ఏడుగురు ఆర్మీ అధికారులకు జీవిత ఖైదు
బూటకపు ఎన్కౌంటర్ కేసులో ఏడుగురు ఆర్మీ అధికారులకు జీవిత ఖైదు శిక్ష పడింది. 2010 సంవత్సరంలో జమ్ము కాశ్మీర్లోని మాచిల్ ప్రాంతంలో ముగ్గురు పౌరులను ఉగ్రవాదులని ముద్ర వేసి ఎన్కౌంటర్లో హతమార్చినట్లు వీళ్లపై తొలుత ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇద్దరు అధికారులతో సహా మొత్తం ఏడుగురు సిబ్బందిపై నేరం రుజువైంది. దాంతో వారందరికీ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. వారి సర్వీసు ప్రయోజనాలను కూడా సస్పెండ్ చేశారు.
2010 సంవత్సరంలో ఉత్తర కాశ్మీర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులను ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబ్బు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి కుప్వారా ప్రాంతానికి పిలిపించారు. కుట్రపన్ని వాళ్లను పిలిపించినట్లు ఆరోపణలు వచ్చాయి. వారిని నియంత్రణ రేఖ వద్దకు తీసుకెళ్లి బూటకపు ఎన్కౌంటర్లో హతమార్చారన్నారు. వాళ్లంతా పాకిస్థానీ ఉగ్రవాదులని, సరిహద్దు దాటి మన దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా ఎన్కౌంటర్ చేశామని అన్నారు. ఈ ఘటన నేపథ్యంలో కాశ్మీర్ లోయ ప్రాంతంలో సైన్యంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు వాళ్లు ఏడుగురికీ జీవితఖైదు విధించారు.