ఐసిస్ చెర నుంచి విముక్తి పొందినందుకు
మంజీబ్: సిరియా లోని మంజీబ్ కు చెందిన ముస్లిం మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు. ఐసిస్ తమ రాజధానిగా ప్రకటించుకున్న రక్కాకు వెళ్లే దారిలో ఉన్న మంజీబ్ ను ఉగ్రవాదుల చెర నుంచి సిరియన్ డెమొక్రటిక్ ఫోర్స్ విడిపించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన దాదాపు నెల రోజుల అనంతరం అక్కడి మహిళలు బుర్ఖాలను తగులబెడుతూ కనిపించారు. మంజీబ్ ను వశం చేసుకున్నప్పుడు మహిళలు కచ్చితంగా బుర్ఖా ధరించాలని ఐసిస్ ఫత్వా జారీ చేసింది.
ఐసిస్ పై సైన్యం గెలుపొందడంతో ప్రజలు సంబరాలు చేసుకుంటుండగా.. గుంపులో నుంచి వచ్చిన ఓ మహిళ బుర్ఖాను తెచ్చి లైటర్ వెలిగించి తగులబెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్ లైన్ షేర్ అవుతోంది. గుంపులో నుంచి వచ్చిన మరో మహిళ ఐసిస్ ఉగ్రవాదులు వారిని ఎలా హింసించారో కళ్లకు కట్టినట్లు చెప్పింది. టీవి, ఫోన్, మాంసం, బ్రెడ్ తదితర నిత్యఅవసరాలను ఉగ్రవాదులు లాక్కున్నారని తెలిపింది. తామంతా ఆకలితోనే జీవించామని పేర్కొంది. ఇళ్లలోని మగవాళ్లను లాక్కెళ్లి కాల్చిచంపారని కన్నీటిపర్యంతమయింది. మరికొందరిన జైళ్లలో బంధించినట్లు వివరించింది. వాళ్లను ఎలాగైనా విడిపించాలని ప్రాథేయపడింది.