జర్నలిస్టులపై కక్ష సాధింపు తగదు
జగద్గిరిగుట్ట: వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రిక, సాక్షి జర్నలిస్ట్‌లపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గు చేటని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజవర్గంలో జర్నలిస్ట్ సంఘాలు, అఖిల పక్ష నాయకులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఖరిని నిరసనగా ర్యాలీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీశైలంగౌడ్ మాట్లాడుతూ .. ఏపీలో రాజధాని ఏర్పాటుకు ముందే రైతులను మోసం చేసి మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు జరిపిన భూదందాలపై పూర్తి ఆధారాలతో వెలుగులోకి తేవడంతో జీర్ణించుకోలేని ప్రభుత్వం శనివారం పోలీసుల ద్వారా సాక్షికి నోటీసులు జారీ చేయడం సిగ్గు చేటన్నారు.
ఓటుకు నోటు కేసులో తప్పు చేయని చంద్రబాబు కోర్టుకు ఎందుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని ప్రశ్నించారు. ఏపీ లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను పూర్తి ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియ పరుస్తున్న సాక్షి పై చంద్రబాబు చర్యలు గర్హనీయమన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం జర్నలిస్ట్‌లకు జారీ చేసిన నోటీసులను వెనక్కి తీసుకుని భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఐజేసీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు రంగు వెంకటేశ్‌గౌడ్ మాట్లాడుతూ..ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆత్మ పరిశీలన చేసుకుని జర్నలిస్టులపై గతంలో పెట్టిన కేసులను, ప్రసుత్తం జారీ చేసిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో టీయూడబ్లు్యజే రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది బాల్‌రాజ్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ఎత్తరి మారయ్య, రుద్ర అశోక్, సీపీఐ నాయకుడు చర్లపల్లి రాములు, వెంకటేశ్, సోమన్న, టీఎంజేఏసీ జిల్లా అధ్యక్షుడు కమ్మెట భూపాల్,
తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి రామస్వామి, చిరమర్తి రాజు, జేఏసీ కన్వీనర్ శివరాత్రి యాదగిరి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గొరిగె బాలప్ప, చింతకుంట వెంకటేశ్ యాదవ్, గౌరిశెట్టి శివఈశ్వర్రావు, యువజన కాంగ్రెస్ నేత రమేష్ మంజల్కర్, రమేష్‌గౌడ్, ఖాజామియా తదితరులు పాల్గొన్నారు.