breaking news
kanuvippu
-
నా అబద్ధాలు... అలా ఆగిపోయాయి!
కనువిప్పు నాలో మొదటి నుంచి చిలిపితనం ఎక్కువ. అందులో భాగంగా అబద్ధాలు ఆడుతూ అందరినీ ఆట పట్టించేవాడిని. అప్పుడప్పుడూ నా అబద్ధాలు హద్దు మీరేవి. ఒకసారి ఏమైందంటే, చాలాకాలం తరువాత నా పదోతరగతి క్లాస్మేట్ శ్రీనివాస్ కలిశాడు. ఆ మాట... ఈ మాట మాట్లాడుతూ- ‘‘నాగరాజుగాడు ఎలా ఉన్నాడు?’’ అని అడిగాడు. నాగరాజు మాతో కలిసి పదోతరగతి చదువుకున్నాడు. వాడిది మా ఊరే. ‘‘నాగరాజు ఎలా ఉన్నాడు?’’ అని అడగగానే నేను రెచ్చి పోయాను. అప్పటికప్పుడు నాలో ఎన్నో అబద్ధాలు పుట్టుకొచ్చాయి. ‘‘అరే...నీకు విషయం తెలియదా? పాపం...నాగరాజు!’’ అన్నాను. ‘‘ఏమైంది వాడికి?’’ ఆసక్తిగా అడిగాడు. ‘‘ఒక యాక్సిడెంట్లో వాడి రెండు కాళ్లు పోయాయి. పాపం ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఏంచేస్తాం? అలా రాసి పెట్టి ఉంది’’ అన్నాను బాధగా. ‘‘అయ్యో! అలా జరిగిందా’’ అని చాలా బాధపడిపోయాడు శ్రీను. ‘‘వీలు చూసుకొని నాగరాజు దగ్గరికి వెళ్లి చూసొస్తాను’’ అన్నాడు. ‘‘వీడిని బకరా చేశాను’’ అని నాలో నేను తెగ సంతోషపడిపోయాను. ఇది జరిగిన కొంత కాలానికి అనుకోకుండా మా ఫ్రెండ్ అన్నయ్య పెళ్లిలో నాగరాజు, శ్రీనులు కలుసుకున్నారు. ‘‘వాడిప్పటికీ మారలేదన్నమాట’’ అని నన్ను తెగతిట్టుకున్నారు. ఒకవేళ ఆ ఫంక్షన్లో నేను ఉండి ఉంటే కొట్టేవారేమో! ఇది జరిగిన చాలా కాలానికి ఒక సంఘటన జరిగింది. అప్పుడు నేను ఓ కోచింగ్సెంటర్లో ఎమ్సెట్కు ప్రిపేరవుతున్నాను. ఒకరోజు మా కోచింగ్ సెంటర్‌కు ఫోన్ వచ్చింది-‘‘మీ నాన్నగారికి సీరియస్‌గా ఉందట. వెంటనే బయలుదేరు’’ అని చెప్పారు ప్రిన్సిపాల్. ఇక నేను ఏమీ ఆలోచించలేదు. భోరుమని ఏడుస్తూ ఉరుకులు పరుగుల మీద బస్ ఎక్కాను. కొన్నిరోజులుగా నాన్న జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనను తలచుకుంటే ఏడుపు ఆగడం లేదు. మా ఊరిలోకి అడుగు పెట్టగానే, దూరంగా మా నాన్న కనిపిస్తున్నారు. వాళ్ల స్నేహితులతో ఏదో చెబుతూ తెగ నవ్వుతున్నారు. నేను షాక్ అయ్యా. ఎవరో కావాలనే అబద్ధం చెప్పారనే విషయం అర్థమైంది. ఎందుకో మరి... వాళ్ల మీద కోపం రాలేదు. చీటికి మాటికి అబద్ధాలాడే నా స్వభావంపై మాత్రం విరక్తి పుట్టింది. ఒక చిన్న అబద్ధానికి గంట పాటు నేను ఎలా విలవిలలాడోనో ఆ దేవుడికే తెలుసు. అందుకే అప్పటి నుంచి ఎప్పుడూ అబద్ధం ఆడలేదు. - ఎస్.ఎల్, నిజామాబాద్ -
మొద్దు నిద్ర వదిలింది!
కనువిప్పు సప్త వ్యసనాలలో ‘అధికంగా నిద్రపోవడం’ అనేది ఉందో లేదో తెలియదుగానీ, నాకు మొదటి నుంచి పరిమితికి మించి నిద్ర పోయే అలవాటు ఉండేది. ‘కంటినిండా నిద్ర పోవడం ఆరోగ్యానికి మంచిది’ అని ఎక్కడైనా చదివినప్పుడల్లా... రెచ్చిపోయి మరింత నిద్రపోయేవాడిని. ఎప్పుడైనా ఉదయం లేవాల్సి వచ్చినప్పుడు, చాలా ఇబ్బంది పడేవాడిని. ఆ రోజంతా డల్‌గా ఉండేది. ‘‘రోజూ పొద్దుటే లేవడం మొదలు పెడితే అదే అలవాటు అవుతుంది’’ అని ఎవరో సలహా ఇవ్వడంతో నాలుగు రోజుల పాటు ప్రయత్నించానుగానీ నా వల్ల కాలేదు. మళ్లీ షరా మామూలే. లేటుగా నిద్ర లేచేవాడిని. ఇంటర్లో ఉన్నప్పుడు సిటీలో రూమ్ అద్దెకు తీసుకొని ఉండేవాడిని. రూమ్‌లో ఒక్కడినే ఉండడం వల్లే నేను ఎంత సేపు పడుకున్నా... ఎవరూ లేపే వారు కాదు. ఇదే నా కొంప ముంచింది. మరుసటిరోజు కెమిస్ట్రీ పరీక్ష రాయాలి. దీంతో చాలా సేపు చదువుకొని లేటుగా నిద్రపోయాను. ఎప్పుడో మెలకువ వచ్చింది. లేచి టైమ్ చూస్తే మధ్యాహ్నం కావొస్తోంది!! గుండెలో రాయిపడినట్లు అయింది. ఉత్తపుణ్యానికి పరీక్ష రాసే అవకాశం కోల్పోయాను. ఇక ఆరోజు నుంచి గట్టిగా అనుకున్నాను. ఆరునూరైనా ఆరు లోపల నిద్ర లేవాలని. నేను ఈ నిర్ణయం తీసుకొని మూడు సంవత్సరాలు దాటింది. ఎప్పుడూ ఆలస్యంగా నిద్ర లేవలేదు. ఉదయాన్నే లేవడం వల్ల చురుగ్గా కూడా ఉండగలుగుతున్నాను. - కె.శేఖర్, నిజామాబాద్