breaking news
mahapurnahuthi
-
వైభవంగా త్రిశూల స్నానం
- మహానంది క్షేత్రంలో పూర్ణాహుతి - అంకురార్పణలో మొలకలు వృద్ది - సమృద్ధిగా వర్షాలకు సూచనగా చెప్పిన పండితులు మహానంది: మహానంది క్షేత్రంలో వారం రోజుల పాటు వైభవంగా జరిగిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం మహాపూర్ణాహుతి పూజలతో ముగిశాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం శ్రీ గంగా, శ్రీ కామేశ్వరీదేవి సహీత మహానందీశ్వరస్వామి వారికి రుద్రగుండం కోనేరులో వైభవంగా త్రిశూల స్నానం చేయించారు. వేదపండితులు రవిశంకర అవధాని ఆధ్వర్యంలో పండిత బృందం విశేష ద్రవ్యాభిషేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. రుద్రగుండం కోనేరులో స్వామివారికి నిర్వహించిన త్రిశూల స్నానంలో భక్తులు పాల్గొని తరించారు. కలశ ఉద్వాసన, ధ్వజ అవరోహణ, మూలమూర్తుల కంకణాల విసర్జన, దీక్షా హోమాలు, మహాపూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. అనంతరం స్థానిక స్వామివారి కల్యాణమండపంలో నాగవేళి పూజలు నిర్వహించారు. వేదపండితులు రవిశంకర అవధాని మాట్లాడుతూ 2017 మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అంకురార్పణలో అంకురాలు బాగా మొలిచాయన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయనేందుకు ఇది సూచనగా తెలిపారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్, పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, సూపరింటెండెంట్ ఈశ్వర్రెడ్డి, పాలకమండలి సభ్యులు శ్రీనివాసులు, బాలరాజుయాదవ్, మునెయ్య, రామకృష్ణ, కేశవరావు, శివారెడ్డి, మౌళీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహాపూర్ణాహుతి ప్రారంభం
-
మహాపూర్ణాహుతి ప్రారంభం
ఎర్రవల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన అయుత చండీయాగం చివరి దిశకు చేరుకుంది. ఆదివారం మధ్యాహ్నం యాగంలో ముగింపు కార్యక్రమమైన మహాపూర్ణాహుతి 2 వేల మంది రుత్వికులతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. గత నాలుగు రోజులుగా ఎర్రవల్లిలో భక్తిశ్రద్దలతో చండీయాగం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొద్ది సేపటి క్రితం అగ్ని ప్రమాదం జరిగింది. దురదృష్టవశాత్తు యాగశాల వద్ద అగ్నిప్రమాదం జరిగిందని ..ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి కాలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. మరికాసేపట్లో శాస్త్రోక్తంగా యాగం ముగుస్తుందని ఆయన ట్వీట్ చేశారు. యాగం చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.