breaking news
Kovuru Assembly Constituency
-
ఓటమి భయంతో టీడీపీ అడ్డదారులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాష్ట్రంలో టీడీపీ గ్రాఫ్ రోజురోజుకూ దిగజారిపోతుండడంతో ఓటమి భయం పట్టుకున్న ఆ పార్టీ అభ్యర్థులు చివరికి అడ్డదారులు ఎంచుకున్నారు. ఆయారాం, గయారాంలను గుర్తించి ప్యాకేజీ ఆఫర్లతో వారిని కొనుగోలు చేసేందుకు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి పనిచేసి ఆ పార్టీ ఓడిపోయాక అధికారం కోసం వైఎస్సార్సీపీ చెంత చేరిన నేతలే ఇప్పుడు టీడీపీ నేతల ప్యాకేజీలకు కక్కుర్తిపడుతున్నారు. నిఖార్సైన వైఎస్సార్సీపీ నేతలు మాత్రం వారిచ్చే ప్యాకేజీలకు లొంగకుండా పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఇక టీడీపీ నేతల బరితెగింపును చూస్తున్న ఓటర్లు మాత్రం వారిని ఛీదరించుకుంటున్నారు. తాజాగా.. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఏకంగా కోవూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోదరుడు రాజేంద్రరెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు రూ.3 కోట్లు ఆఫర్ ఇవ్వడం బట్టబయలు కావడంతో టీడీపీ అభ్యర్థుల బాగోతం వెలుగులోకి వచ్చింది. నిజానికి.. వేమిరెడ్డి దంపతులు ఓట్ల కొనుగోలుకు నోట్ల కట్టలను విచ్చలవిడిగా విసురుతున్నారు. గంపగుత్తగా ఓట్లు కొనుగోలు చేసేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు భారీ మొత్తంలో ఎరవేస్తున్నారు. ఇటీవల కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలం కృష్ణాపురంలో మత్స్యకార గ్రామాల్లో దురాయి ఆచారాన్ని అడ్డం పెట్టుకుని ఓట్ల కొనేందుకు రూ.80 లక్షలకు బేరం పెట్టిన విషయం బయటకు పొక్కింది. ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం నిఘా ఉంచడంతో వీరు తాజాగా ప్రజాప్రతినిధులపై దృష్టిసారించారు. ప్రజాప్రతినిధులకు ప్యాకేజీలు.. ఇక నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను టార్గెట్ చేసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వారికి ప్రత్యేక ప్యాకేజీలు ఆఫర్ చేస్తునారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలతోపాటు స్థానిక లీడర్లకు రూ.15 లక్షలు.. ఎంపీపీలు, జెడ్పీటీసీలకు రూ.25 లక్షల చొప్పున రేటు ఫిక్స్ చేశారు. వీరి పరిధిలో ఓట్లు వేయించే బాధ్యత మీదే అంటూ టార్గెట్లు పెడుతున్నారు. అలాగే, ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, కందుకూరు నియోజకవర్గాలతో పాటు తన సతీమణి పోటీచేస్తున్న కోవూరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులకు రేట్లు ఫిక్స్చేసి ప్రలోభాలకు గురిచేయడం వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా కోవూరు నియోజకవర్గంలో ఆయారాం, గయారాంలను ఒకొక్కరిని రహస్యంగా తమ శిబిరాలకు పిలిపించుకుని మాట్లాడుతున్నారు. బుచి్చరెడ్డిపాళెం మండలంలోని వవ్వేరు బ్యాంకు చైర్మన్లుగా పనిచేసిన ఇద్దరు నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు. వారిలో ఒకరు గత ఎన్నికల్లో టీడీపీకి పనిచేసిన నేత కావడం గమనార్హం. ఎన్నికల వేళ ప్యాకేజీ ఆఫర్ పెంచుకుని తిరిగి సొంత పార్టీలోకి మారారని టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు. అలాగే, జొన్నవాడ ఆలయ మాజీ చైర్మన్ కూడా ఇదే తరహా ప్యాకేజీలతో పార్టీ ఫిరాయించారని చెబుతున్నారు. నేతలకు ప్యాకేజీలతో పాటు ఓటర్లకు సైతం భారీగానే డబ్బులిస్తామని, ఆ డబ్బుల పంపిణీ బాధ్యత కూడా మీదే అని ఆశపెట్టి మరీ పార్టీ కండువా కప్పుతున్నారు. ఇలా ప్రజాప్రతినిధులతో పాటు ఆయా గ్రామాల్లో బలమైన నేతలకు సైతం ప్యాకేజీలు అందించేందుకు వేమిరెడ్డి తన బంధుగణంతో ఏర్పాటుచేసుకున్న టీమ్‌తో వ్యవహారాలు నడిపిస్తున్నారు. రివర్స్ అవుతున్న ఓటర్లు.. కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి దంపతులు మండల స్థాయి నేతలకు రూ.కోట్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రూ.లక్షల్లో ప్యాకేజీలు ఇస్తున్నారు. ప్యాకేజీలు తీసుకున్న వారు ఈ దఫా ఎన్నికల్లో ప్రశాంతిరెడ్డికి ఓట్లు వేద్దామని స్థానికులకు చెబుతుండడంతో ‘ఎంత డబ్బులు తీసుకున్నారు వాళ్ల దగ్గర’.. అంటూ భగ్గుమంటున్నారు. తమకు సీఎం జగన్ రూ.లక్షల్లో సాయం అందించారని, ఇప్పుడు మీరు చెప్పిన వాళ్లకు ఓటేసి ఆయనకు ద్రోహం చేయలేమని ఓటర్లు తెగేసి చెబుతున్నారు. -
ప్రశాంతిరెడ్డి అభ్యర్థిత్వంపై దినేష్‌రెడ్డి ఆగ్రహం
టీడీపీ కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో ఆశావహుడు పోలంరెడ్డి దినేష్‌రెడ్డి, ఆయన తండ్రి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తమ ఆక్రోశం వెళ్లగక్కారు. 20 ఏళ్ల పాటు ప్రజలతో అనుబంధం ఉన్న తమ కుటుంబాన్ని కాదని.. కనీస పరిచయం లేని ఆమెను బరిలో ఎలా నిలుపుతారంటూ టీడీపీ అధినేతలపై మండిపడిన వీరు అంతలోనే మౌనం దాల్చారు. ఇలా మెత్తపడటంతో వీరి తీరును జీర్ణించుకోలేని టీడీపీ కేడర్ అయోమయంలో పడింది. కోవూరు: విజయమే లక్ష్యంగా టీడీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి చర్యలకై నా వెనుకాడటంలేదు. కుదిరితే వెన్నుపోటు.. కుదరకపోతే డబ్బు సంచులనే రీతిలో ముందుకెళ్తోంది. కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రాజకీయ వారసుడిగా టీడీపీలో అరంగ్రేటం చేసిన తనయుడు పోలంరెడ్డి దినేష్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తును ఆ పార్టీ అధిష్టానం ప్యాకేజీతో సమాధి చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆశలు ఆవిరి టీడీపీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిని తానేనంటూ దినేష్‌రెడ్డి దాదాపు రెండున్నరేళ్లుగా ప్రచారం చేసుకున్నారు. రాజకీయాల్లో యువతరానికి ప్రాధాన్యమంటూ చంద్రబాబు, లోకేశ్ తమ ప్రచారాలతో ఊదరగొట్టారు. వీరి వ్యాఖ్యలతో తనకు ఇక తిరుగులేదనే ఊహల పల్లకిలో దినేష్‌రెడ్డి విహరించారు. అయితే అనూహ్యంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కోవూరు టికెట్‌ను ఖరారు చేసి తమ చేష్టలతో దినేష్‌రెడ్డిని నేలపైకి తీసుకొచ్చారు. మొదట్లో ధిక్కారస్వరం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కోవూరు అభ్యర్థిగా ఖరారు చేయడంతో తండ్రీకొడుకులు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, దినేష్‌రెడ్డి హతాశులయ్యారు. టీడీపీ నిర్వహించిన నాలుగు సర్వేల్లోనూ దినేష్‌రెడ్డి తొలి స్థానంలో ఉన్నా.. ధనబలం, రాజకీయ పరపతితో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి టికెట్‌ను కేటాయించి తమ గొంతు కోశారని ఆత్మీయ సమావేశంలో ఫైరయ్యారు. 2014 ఎన్నికలకు ముందు కోవూరులో టీడీపీకి అభ్యర్థి లేకపోతే.. కాంగ్రెస్‌లో ఉన్న తనను చంద్రబాబు బతిమిలాడి పార్టీ టికెట్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారం కోల్పోయాక పార్టీ కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చామని చెప్పారు. లోకేశ్ నిర్వహించిన యువగళం యాత్రకు దాదాపు రూ.15 కోట్ల వరకు ఖర్చు పెట్టామని, తమకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని అల్టిమేటమిచ్చారు. ఫలించిన ‘డబ్బు’ సంప్రదింపులు ఈ తరుణంలో పోలంరెడ్డితో పార్టీ పెద్దలు సంప్రదింపులు జరిపారు. రూ.30 కోట్లకు బేరం పెట్టగా, చివరికి రూ.20 కోట్లకు ఓకే అన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో పోలంరెడ్డి మౌనం దాల్చారని తెలుస్తోంది. అయితే ఇవ్వాల్సిన మొత్తంలోనూ రూ.ఐదు కోట్ల మేర పంగనామం పెట్టడంతో పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరమయ్యారనే టాక్ వినిపిస్తోంది. దిక్కుతోచని స్థితిలో కేడర్ పార్టీ అధిష్టానం పునరాలోచన చేయకపోతే ఇండిపెండెంట్‌గా దినేష్‌రెడ్డి పోటీ చేయాలని.. తామంతా టీడీపీకి కాకుండా ఆయనకే మద్దతుగా నిలుస్తామని కేడర్ చెప్పారు. ఎవరు పోటీ చేసినా తమ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. అయితే కేడర్ వ్యాఖ్యలపై పోలంరెడ్డి దినేష్‌రెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మౌనంగా ఉన్నారు. ఈ తరుణంలో కేడర్‌లో స్తబ్దత నెలకొంది.