breaking news
Mallikarjun rao
-
మార్కెట్ నుంచే నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: నిధుల సాయం కోసం ఈ విడత కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లడం లేదని పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఎండీ ఎస్ఎస్ మల్లికార్జున రావు స్పష్టం చేశారు. మార్కెట్ నుంచే నిధులను సమీకరించాలనుకుంటున్నట్టు చెప్పారు. రూ.14,000 కోట్లను మార్కెట్ నుంచి సమీకరించేందుకు వాటాదారులు ఆమోదం తెలిపారని, ఇందులో రూ.7,000 కోట్లు ఈక్విటీ రూపంలో ఉంటుందని సోమవారం మీడియాతో వర్చువల్ గా నిర్వహించిన సమావేశం సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ ఇష్యూలకు తగినంత ఆసక్తి ప్రభుత్వ బ్యాంకుల నిధుల అవసరాలను తీర్చే అనుకూల పరిస్థితులు మార్కెట్లో కనిపిస్తున్నాయని మల్లికార్జునరావు చెప్పారు. బీవోబీ, పీఎన్బీ ఇటీవలే చేపట్టిన టైర్–2 బాండ్ ఇష్యూకు వడ్డీరేటు సహేతుకంగా ఉండడాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాదే(2020–21) రియల్ ఎస్టేట్ ఆస్తుల విక్రయం రూపంలో మరో రూ.500 కోట్లను సమీకరించుకోనున్నట్టు చెప్పారు. దివాలా కేసుల రూపంలో రూ.8,000 కోట్లు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందు దివాలా చట్టం కింద కేసుల పరిష్కారం రూపంలో రూ.6,000–8,000 కోట్లు రావచ్చని తాము అంచనా వేస్తున్నట్టు మల్లికార్జునరావు తెలిపారు. అనుబంధ సంస్థ పీఎన్ బీ హౌసింగ్ ఫైనాన్స్ లో ప్రిఫరెన్షియల్ ఇష్యూ లేదా రైట్స్ ఇష్యూ రూపంలో రూ.600 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు చెప్పారు. 4–6 శాతం మేర రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎన్బీ రుణ వితరణలో 4–6 శాతం మేర వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని మల్లికార్జునరావు చెప్పారు. అక్టోబర్ నుంచి ఆర్థికరంగ కార్యకలాపాలు బలంగా ఉంటాయని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. 40,000 కోట్ల రుణాల పునర్ వ్యవస్థీకరణ ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఆగస్ట్ తర్వాత పీఎన్ బీ సుమారు రూ.40,000 కోట్ల రుణాలను పునర్ వ్యవస్థీకరించే అవకాశం ఉందని మల్లికార్జునరావు వెల్లడించారు. కరోనా కారణంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్ట్ వరకు రుణ చెల్లింపులపై మారటోరియం అవకాశం ఇచ్చిన ఆర్ బీఐ, అనంతరం ఒక్కసారి రుణ పునర్ వ్యవస్థీకరణకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. పీఎన్బీ లాభం రూ.308 కోట్లు 2020–21 ఏడాది తొలి త్రైమాసికానికి (ఏప్రిల్–జూన్) పీఎన్బీ రూ.308 కోట్ల స్టాండలోన్ లాభాన్ని(అనుబంధ సంస్థల ఫలితాలు కలపకుండా) ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంకుకు వచ్చిన లాభం రూ.1,018 కోట్లతో పోలిస్తే రెండొంతులు తగ్గిపోయింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పీఎన్బీలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం కావడంతో, ఈ ఆర్థిక సంవత్సరం జూన్ ఫలితాలను క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చలేమని బ్యాంకు పేర్కొంది. -
జాతీయభావాలే ఊపిరిగా...
భారతీయత, జాతీయత, లౌకికవాదం వంటి అంశాల మీద టీవీ చానెళ్లలో తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. పలు సందర్భాలలో శర్మగారు పాల్గొని జాతీయత అనే అంశం పట్ల స్పష్టత ఇచ్చేవారు. విద్య కాషాయీకరణ అంశం మీద చర్చలు జరిగినప్పుడు శర్మ విశిష్టమైన అంశాలను వెల్లడించేవారు. ఏ విషయం గురించి అయినా అవగాహన కలిగి ఉండడం, మార్గదర్శనం చేయగలగడం, అప్పగించిన ప్రతి పనిని రాజీ లేని రీతిలో పూర్తి చేయడం, ఇదంతా సిద్ధాంత స్ఫూర్తి పరిధిలో చేయడం కొందరికే సాధ్యమవుతుంది. సంస్థలేవయినా అలాంటివారిని గొప్ప సంపదగా భావిస్తాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్), అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), సంఘ్ పరివార్‌కు చెందిన ప్రచురణ విభాగాలు తమకు గొప్ప సంపదగా భావించే వ్యక్తి తుమ్మలపల్లి హరిహరశర్మ. అధ్యాపకునిగా, సామాజిక కార్యకర్తగా, అసాధారణ పాఠకునిగా, టీవీ చానళ్లలో వక్తగా హరిహరశర్మ చాలామందికి పరిచయస్థులే. ఈ కార్యకలాపాలకే ఆయన తుది శ్వాస వరకు జీవితాన్ని అంకితం చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన శర్మ 1950 ప్రాంతంలోనే ఆరెస్సెస్ కార్యకర్తగా మారారు. కుటుంబం నుంచి వచ్చిన ఆధ్యాత్మిక సంపద, సంస్థ ఇచ్చిన జాతీయతా భావాలు ఆయన ప్రతి మాటలోను, రాతలోను ధ్వనించేవి. శర్మ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. ఆంగ్ల సాహిత్యం చదివారు. తరువాత ఎల్ఎల్ఎం కూడా పూర్తి చేశారు. రాజమండ్రి, కర్నూలు, కడప ప్రభుత్వ కళాశాలల్లో కొంతకాలం అధ్యాపకునిగా పని చేసిన తరువాత ఆరెస్సెస్ పెద్దల అభిప్రాయం మేరకు ప్రభుత్వోద్యోగాన్ని విడిచిపెట్టారు. సంస్థ నిర్ణయం మేరకు విద్యారంగంలో పనిచేయడానికీ, విద్యార్థి విభాగాన్ని నిర్మాణం చేయడానికీ శ్రమించారు. దాని ఫలితంగానే భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన కాలేజ్ ఆఫ్ కామర్స్‌కు ప్రిన్స్‌పాల్‌గా నియమితులయ్యారు. ఇక్కడే పదవీ విరమణ చేశారు కూడా. ఆరెస్సెస్ సూచన మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏబీవీపీని బలోపేతం చేసే పనిని ఆయన స్వీకరించారు. ఆ విధంగా తెలుగు ప్రాంతాలలో ఏబీవీపీ సంస్థ నిర్మాణానికి పూనుకున్న తొలితరం వ్యక్తులలో ఆయన కూడా ఒకరయ్యారు. ఆ సంస్థ ప్రాంత ప్రముఖ్‌గా, అధ్యక్షులుగా శర్మ మూడు దశాబ్దాలు పనిచేశారు. ఏ విధంగా చూసినా శర్మగారి జీవితం ఆదర్శప్రాయంగా కనిపిస్తుంది. ఆయనకు కళాశాల ప్రిన్స్‌పాల్ పదవి ఉంది. గృహస్థు కూడా. కానీ తన పూర్తి సమయాన్ని ఆయన సామాజిక సేవకు వెచ్చించారు. ఉద్యోగ విరమణ తరువాత కూడా అదే దీక్షతో తను నమ్మిన సిద్ధాంతానికీ, సంస్థలకీ సేవలు అందించారు. ఆరెస్సెస్‌లో కనిపించే పూర్తి సమయం కేటాయించే కార్యకర్తల మాదిరిగా (ప్రచారక్‌లు)ఆయన పనిచేశారు. అందుకే ఆయన పట్ల సంస్థకు అచంచలమైన గౌరవం. చాలామందికి ప్రేరణ కూడా. ఎందుకంటే ఒక సంస్థలో, వ్యవస్థలో పనిచేయడం చాలామందికి తెలుసు. కానీ ఆయా సంస్థల మౌలిక లక్షణాలనూ, వ్యవస్థాగత రూపురేఖలనూ, తాత్వికతనూ ప్రతి అడుగులోను గౌరవించుకుంటూ పనిలో నిమగ్నం కావడం నిజంగా ప్రత్యేక లక్షణమే. అదే శర్మగారిలో దర్శనమిస్తుంది. తలమునకలుగా కార్యకలాపాలలో మునిగి ఉన్నా కూడా ఏనాడూ ఆయన తన మృదు స్వభావాన్ని వీడలేదు. కానీ చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పడానికి నీళ్లు నమలడం కూడా ఆయన లక్షణం కాదు. ఆయన నిరాడంబర జీవితం కూడా అద్భుతంగా అనిపించేది. ఇదే కుటుంబ సభ్యులకు కూడా వారసత్వంగా ఆయన అందించారు. పిల్లలను విద్యావంతులను చేశారు. నిజానికి ఆయన తన పిల్లలకు ఇచ్చిన ఆస్తులు ఇవి మాత్రమే. జాతీయత, సచ్చీలత వంటి అంశాలను, సిద్ధాంతాలను ఆయన కార్యకర్తలకు ఎరుక పరిచే తీరు స్మరణీయమైనది.వాటి గురించి ఉపన్యాసాలతో వివరించే ప్రయత్నం శర్మగారు ఏనాడూ చేయలేదు. ఆచరణతోనే వాటిని కార్యకర్తలు, తన చుట్టూ ఉన్నవారు గ్రహించేలా చేయడంలో ఆయన ప్రతిభ విశేషంగా కనిపించేది. ఆయన పనిచేసినది ప్రిన్స్‌పాల్‌గా. తరువాత ఏబీవీపీ నిర్మాణం పని. అంటే మొత్తం యువతరంతో, విద్యార్థులతో వ్యవహారం. యువతరాన్ని మంచిబాటలో పెట్టడం చిన్న విషయం కాదు. ఆ వయసునీ, ఆ వయసు తత్వాన్నీ ఆయన అర్థం చేసుకుని ఎందరినో చక్కని పౌరులుగా తీర్చి దిద్దగలిగారు. ఆయన జీవన విధానమే ఎందరినో పరివార్ సంస్థలతో శాశ్వత బంధం ఏర్పరుచుకోవడానికి దోహదం చేసిందంటే అతిశయోక్తి కాదు. ఆయన సరైన సమయంలో నిర్ణయాలు తీసుకునేవారు. అవి సరైన నిర్ణయాలేనని కాలం రుజువు చేసేది. ఇది ఆయన తయారు చేసిన కార్యకర్తలలో ప్రతిబింబించేది కూడా. కార్యకర్తల వ్యక్తిగత జీవితం మీద కూడా శర్మగారి ప్రభావం గణనీయంగా కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యలతో సంస్థ కార్యక్రమాన్ని, నిజం చెప్పాలంటే సామాజిక కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా సంయమనం, సమతుల్యత పాటింప చేయడంలో ఆయన ఇచ్చిన ప్రేరణ ప్రభావం కనిపిస్తుంది. అలాగే సంస్థను నడపడంలో జరిగే పొరపాట్లను సరిచేయడంలో ఆయన చూపిన నైపుణ్యం కూడా ప్రత్యేకమైనది. సమాజం కోసం పనిచేస్తున్న వారు చేసే పొరపాట్లను సరిదిద్దే విధానం చెప్పుదగినది. ఎవరి మనసు నొప్పించకుండా, జరిగిన నష్టాన్ని గుర్తించేటట్టు చేస్తూనే మళ్లీ సంస్థ నడకను గాడిలో పెట్టడంలో శర్మగారు ఉద్దండులు. ఆరెస్సెస్ విద్యా వ్యాప్తికి చేస్తున్న కృషిలో కూడా ఆయన భాగస్థులయ్యారు. అన్ని సంస్థలలో పని చేస్తూ కూడా శర్మగారు కేశవ మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఈ సంస్థ మార్గదర్శకత్వంలో ఎన్నో విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. శర్మగారు మంచి పాఠకుడు. అన్ని పత్రికలు, వార, మాస పత్రికలు చదివేవారు. అందులో వచ్చే ధారావాహికలు కూడా ఆయన ఓపికగా చదివేవారు. సాహిత్యంలో, రచనలలో నడుస్తున్న చరిత్ర ప్రతిబింబిస్తున్నదా లేదా అనే అంశం ఆయనకు పట్టింపుగా ఉండేది. రచనలలో విలువల పతనం గురించి కూడా ఆయన గమనించేవారు. ఏబీవీపీ సంస్థ కోసం ప్రచురించే ‘సాందీపని’పత్రికకు ఆయన సలహాదారు. జాగృతి ప్రకాశన్ ట్రస్ట్‌కు అధ్యక్షులుగా, కార్యదర్శిగా పదిహేనేళ్లు సేవలు అందించారు. ఎంత తక్కువ సమయం ఉన్నా, పత్రికకు అవసరమైన వ్యాసాన్ని అందివ్వడం ఆయనకే సాధ్యమయ్యేది. ఆ పత్రిక కోసం ఎన్నో సంపాదకీయాలు రాశారు. అలాగే రచన జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌గా, అధ్యాపకునిగా కూడా ఆయన సేవలు అందించారు. గత కొన్నేళ్ల నుంచి భారతీయత, జాతీయత, లౌకికవాదం వంటి అంశాల మీద టీవీ చానెళ్లలో తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. అందులో పలు సందర్భాలలో శర్మగారు పాల్గొని జాతీయత అనే అంశం పట్ల స్పష్టత ఇచ్చేందుకు శ్రమించారు. విద్య కాషాయీకరణ అనే అంశం మీద సైద్ధాంతిక సంఘర్షణ జరిగినప్పుడు నిజానిజాల గురించి శర్మ విశిష్టమైన అంశాలను వెల్లడించేవారు. సంఘ్ పరివార్ అభిప్రాయాలను లోకానికి తెలియచేయడానికి, వివరించడానికి ఉద్దేశించిన సమాచార భారతి సంస్థకు ఆయన 12 సంవత్సరాలు అధ్యక్షులుగా పనిచేశారు. ఇన్ని కోణాలలో ప్రతిభను కలిగి ఉన్నప్పటికీ, వాగ్ధాటి ఉన్నప్పటికీ ఆయన ఏనాడూ ఏకపక్షంగా వ్యవహరించేవారు కాదు. సమష్టి నిర్ణయాలను ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానించేవారు. హరిహరశర్మ గారు కన్ను మూయడం ఏబీవీపీకీ, ఆరెస్సెస్‌కు తీరని లోటు. (జూన్ 29న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన హరిహరశర్మకు నివాళిగా) – రాంపల్లి మల్లికార్జునరావు ‘సమాచార భారతి సంపాదకులు‘ 95022 30095 -
వైభవంగా ధ్వజారోహణం
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : కడప నగరంలోని శ్రీవిజయదుర్గాదేవి ఆలయ ద్వాదశ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయ ప్రాంగణంలో ధ్వజారోహణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారి మూలమూర్తికి వేదయుక్తంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం విశేష అలంకారం చేశారు. వేదపండితులు రాయపెద్ది సుబ్బరాయశర్మ, ఆలయ ప్రధాన అర్చకులు ఫణిభూషణశర్మల బృందం ఆలయ వ్యవస్థాపకులు సుధా మల్లికార్జునరావు, నిర్వాహకులు దుర్గా ప్రసాద్‌రావు, తమ కుటుంబ సభ్యులు, భక్తులతో కలిసి మేళతాళాలతో యాగశాల ప్రవేశం చేశారు. అనంతరం వాస్తుపూజ నిర్వహించారు. ఉదయం 11గంటలకు ధ్వజస్థంభం వద్ద పూజలు నిర్వహించి సింహం చిత్రం గల పతాకాన్ని ధ్వజంపై ఎగురవేశారు. ఈ సందర్భంగా ధ్వజపూజలో వినియోగించిన ప్రసాదాన్ని సంతానం లేని మహిళలకు కొడిముద్దలుగా అందజేశారు. అనంతరం యాగశాలలో చండీహోమం, నవావరణ శ్రీచక్రార్చన నిర్వహించారు. రాత్రి అమ్మవారిని సింహవాహనంపై అలంకరించి ఆలయ ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.