breaking news
Kulsoom Nawaz
-
మరణశయ్యపై మాజీ ప్రధాని భార్య
లండన్: పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ భార్య కుల్సూమ్ నవాజ్(68) పరిస్థితి విషమించింది. లండన్‌లోని హర్లే స్ట్రీట్ క్లినిక్‌లో ఆమె చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ‘ఆమె పరిస్థితి బాగా విషమించింది. పరిస్థితులు చేజారిపోయాయి’ అని వైద్యులు మంగళవారం ఉదయం ప్రకటించారు. షరీఫ్ కుటుంబ సభ్యులంతా లండన్‌కు చేరుకుంటున్నట్లు జీయో టీవీ ఓ కథనం ప్రచురించింది. గొంతు కాన్సర్(లింపోమా)తో బాధపడుతున్న కుల్సూమ్‌ను కుటుంబ సభ్యులు లండన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 2017 ఆగష్టు నుంచి ఆమెకు పలు శస్త్రచికిత్సలు జరిగాయి. మధ్యలో కాస్త కోలుకున్నట్లు కనిపించినప్పటికీ, ఏప్రిల్ నుంచి ఆమె ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తోంది. జూన్ 14న తీవ్రమైన గుండెపోటు రావటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆమెను ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఐదుగురు వైద్యుల బృందం ఆమె పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఉదయం పరిస్థితి బాగా విషమించటంతో వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.కాగా, కుల్సూమ్ అనారోగ్యం నేపథ్యంలో భర్త నవాజ్, కుమార్తె మరయమ్ నవాజ్‌లు లండన్‌లోనే ఉన్నారు. పనామా పేపర్ల వ్యవహారంతో గతేడాది పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీష్ గద్దె దిగిపోగా.. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన ఎన్ఏ-120 నియోజక వర్గ ఉప ఎన్నికల్లో కుల్సుమ్ నవాజ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. అనారోగ్యంతో ఆమె రాజకీయ వ్యవహారాలను కూతురు మరయమ్ చూసుకుంటున్నారు. వచ్చేనెల 25న జరగబోయే పాకిస్థాన్ జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కుల్సూమ్ నవాజ్ పోటీ చేయాల్సి ఉంది. -
మాజీ ప్రధాని భార్యకు క్యాన్సర్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. పనామా కుంభకోణంతో ప్రధానమంత్రి పదవిని షరీఫ్ కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన భార్య కుల్సుమ్ నవాజ్‌కు గొంతు సంబంధిత క్యాన్సర్ వ్యాధి వచ్చినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న కుల్సుమ్కు అక్కడే శస్త్ర చికిత్స చేయిస్తారని తెలిసింది. నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటు అనంతరం ఖాళీ అయిన స్థానంలో పోటీ చేసేందుకు కుల్సుమ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాహోర్‌లోని ఎన్ఏ-120 స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఈసీకి అభ్యంతరాలు రావడంతో వైద్య పరీక్షల కోసం కుల్సుమ్ లండన్‌కు వెళ్లారు. వైద్య పరీక్షల్లో గొంతు సంబంధిత క్యాన్సర్ వ్యాధి వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. అయితే, కుల్సుమ్కు వచ్చిన క్యాన్సర్ తొలి దశలో ఉండటం వల్ల వ్యాధిని నయం చేయడానికి అవకాశం ఉందని పాకిస్తాన్ మీడియా పేర్కొంది.