది. ఆయన ఆమోదముద్ర పడడమే తరువాయి. కృష్ణా మూడోదశ.. గోదావరి మంచినీటి పథకాలతో పాటు ఇది నగరానికి ప్రత్యేక పథకం కానుంది. జూరాల-హైదరాబాద్ పథకం తీరిదీ.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు. జూరాల నుంచి రామన్‌పాడు జలాశయానికి 0.388 టీఎంసీల నీటిని తరలించి అక్కడి నుంచి నగరానికి మంచినీటి సరఫరా చేయాలన్నది జలమండలి లక్ష్యం. ఈ ప్రాజెక్టు కింద 123 కిలోమీటర్ల మేర 2200 ఎంఎం డయా వ్యాసార్థం గల భారీ మైల్డ్ స్టీల్ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందులో పంపింగ్ మెయిన్ 96 కిలోమీటర్లు, గ్రావిటీ మెయిన్ 27 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పథకం పనులను నాలుగు ప్యాకేజీలుగా చేపట్టాలని జలమండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్యాకేజీల వారీగా పనుల వివరాలివీ.. ప్యాకేజీ-1: 35 కిలోమీటర్లు. రామన్‌పాడు నుంచి మూసాపేట్ వరకు 85 మీటర్ల ఎత్తున లిఫ్ట్ నిర్మాణం ప్యాకేజీ-2: 27 కిలోమీటర్లు. మూసాపేట్ నుం చి జడ్చర్ల-150 మీటర్ల ఎత్తున లిఫ్ట్ నిర్మాణం ప్యాకేజీ-3: 34 కిలోమీటర్లు. జడ్చర్ల నుంచి షాద్‌నగర్-90 మీటర్ల ఎత్తున లిఫ్ట్ నిర్మాణం ప్యాకేజి-4: 27 కిలోమీటర్లు. షాద్‌నగర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓఆర్ఆర్ జంక్షన్ వరకు గ్రావిటీ (భూమ్యాకర్షణ శక్తి) ద్వారా నీటి తరలింపు అన్ని ప్రాంతాలకు నీటి సరఫరాకు.. రింగ్ మెయిన్1: జూరాల నుంచి తరలించిన నీటిని గ్రేటర్ నగరం నలుమూలలా సరఫరా చేసేందుకు ఓఆర్ఆర్ జంక్షన్- లింగంపల్లి వరకు మంజీరా సరఫరా నెట్వర్క్ పరిధిలోకి 30 కి.మీ. మేర నీటిని తరలించాల్సి ఉంటుంది. రింగ్ మెయిన్ 2: ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి ఉప్పల్, సైనిక్‌పురి మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు సుమారు 60 కి.మీ. మేర పైప్‌లైన్‌ను నిర్మించి నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. జంట జలాశయాలకూ జల కళ.. జూరాల నీటిని షాద్‌నగర్ మీదుగా లక్ష్మీదేవిపల్లి నుంచి గ్రావిటీ (భూమ్యాకర్షణ శక్తి) ఆధారంగా ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి ఆరాంఘర్ మీదుగా ఉస్మాన్‌సాగర్ (గండిపేట్), హిమాయత్ సాగర్లకు తరలించాలని ప్రతిపాదించారు. దీంతో జంట జలాశయాలు అన్ని కాలాల్లోనూ జలకళతో నిండుగా ఉండడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. టాటా కన్సల్టెన్సీకి ప్రతిపాదనల బాధ్యత జూరాల- హైదరాబాద్‌కు కృష్ణా జలాలను తరలించే ప్రాజెక్టుపై సమగ్ర ప్రతిపాదనలు, డిజైన్ సిద్ధం చేసే బాధ్యతలను జలమండలి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు అప్పగించనుంది. ఈ సంస్థ గతంలో కృష్ణా మొదటి, రెండు, మూడో దశ పథకాలకు డిజైన్లు, సమగ్ర ప్రాజెక్టు అంచనాలు సిద్ధం చేసిన విషయం విదితమే.