breaking news
Kasinathuni Viswanath
-
కళాతపస్వికి సాక్షి జీవన సాఫల్య పురస్కారం
భారతీయ సంగీతానికి వెండితెరపై కె.విశ్వనాథ్ తొడిగిన బంగారు కంకణం..‘శంకరాభరణం’. పాశ్చాత్య సంగీతానికి ఆదరణ పెరుగుతున్న రోజుల్లో శంకరశాస్త్రి అనే ఒక పాత్రకు యాభై ఏళ్ల వ్యక్తిని హీరోగా పెట్టి.. భారతీయ సంగీత విలక్షణతను చాటే ఒక సినిమా తీయడం ఆ రోజుల్లో పెద్ద సాహసం. కానీ, దర్శకుడు కె. విశ్వనాథ్‌కు అది నమ్మకం. తన పట్ల, తను ప్రాణంగా ప్రేమించే సంగీతం పట్ల ఉన్న నమ్మకం. ఆ చిత్రం వెండితెరపై చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచ వేదికలపై ఊరేగించింది. అప్పటి వరకు కె.విశ్వనాథ్ అంటే ప్రేక్షకులకు అభిమానం. ‘శంకరాభరణం’ తర్వాత ఆ అభిమానం గౌరవంగా కూడా మారింది. ‘స్వాతిముత్యం’తో ఆస్కార్ ఎంట్రీ హీరోను బట్టి సినిమాకు వెళ్లే రోజుల్లో.. ఇది కె.విశ్వనాథ్ సినిమా అంటూ థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకులను సంపాదించుకున్నారు ఆయన. ‘స్వాతిముత్యం’తో తెలుగు సినిమాకు ఆస్కార్ ఎంట్రీ తెచ్చిపెట్టిన ఘనత ఆయన సొంతం. పాటను తన సినిమాకు ఊపిరిగా భావించే ఈ విశ్వనాథుడు.. వేటూరి, సిరివెన్నెల వంటి గొప్ప సాహితీ శిఖరాలను సినిమా రంగానికి పరిచయం చేశారు. చూపులేని హీరో, మాటలు రాని హీరోయిన్‌తో వెండితెరపై ఈ కళాతపస్వి సృష్టించిన దృశ్యకావ్యం.. ‘సిరివెన్నెల’.. మరో అద్భుతం. ఎంత గొప్ప దర్శకుడో అంత గొప్ప నటుడు కథకు కావలసిన నటుల్ని ఎంచుకుని, ఏరుకుని కథే హీరోగా సినిమాలు చేసిన గొప్ప దర్శకులు కె.విశ్వనాథ్. కమలహాసన్ చేపలు పట్టే జాలరిగా కనిపించినా, చిరంజీవి చెప్పులు కుట్టే పాత్ర చేసినా.. అది ఆ దర్శకుని మీద ఉన్న నమ్మకం, గౌరవం తప్ప ఇంకోటి కాదు. స్టార్ హీరోలుగా తిరుగులేని ఇమేజ్ ఉన్నవాళ్లు కూడా కె.విశ్వనాథ్ డెరైక్షన్‌లో ఒక్క పాత్రయినా చేయకపోతే తమ జీవితానికి లోటుగా భావించే స్థాయికి ఎదిగిన గొప్ప దర్శకులు ఆయన. పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు కాంబినేషన్లో ఎన్నో క్లాసిక్స్ అందించిన కె.విశ్వనాథ్.. హిందీ చిత్ర పరిశ్రమలో కూడా తన మార్కు చూపించారు. ‘శుభసంకల్పం’ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేసిన తర్వాత ఈ కళాతపస్వి ప్రేక్షకులకు మరింత దగ్గరైపోయారు. ఉన్నతమైన విలువలు ఉన్న పాత్రల్లో చాలా సహజంగా నటించి.. ఎన్నో చిత్రాల్లో పతాక సన్నివేశాలకు ప్రాణం పోశారు కె.విశ్వనాథ్. అవార్డులకే నిండుదనం కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఐదు చిత్రాలు జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి. డెరైక్టర్‌గా, నటుడిగా మొత్తం నాలుగు నందులు అందుకున్న విశ్వనాథ్‌ను పది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వరించాయి. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. అదే ఏడాది భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీతో గౌరవించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూడా ఈ కళాతపస్విని డాక్టరేట్‌తో సత్కరించుకుంది. -
డైరెక్టర్ విశ్వనాథ్ కు సాక్షి ఎక్సలెన్స్ అవార్డు
హైదరాబాద్: ప్రముఖ సినీదర్శకుడు కె.విశ్వనాథ్ గారికి సాక్షి ఎక్సలెన్స్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ప్రదానం చేశారు. సాక్షి చైర్ పర్సన్ వైఎస్ భారతి, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ చేతుల మీదుగా కళాతపస్వి విశ్వనాథ్ అవార్డు అందుకున్నారు. సినీరంగంలో చేసిన అత్యుత్తమ సేవలను గుర్తించిన సాక్షి సంస్థ 2015 సంవత్సరానికిగానూ ఈ అవార్డును నేడు ఆయనకు ప్రధానంచేశారు. సాక్షి ఎక్సలెన్స్ అవార్డులో ఈరోజు మొట్టమొదటి అవార్డు అందుకున్న అమర జవాను ముస్తాక్ అహ్మద్ భార్య, ఓ చేతిలో బిడ్డతో వచ్చి అవార్డు తీసుకోవడం కన్నా తనకు మంచి సీన్స్ ఎక్కడ దొరుకుతాయని కె.విశ్వనాథ్ గారు అభిప్రాయపడ్డారు. వృత్తిగా చేయవలసిన బాధ్యతతో మూవీలు చేశామని పేర్కొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి ఎంతో మంది తెలివైనవాళ్లున్నారని, వారికి తాను మెరుగులు దిద్దలేదని సొంతంగా వారే ఎదిగారని అన్నారు. ఇండస్ట్రీకి ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ తనను గుర్తుపెట్టుకుని మరీ గౌరవించిన సాక్షి సంస్థకు ధన్యావాదాలు తెలిపారు.