breaking news
Irrigation Department Minister Harish Rao
-
మాది రైతు ప్రభుత్వం
సంగారెడ్డి అర్బన్: రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు.బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన ఐఐటీ కళాశాల నిర్మాణంలో భూములు కోల్పోయిన 20 మంది రైతులకు ఇంటి స్థలాల పట్టాలు, సింగూర్ పైప్‌లైన్ వల్ల భూములు కోల్పోయిన 47 మంది రైతులకు రూ. 56.37 లక్షల పరిహారాన్ని మంత్రి హరీష్‌రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిహారం అందాల్సిన వారు ఇంక ఎవరున్నా వారికి కూడా త్వరలోనే పరిహారం పంపిణీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం పరిహారంగా ఎకరాకు రూ.3 లక్షల చెల్లించగా, ప్రస్తుతం ఆ పరిహారాన్ని పెంచి రైతులకు న్యాయం చేస్తున్నామన్నారు. రుణమాఫీ కింద ఇప్పటికే రూ.499 కోట్లు జిల్లాలోని రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. ఇప్పటివరకు రైతులకు రూ.700 కోట్ల కొత్త రుణాలు రైతులకు మంజూరు చేయించామన్నారు. అంతేకాకుండా రైతులకు మద్దతు ధర దక్కేలా జిల్లా వ్యాప్తంగా మక్క, వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏ ర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రం లోనే ప్రయోగాత్మకంగా జిల్లాలో సేకరించిన మొక్కజొన్నకు కూడా ఆన్లైన్ ద్వారా రైతులకు చెల్లింపులు ప్రారంభించామన్నారు. 72 గంటల్లో రైతులకు డబ్బు చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అంతేకాకుండా పాడి రైతుకు మేలు జరిగేలా లీటరుకు రూ. 4 పెంచినట్లు వివరించారు. షేడ్‌నెట్ కింద రైతులు కూరగాయలు పండించేందుకు రూ. 280 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తోందన్నారు. డ్రిప్ ఇరిగేషన్ సాగు చేసేందుకు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీతో, చిన్న సన్న కారు రైతులకు 90 శాతం, మిగతా రైతులందరికీ 80 శాతం సబ్సిడీతో పరికరాలను సమకూర్చనున్నట్లు తెలిపారు. అనంతరం స్థానిక శాసన సభ్యులు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, ఎంతో కాలంగా పెండింగ్‌లోఉన్న పరిహారాన్ని , ఇళ్ల స్థలాల పట్టాలను నూతన ప్రభుత్వం మంజూరు చేసి రైతులను ఆదుకుందన్నారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయినట్లయితే సంబంధిత తహశీల్దార్ల ద్వారా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. 8న పింఛన్ల పంపిణీ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ, జిల్లాలో ఆహార భద్రత కార్డులకు 8 లక్షల దరఖాస్తులు అందగా, ఇప్పటి వరకు 50 శాతం పరిశీలన పూర్తయిందని తెలిపారు. పింఛన్ కోసం 4 లక్షలకు పైగా దరఖాస్తులందగా, 60 శాతం పరిశీలన పూర్తయిందన్నారు. నవంబర్ 1 తేదీ నాటికి పరిశీలన పూర్తిచేసి 8వ తేదీన అందరికి పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. ఆహార భద్రత కార్డులు, పింఛన్ల కోసం అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకు చివరి తేదీ అంటూ ఏమీ లేదన్నారు. దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్, జేసీ శరత్, అదనపు జేసి మూర్తి, డీఆర్ఓ దయానంద్, సంగారెడ్డి తహశీల్దార్ గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు. -
ఏ అవసరమున్నా.. నేనున్నా
సమస్య చెప్పండి.. పరిష్కరిస్తా * మూడు నెలలకోసారి గ్రామాలకు వస్తా * లంచాలు, పైరవీలతో మోసపోవద్దు * చెరువుల పునరుద్ధరణతోనే సస్యశ్యామలం * మంత్రి హరీష్‌రావు సిద్దిపేట రూరల్: ‘ఎవ్వరికీ ఏ అవసరం ఉన్నా నేనున్నాను.. లంచాలు, పైరవీలతో మోసపోవద్దు.. అలాంటి వాటిని అసలే నమ్మొద్దు.. ఏ సమస్య ఉన్నా చెప్పండి.. మూడు నెలలకోసారి మీ గ్రామాలకు వస్తా.. సమస్యలు పరిష్కరిస్తా’ అని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆదివారం మండలంలోని పుల్లూర్ గ్రామంలో సబ్‌స్టేషన్, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన, ఇమాంబాద్‌లో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అలాగే మహిళా భవనానికి శంకుస్థాపన చేశారు. ఇమాంబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, రుణం తీసుకున్న ప్రతి రైతుకు మాఫీచేసి తీరుతామని అన్నారు. నవంబర్ నుంచి పింఛన్ డబ్బును పెంచుతున్నట్లు చెప్పారు. గ్రామాల్లో చెరువులు బాగుంటేనే ప్రజలు బాగుంటారన్నారు. చెరువుల పునరుద్ధరణ కోసం సంవత్సరానికి రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు తె లిపారు. తెలంగాణలో కరెంట్ కష్టాలకు చంద్రబాబునాయుడే కారణమని అన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు తెలంగాణకు 53 శాతం విద్యుత్ ఇవ్వాలని ఢిల్లీలో ఒప్పందం కుదిరినప్పటికీ లెక్కచేయడంలేదన్నారు. స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యం తాను ఏ నీళ్లు తాగుతున్నానో ప్రజలంతా అదే నీళ్లు తాగాలన్నది తన లక్ష్యమని మంత్రి హరీష్‌రావు అన్నారు. అందులో భాగంగానే నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన నీరు తాగాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు 64 గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. మరో 11 గ్రామాల్లో పూర్తి చేస్తే అన్ని గ్రామాల్లో పూర్తి చేసినట్టవుతుందన్నారు. అదే విధంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, పూర్తిస్థాయిలో గృహనిర్మాణాలు, ప్రతి కుటుంబానికి 30 కిలోల రేషన్ బియ్యం, అర్హులందరికీ పింఛన్లు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర యాదయ్య, ఉపాధ్యక్షుడు శ్రీహరిగౌడ్, జడ్పీటీసీ గ్యార వజ్రవ్వ, గ్రామ సర్పంచ్ పుల్లూరి సరోజన ఆంజనేయులుగౌడ్, ఎంపీటీసీ మహేష్, నాయకులు కిషన్‌రెడ్డి,తిరుపతిరెడ్డి, ఉడుత మల్లేశం, రాజయ్య, కమలాకర్‌రావు, రవీందర్‌రెడ్డి, బాల్‌రంగం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.