119 దేశాలు, లక్ష మంది.. గిన్నిస్ రికార్డు బద్దలు
దుబాయి: 119 దేశాలవారు, లక్ష మందికిపైగా ఒకేసారి యూఏఈ జాతీయ గీతాన్ని ఆలపించి గిన్నిస్ రికార్డు నమోదు చేశారు. మంగళవారం యూఏఈ 43వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం యూఏఈలో కేఎస్ వార్కీ అనే భారతీయుడు నడుపుతున్న ‘జెమ్స్ ఎడ్యుకేషన్’ గ్రూపు స్కూళ్లకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఇతర సిబ్బంది కలిసి పాత రికార్డును బద్దలుకొట్టారు. యూఏఈలోని 40 జెమ్స్ స్కూళ్లలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం లక్ష మందికి పైగా ఏకకాలంలో యూఏఈ జాతీయ గీతం ‘ఇషై బలాది’ (లాంగ్ లివ్ మై నేషన్)ను ఆలపించారు. ఇంతకుముందు 50 దేశాలకు చెందిన విద్యార్థులు ఒకేసారి జాతీయ గీతం ఆలపించడమే గిన్నిస్ ప్రపంచ రికార్డుగా నమోదైంది.