breaking news
luxettipeta
-
పువ్వుకు పూజలు..
-
100 ఎకరాల్లో ఆంగ్లేయులు నిర్మించిన చర్చీ.. తెలంగాణలో రెండో అతి పెద్దది
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చర్చీలు క్రిస్మస్ వేడుకల కోసం ముస్తాబయ్యాయి. సంబరాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు విద్యుత్ దీపాలతో అలంకరించారు. యేసు జన్మస్థలంగా భావించే పశువుల పాకలను ఆకట్టుకు నే విధంగా తీర్చిదిద్దారు. ప్రార్థనలు చేసేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని ప్రాచీన లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చికి భక్తుల తాకిడి అధికంగా ఉండనుంది. సాక్షి, లక్సెట్టిపేట(ఆదిలాబాద్): రాష్ట్రంలో మెదక్ తర్వాత అతిపెద్ద చర్చిగా చెప్పుకునే లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చి 86 వసంతాలు పూర్తి చేసుకున్నా నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ చర్చికి క్రిస్మస్కు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. ఆదిలాబాద్‌లోని చర్చిలో.. బ్రిటీష్ కాలంలో నిర్మాణం.. లక్సెట్టిపేట పట్టణానికి సమీపంలో వందెకరాలకు పైగా పచ్చటి పొలాలు, టేకు వనంలో మిషన్ కాంపౌండ్ ప్రాంతంలో ఆంగ్లేయులు ఈ చర్చిని నిర్మించారు. 1920లో ఇంగ్లాండ్‌కు చెందిన రేవ ఈడబ్ల్యూ లాంట్ లక్సెట్టిపేట పట్టణానికి వచ్చి, ఇక్కడే పదేళ్లపాటు మిషనరీ సంస్థలో పనిచేశాడు. 1930లో చర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 95 ఫీట్ల వైశాల్యంతో చర్చి నిర్మాణం, 70 ఫీట్ల వైశాల్యంతో ప్రాంగణం, 46 గొలుసులతో ఉన్న దిమ్మెలు, సుమారు 500 మందికి వసతి కల్పించేవిధంగా ఏర్పాట్లు చేశారు. దీని కోసం ఇంగ్లాండ్ నుంచి ప్లాన్ తెప్పించాడు. నిర్మాణ పనులు చూసే బాధ్యతను రెవ సీజీ అర్లికి అప్పగించారు. ఇంగ్లాండ్ నుంచి రంగురంగుల అద్దాలు, స్థానికంగా ఉన్న గూడెం గుట్ట, గువ్వల గుట్ట, చిన్నయ్య గుట్ల నుంచి రాళ్లు తెప్పించి, బొట్లకుంటలోని నీటిని చర్చి నిర్మాణానికి ఉపయోగించారు. ప్రత్యేకంగా మహారాష్ట్ర నుంచి శిల్పకళాకారులను రప్పించారు. 1935లో రెవ హెచ్ బర్డ్ చర్చి నిర్మాణం పూర్తి చేయించారు. అనంతరం మిషనరీగా వచ్చిన రేవ ఫాస్పూట్ సీఎస్ఐ చర్చిగా నామకరణం చేసి క్రిస్మస్ రోజున ప్రారంభించారు. అప్పటి నుంచి 1954 వరకు ఆంగ్లేయులే చర్చి ఫాదర్లుగా పనిచేశారు. ఫాదర్ నివాసం ఉండేందుకు రెండస్తుల విశాలమైన భవంతిని నిర్మించారు. ప్రస్తుతం పనిచేస్తున్న చర్చి ఫాదర్లు కూడా అందులోనే ఉంటారు. విద్యుత్‌కాంతుల్లో విజయనగరం చర్చి విజయనగరం చర్చికి 55 ఏళ్లు కౌటాల(సిర్పూర్): మండలంలోని విజయనగరం గ్రామంలోని కథోలిక చర్చికి ఘన చరిత్ర ఉంది. విజయనగరంలో 1966లో దీనిని స్థాపించారు. విశాలమైన ప్రాంతంలో చర్చితోపాటు ఎయిడైడ్ పాఠశాల, వసతి గృహం ఉన్నాయి. చర్చికి ప్రతి ఆదివారం 250 వరకు భక్తులు వచ్చి, ప్రార్థనలు నిర్వహిస్తారని ఫాదర్ మనోజ్ తెలిపారు. 30 ఏళ్ల క్రితం పాత భవనాన్ని తొలగించి, అదేస్థలంలో భారీ మందిరాన్ని నిర్మించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకంగా విద్యుత్‌కాంతులతో చర్చిని ముస్తాబు చేశారు. ఏర్పాట్లు చేస్తున్నాం క్రిస్మస్ రోజు లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చికి భక్తులు అధికంగా వస్తుంటారు. పండుగ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలు సంతోషంగా జరుపుకోవాలి. – కరుణాకర్‌రావు, సీఎస్ఐ చర్చి ఫాదర్, లక్సెట్టిపేట కలెక్టర్ చౌక్‌లో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ ట్రీ ముస్తాబైన యేసు మందిరాలు కైలాస్‌నగర్(ఆదిలాబాద్): జిల్లాకేంద్రంలోని కలెక్టర్ చౌక్ వద్ద గల హోలీ ఫ్యామిలీ కాథరల్ చర్చిలో యేసు జన్మస్థలం పశువుల పాకను అందంగా తీర్చిదిద్దారు. రాత్రి 12 గంటలకు యేసు జన్మను స్వాగతిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఖానపూర్లో గల ఇండియా మిషన్ చర్చి, రవీందర్‌నగర్‌లోని సీఎస్ఐ చర్చి, విద్యానగర్‌లోని బేస్ సేబా చర్చిలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా అలంకరణ వస్తువులు సాంటా క్లోస్ దుస్తులు, నక్షత్రాలు, రంగురంగుల వస్తువులు కొనుగోళ్లతో షాపింగ్ మాల్‌లు, జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు రద్దీగా మారాయి. ఆనందంగా గడుపుతాం క్రిస్మస్ రోజు తప్పకుండా అమ్మనాన్నతో కలిసి అందరం చర్చికి వెళ్తాం. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఆనందంగా గడుపుతాం. కొత్త బట్టలు వేసుకుని, ఇంటిని కూడా అందంగా ముస్తాబు చేస్తాం. – డి.ప్రేక్ష, టీచర్స్‌కాలనీ -
ముగిసిన మౌనపోరాటం ఒక్కటైన ప్రేమజంట
సాక్షి, లక్సెట్టిపేట(మంచిర్యాల): మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న యువతి మౌన పోరాటం మంగళవారం ముగిసింది. యువకుడి కుటుంబసభ్యులు వివాహానికి ఒప్పుకోవడంతో రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం పట్టణానికి చెందిన లలిత.. వెంకట్రావుపేటకు చెందిన అరుణ్ ప్రేమించుకున్నారు. కాని వివాహానికి యువకుడి కుటుంబసభ్యులు నిరాకరించడంతో లలిత కుటుంబసభ్యులతో కలిసి అరుణ్ ఇంటి ఎదుట నాలుగు రోజులుగా మౌన పోరాటం చేస్తున్నారు. మంగళవారం పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై ఆత్మహత్యాయత్నం చేయడంతో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అడ్డుకొని శాంతింపజేశారు. యువకుడిని రప్పించి స్థానిక పెద్దమ్మ గుడి వద్ద రెండు కుటుంబాల వ్యక్తులు, ప్రజాప్రతినిధులు మాట్లాడి యువకుడి కుటుంబసభ్యులను వివాహానికి ఒప్పించారు. అనంతరం ఇద్దరికి నిశ్చితార్థం చేసి త్వరలోనే వివాహం జరిపిస్తామని హామీ ఇవ్వడంతో యువతి కుటుంసభ్యులు శాంతించారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
ఆదిలాబాద్ : లక్సెట్టిపేట మండలం చంద్రారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాబూలాల్(35), యమున(30) అనే భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి భారమవడంతో తీర్చలేక ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇద్దరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా...కాసేపటికే భార్య యమున మృతిచెందింది. బాబూలాల్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరికి రూ.5 లక్షల మేర అప్పు ఉన్నట్లు తెలిసింది. దంపతులకు ఇద్దరు సంతానం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లక్సెట్టిపేటలో కారు బీభత్సం
లక్సెట్టిపేట(ఆదిలాబాద్ జిల్లా): ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం కేంద్రంలో ఒక కారు బీభత్సం సృష్టించింది. ఎదురుగా వచ్చిన ఆటోను ఢీ కొని అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. గురువారం గండెపల్లి మండలం నుంచి లక్సెట్టిపేట మండలానికి వెళ్తున్న ఆటోను కారు ఢీ కొట్టడంతో ఆటోలో ఉన్న 11 మంది గాయపడ్డారు. అయితే, డ్రైవర్ కారును అపకుండా వెళ్లిపోయాడు. అనంతరం రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి ఎదురుగా వస్తున్న బస్సును సైతం ఢీ కొట్టింది. బస్సును ఢీ కొనడంతో డ్రైవర్ కారును అక్కడే వదిలి పారిపోయాడు. కాగా, గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు గండెపల్లి మండలం మేజర్పేట గ్రామానికి చెందినదిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.