అసెంబ్లీలో ఓటింగ్ జరగాల్సిందే
మీ మొహం నచ్చలేదుగనుక విడగొడతానంటే కుదరదు
న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశం ఉంది: జస్టిస్ పీసీ రావు
అసెంబ్లీలో ఓటింగ్ జరగాల్సిందే
సాక్షి, విజయవాడ : రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం చెప్పాలంటే ఓటింగ్ జరగాల్సిందేనని ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ సీ (ఐ.టి.ఎల్.ఒ.ఎస్.)న్యాయమూర్తి జస్టిస్ పీసీరావు వ్యాఖ్యానించారు. ప్రతిష్టాత్మకమైన డాక్టర్ పిన్నమనేని అండ్ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ అవార్డును ప్రముఖ న్యాయకోవిదుడు జస్టిస్ పాటిబండ్ల చంద్రశేఖర్‌రావు (పీసీరావు)కు సోమవారం విజయవాడలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘దేశంలో రాజ్యాంగం ప్రగతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన’ అంశాలపై ఉపన్యసించారు. ఒక తెలంగాణ మంత్రి, సీమాంధ్ర మంత్రిని మీరు మా ప్రాంతం మీదుగానే వెళ్లాలని బెదిరించే పరిస్థితులకు దిగజారిపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు. మీ మొహం నాకు ఇష్టం లేదు కాబట్టి రాష్ట్రాన్ని విడగొడతామంటే చెల్లదన్నారు. తెలంగాణ సెంటిమెంట్ అన్న కారణాలు న్యాయస్థానాల్లో చెల్లవని పేర్కొన్నారు. కేంద్రం తన విచక్షణాధికారాలను సక్రమంగా ఉపయోగించకపోతే దాన్ని కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్- టీఆర్ఎస్, తెలుగుదేశం- టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయని, ఒకసారి చేతులు కలిపిన తర్వాత ఎక్కడో ఒకచోట ఈ డిమాండ్‌కు తలొగ్గాల్సి వస్తుందన్నారు.
ముఖ్యమంత్రి నుంచి ఎంపీల వరకు వ్యతిరేకిస్తున్నా దీనిపై ఏకాభిప్రాయం వచ్చినందునే ముందుకు వెళ్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ చెప్పడం సరికాదన్నారు. అసలు ఉమ్మడి రాజధాని అంటే ఏమిటి? హైదరాబాద్ తెలంగాణలో రాజధానిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అద్దెదారులుగా ఉండాలా అని ప్రశ్నించారు. రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని అనే ప్రొవిజన్ లేదన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోతే బిల్లులో ఇచ్చిన హామీలను ఎవరు అమలుపరుస్తారని ప్రశ్నించారు. బిల్లు అయిన తర్వాత కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందన్నారు. ఈ అడ్డగోలు విభజనను అడ్డుకునే అధికారాలు సుప్రీంకోర్టుకు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో పిన్నమనేని ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, డాక్టర్ సుధ, గోళ్లపల్లి నాగేశ్వరరావు, డాక్టర్ పట్టాభి రామయ్య తదితరులు పాల్గొన్నారు.