breaking news
Kisan Vikas
-
చిన్న పొదుపులపై వడ్డీరేట్లు యథాతథం
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రస్తుతం లభిస్తున్న వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సంమృద్ధి యోజనసహా అన్ని పొదుపు పథకాలపై ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో యథాపూర్వ వడ్డీరేట్లు కొనసాగుతాయని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మూడు నెలలకు ఒకసారి పొదుపు పథకాలపై వడ్డీరేట్లను సమీక్షించి ఆయా రేట్ల కొనసాగింపు లేదా మార్పులపై కేంద్రం నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. -
మళ్లీ కిసాన్ వికాస్ పత్రాలు
సురక్షితమైన రాబడులను కోరుకునే చిన్న ఇన్వెస్టర్ల కోసం ప్రభుత్వం మళ్లీ కిసాన్ వికాస్ పత్రాలను (కేవీపీ) పునరుద్ధరించాలని నిర్ణయించింది. తాజా బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది దుర్వినియోగం అవుతోందనే ఉద్దేశంతో 2011 నవంబర్‌లో దీన్ని ప్రభుత్వం రద్దు చేసింది. పెట్టిన పెట్టుబడి దాదాపు ఎనిమిదేళ్ల ఏడు నెలల్లో రెట్టింపు చేసే కిసాన్ వికాస్ పత్రాలు అత్యంత ఆదరణ పొందాయి. పేరులో కిసాన్ అని ఉన్నప్పటికీ ఇది కేవలం రైతులకు మాత్రమే ఉద్దేశించినది కాదు. ఎవరైనా వీటిలో ఇన్వెస్ట్ చేసేలా గతంలో నిబంధనలు ఉండేవి. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం.. అత్యంత తక్కువగా రూ. 100లైనా పెట్టుబడి పెట్టొచ్చు. ప్రభుత్వ హామీ ఉండే ఈ సేవింగ్ బాండ్స్‌ను పోస్టాఫీసుల్లో తీసుకోవచ్చు. ఇందుకోసం ఉద్దేశించిన ఫారంతో పాటు ఫొటోగ్రాఫ్‌లు, డిపాజిట్ చేయదల్చుకున్న మొత్తాన్ని ఇస్తే పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికెట్‌ను అందజేస్తుంది. ఇందులో మీ పేరు, డిపాజిట్ మొత్తం, మెచ్యూరిటీ తేదీ, మెచ్యూరిటీ తీరాక చేతికి ఎంత వస్తుంది వంటి వివరాలు ఉంటాయి. సాధారణంగా జారీ చేసిన తేదీ నుంచి రెండున్నరేళ్ల తర్వాత కావాలనుకుంటే వీటిని నగదు కింద మార్చుకోవచ్చు. ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు కిసాన్ వికాస్ పత్రాలను.. హామీగా కూడా ఉంచుకుని వివిధ రకాల రుణాలు ఇస్తుంటాయి. అయితే, వీటిపై వచ్చే వడ్డీ ఆదాయం మీద పన్ను మాత్రం కట్టాల్సి ఉంటుంది. ఇదంతా రద్దు చేయడానికి ముందు కిసాన్ వికాస్ పత్రాల స్వరూపం. తాజా స్వరూపం ఎలా ఉంటుందనేది ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.