breaking news
medaical officers
-
నిధులివ్వరు ..నిర్వహణ ఎలా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్కారు వైద్యశాలలకు సుస్తీ చేసింది. ఏడాది కాలంగా నిధుల లేమితో ఆస్పత్రుల నిర్వహణ గాడి తప్పింది. ప్రభుత్వం ఏటా విడుదల చేసే నిర్వహణ నిధులు ఈ ఏడు ఇప్పటికీ జాడలేవు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద వివిధ పద్దుల కింద ఇచ్చే వార్షిక నిర్వహణ నిధులు వాస్తవానికి ఆరోగ్య కేంద్రాలకు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే విడుదల చేయాలి. కానీ మరో రెండున్నర నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నప్పటికీ.. నిధుల ఊసే లేదు. అసలే అరకొర వైద్యం అందించే సర్కారు దవాఖానాల్లో నిధుల సమస్యను సాకుగా చూపిస్తున్న వైద్యశాఖ.. ఏకంగా ఆస్పత్రుల నిర్వహణను గాలికొదిలే సింది. రావాల్సింది రూ.1.02 కోట్లు జిల్లాలో 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) ఉన్నాయి. ఇవికాకుండా మరో 7 పట్టణ ఆరోగ్య కేంద్రాలు (యూహెచ్‌సీ) ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరోగ్య కేంద్రానికి ఏటా వివిధ పద్దుల కింద గరిష్టంగా రూ.1.75లక్షల నిధులు ఇస్తోంది. అవ సరాన్ని బట్టి నిధుల విడుదలలో హెచ్చుతగ్గులు పాటిస్తోంది. ఈ నిధులను ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ ఖాతాలో జమ చేస్తుంది. ఈ నిధులతో ఆస్పత్రి అభివృద్ధి కార్యక్రమాలకోసం రూ.లక్ష వినియోగించాల్సి ఉంటుంది. వీటితో చిన్నపాటి మరమ్మతులు, పెయింటింగ్, పరికరాల కొనుగోలు తదితర వాటికి వినియోగించాలి. మరో రూ.50వేలు ఏడాది పొడవునా ఆస్పత్రి నిర్వహణకు ఖర్చు చేయాలి. మిగిలిన రూ.25వేలను ఆస్పత్రిలో పారిశుద్ధ్యం మెరుగుకోసం వెచ్చించాలి. అయితే ఈ ఏడాది మూడు పద్దులకు సంబంధించి రూ.1.02 కోట్లు రావాల్సిందిగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. అయితే నిధులు ఇప్పటికీ విడుదల కాకపోవడంతో ఆస్పత్రుల్లో పరిస్థితులు అధ్వానంగా, వైద్యసేవలు అరకొరగా మారాయి. ఆఖరి నిమిషంలో జేబుల్లోకి! ఆస్పత్రి అభివృద్ధి సొసైటీకి కేటాయించే నిధులను ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో విడుదల చేస్తే ప్రణాళికాబద్ధంగా ఖర్చవుతాయి. అయితే నిధుల విడుదల ప్రక్రియ గాడి తప్పుతుండడంతో ఒకవైపు ఆస్పత్రి నిర్వహణ అధ్వానంగా మారుతుండగా.. మరోవైపు ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. మరో రెండున్నర నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. దీంతో ఇప్పటికిప్పుడు నిధులు విడుదలచేస్తే.. ఆదరాబాదరగా నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల అక్రమాలు జరిగే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. నకిలీ బిల్లులతో గతంలో అక్రమాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో నిధులు విడుదలైతే వినియోగంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. -
కొలువుల బేరం
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల పోస్టుల నియామకాలలో పైరవీలు జోరందుకున్నాయి. వైద్యశాఖ అధికారులపై ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఒత్తిడి విపరీతంగా పెరిగి నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, వైద్య శాఖ కార్యాలయంలో ఓ అధికారి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అభ్యర్థినులను బోల్తాకొట్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగం తప్పనిసరి అని చెబుతూ ఆసక్తి ఉన్న అభ్యర్థినులతో మా ట్లాడుతున్నట్లు సమాచారం. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.40 వేల నుంచి రూ. 50 వేలు వసూ లు చేస్తున్నట్లు సొంత శాఖ ఉద్యోగులే పేర్కొం టున్నారు. కార్యాలయంలోనే అభ్యర్థినుల దరఖాస్తులను పరిశీలించి మెరిట్ ఉన్నవారిని ఎం పిక చేసుకుని ఫోన్లో సంప్రదిస్తున్నట్లు తెలిసింది. వారికి ఉద్యోగాల ఆశ చూపుతూ డబ్బులు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజాంసాగర్ మండలానికి చెందిన ఓ అభ్యర్థిని శనివారం ఇంటికి పిలుపించుకొని డబ్బుల బేరం ఆడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా సంప్రదిస్తూ వారికి తెలిసిన వారుంటే ఉద్యోగం ఇప్పిద్దామంటూ మభ్యపెడుతున్నట్లు తెలిసింది. కాంట్రాక్టు స్టాఫ్ నర్సు పోస్టుల కోసం ప్రజాప్రతినిధులే ఎక్కువగా అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ పీఏ వారం రోజుల నుంచి మూడుసార్లు అధికారులకు ఫోన్లు చేసినట్లు సమాచారం. బాల్కొండ మండలానికి చెందిన ఓ సర్పంచ్, ఎమ్మెల్యే పేరు చెబుతూ తమ అభ్యర్థినులకు రెండు పోస్టులు కేటాయించాలని అధికారులపై ఒత్తిడి చేస్తునట్లు ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు. మరో ఎమ్మెల్యే పీఏ సైతం సెక్షన్ అధికారికి రాతపూర్వకంగా రికమెండేషన్లు చేశారు. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. 28 పోస్టులు, 470 దరఖాస్తులు కాంట్రాక్టు స్టాఫ్ నర్సు పోస్టులు 28 ఉండగా జిల్లావ్యాప్తంగా 470 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మరో నాలుగు రోజుల్లో ఎంపిక జాబితాను ప్రకటించనున్నారు. దరఖాస్తులు ఎక్కువగా రావడం వల్లే ఎంపిక ఆలస్యం అవుతోందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. పారదర్శకంగానే ఎంపిక -గోవింద్ వాగ్మారే, జిల్లా వైద్యాధికారి కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల ఎంపిక పారదర్శకంగానే జరుగుతుంది. నిబంధనల ప్రకారం చేపడుతాం. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గం. అభ్యర్థినులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.