breaking news
Kovidh
-
ఘనంగా జాతీయ క్రీడాపురస్కారాల ప్రధానోత్సవం
-
100 కోట్ల టీకా డోసుల పంపిణీ
-
కోవిడ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
-
‘కోవిడ్’ దెబ్బ.. ఇ–కామర్స్ విలవిల!
సాక్షి, అమరావతి : చైనాను వణికిస్తున్న కోవిడ్ (కరోనా వైరస్) ధాటికి ఇ–కామర్స్, ఎలక్ట్రానిక్స్ వ్యాపారం కుదేలైంది. చైనా నుంచి దిగుమతులు నిలిచిపోవడం దేశీయ వ్యాపార రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. 31.50 బిలియన్ డాలర్ల విలువైన దేశీయ ఇ–కామర్స్ వ్యాపారం చైనాలో నెలకొన్న పరిణామాలతో మందగించింది. మన రాష్ట్రంలో ఏటా 50 మిలియన్ల ఫోన్లు తయారవుతుండగా దేశవ్యాప్తంగా 225 మిలియన్ల మొబైల్ ఫోన్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీరందరిలో ఇప్పుడు ఆందోళన నెలకొంది. గడ్డు కాలమే చైనా నుంచి దిగుమతుల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, విడి పరికరాలే సింహభాగం ఉండటం గమనార్హం. మన దేశంలో తయారయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు అవసరమైన విడి భాగాలు చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఇప్పుడు ఇవి నిలిచిపోవడంతో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ, వ్యాపారరంగం విలవిలలాడుతోంది. ఫిబ్రవరి నెలాఖరు కల్లా దిగుమతులు పునఃప్రారంభం కాకుంటే గడ్డు పరిస్థితి తప్పదని పరిశ్రమ వర్గాలు చెబుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సందిగ్ధంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇ–కామర్స్ వ్యాపారంలో మన దేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. దేశంలో ఏటా 14.80 బిలియన్ డాలర్ల విలువైన ఇ–కామర్స్ వ్యాపారం స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై ఆధారపడి జరుగుతోంది. ఇందులో స్మార్ట్ ఫోన్ల వ్యాపారం 10.71 బిలియన్ డాలర్లు ఉంది. వివిధ దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలన్నీ చైనాలోనే ఫ్యాక్టరీలు, అసెంబ్లింగ్ యూనిట్లు నెలకొల్పాయి. అక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. ప్రస్తుతం చైనా నుంచి దిగుమతులు నిలిచిపోవడంతో దేశంలో ఇ–కామర్స్ వ్యాపారం బాగా దెబ్బతింది. దేశంలోని రెండు పెద్ద ఇ–కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు వారం రోజులుగా బుకింగ్‌లపై సందిగ్ధంలో పడ్డాయి. ఆర్డర్ల డెలివరీని వాయిదా వేస్తున్నాయి. దేశంలో 85 శాతం ఇ–కామర్స్ వ్యాపారం ఈ రెండు సంస్థల ఆధీనంలోనే ఉండటం గమనార్హం. కొత్త మోడళ్లు వాయిదా... యాపిల్ ఫోన్‌తోపాటు ఇతర ప్రముఖ బ్రాండ్లలో అత్యధిక శాతం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. తాజాగా యాపిల్ ఫోన్ల సరఫరా నిలిచిపోయింది. షియామీ కంపెనీ తమ ఉత్పత్తుల దిగుమతి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్ల నిల్వలు మరో పదిరోజుల వరకే సరిపోతాయని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఫోన్ల లాంచింగ్‌ను కంపెనీలు వాయిదా వేసే యోచనలో ఉన్నాయి. చివరి త్రైమాసికంలో శరాఘాతం కోవిడ్ వైరస్ తీవ్రతకు ఈ త్రైమాసికంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాల మార్కెట్ కోలుకోవడం కష్టమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరు కల్లా దిగుమతులు పునఃప్రారంభం కాకుంటే మార్చిలో విక్రయాలు బాగా దెబ్బతింటాయి. గత ఏడాదితో పోలిస్తే స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 15 శాతం వరకూ తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నెలాఖరు తరువాత కష్టాలే! ‘ప్రస్తుతం మొబైల్ ఫోన్ల ఉత్పత్తి కొనసాగిస్తున్నాం. ఈ నెలాఖరు వరకు ఫర్వాలేదు. అప్పటికి కూడా చైనా నుంచి దిగుమతులు పునఃప్రారంభం కాకుంటే ఉత్పత్తి నిలిపివేసి కొందరు కార్మికులకు తాత్కాలిక సెలవు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో’ అని ఓ మొబైల్ తయారీ కంపెనీ ప్రతినిధి ‘సాక్షి’తో పేర్కొన్నారు. 88 శాతం విడిభాగాలు చైనా నుంచే దేశంలో ఏటా 225 మిలియన్ల మొబైల్ ఫోన్లు తయారవుతుండగా రాష్ట్రంలోని శ్రీసిటీ సెజ్‌లో దాదాపు 50 మిలియన్ల ఫోన్లు ఉత్పత్తవుతున్నాయి. వీటి తయారీకి అవసరమైన విడి భాగాల్లో 12 శాతం మాత్రమే దేశీయంగా లభిస్తుండగా 88 శాతం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. తాజాగా దిగుమతులు నిలిచిపోవడంతో మొబైల్ ఫోన్ల ఉత్పత్తిపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం ఉన్న విడి భాగాలతో గరిష్టంగా ఈ నెలాఖరు వరకు మాత్రమే ఉత్పత్తి కొనసాగించవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
కరాటే ‘కోవిదుడు’
* చిరుప్రాయంలోనే అత్యంత ప్రతిభ * ఆరేళ్ల వయస్సులోనే బ్లాక్‌బెల్ట్ కైవసం * తండ్రి బాటలో తనయుడు కల్లూరు : వయస్సు ఆరున్నర ఏళ్లు. చదువేది మూడో తరగతే. ఇంత చిరుప్రాయంలో అతడు అత్యంత ప్రతిభను కనబరుస్తున్నాడు. కరాటేలో రాణిస్తూ బ్లాక్‌బెల్ట్ సైతం కైవసం చేసుకున్నాడు. కల్లూరుకు చెందిన గొల్లమందల కోవిద్ పట్టణంలోని సెంచరీ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. తండ్రి సురేష్‌కుమార్ కరాటే మాస్టర్. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ఆసక్తి ఉన్న వారికి కరాటేలో తర్ఫీదు ఇస్తున్నాడు. తండ్రి వద్ద శిక్షణ తీసుకున్న కోవిద్ ఈ విద్యలో దూసుకెళ్తున్నాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు అత్యంత ప్రతిభను చాటుతున్నాడు. గత నెల వరంగల్‌లో వరల్డ్ ఫునకోస్ షోటోకాన్ కరాటే రాష్ట్ర చీఫ్ ఎగ్జామినర్ ఎం.డి.యాకూబ్ నిర్వహించిన బెల్ట్ టెస్టులో రాణించాడు. బ్లాక్‌బెల్ట్ సాధించి శభాష్ అనిపించుకున్నాడు. కోవిద్ సాధించిన విజయాలు * 2013 ఆగస్టు 25న హన్మకొండలో జరిగిన స్టేట్ ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కరాటే, కుంగ్‌ఫూ చాంపియన్ షిప్ పోటీల్లో అండర్-10 బాలుర కటా విభాగంలో తృతీయ స్థానం. * 2013 అక్టోబర్ 20న విజయవాడలో జరిగిన ఫస్ట్ ఆలిండియా ఇన్విటేషనల్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో కటా విభాగంలో ప్రథమ స్థానం. * 2013 నవంబర్ 10న గుంటూరులోని మంగళగిరిలో జరిగిన ఏపీ స్టేట్ ఇన్విటేషనల్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో కటా విభాగంలో ప్రథమ స్థానం. * 2013 డిసెంబర్ 22న వరంగల్‌లో జరిగిన నేషనల్ వరల్డ్ ఫునకోస్ షోటోకాన్ కరాటే చాంపియన్ షిప్ పోటీలో కటా విభాగంలో ద్వితీయ స్థానం. * ఈ ఏడాది జనవరి 14న ఏపీలోని నిడదవోలులో జరిగిన 14వ ఓపెన్ ఇన్విటేషనల్ స్టేట్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో ద్వితీయ స్థానం. * ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఖమ్మంలో నిర్వహించిన స్టేట్ ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కరాటే, కుంగ్‌ఫూ చాంపియన్ షిప్ పోటీల్లో కటా విభాగంలో ద్వితీయ స్థానం సాధించాడు. నిరంతర శిక్షణతోనే.. నిరంతర శిక్షణ ద్వారా కరాటేలో ప్రతిభ చాటొచ్చు. మా అబ్బాయి కోవిద్ అదే చేశాడు. దీంతో ఇంత చిన్నప్రాయంలోనే అతడు రాణించాడు. కరాటేలో కోవిద్ ముందుకు దూసుకెళ్లడం ఒక తండ్రిగానే కాకుండా గురువుగా గర్వపడుతున్నాను. - గొల్లమందల సురేష్ కుమార్, కరాటే మాస్టర్