breaking news
Interstate robbers
-
మంచోడే.. కానీ.. దొంగోడు!
హైదరాబాద్: దొంగలందు ఈ దొంగ వేరయా.. అన్నట్టు.. పెద్దలను దోచి పేదలకు పంచిపెడుతుంటాడు. చోరీ చేసిన సొత్తులో కొంత భాగాన్ని తన గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తాడు. కేవలం బంగారం, నగదు మాత్రమే తస్కరిస్తూ వెండి వస్తువుల జోలికి వెళ్లడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా పక్కా ప్రణాళికతో ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి దూకుతూ జారుకుంటాడు. జూబ్లీహిల్స్లోనే దొంగతనాలకు పాల్పడతాడు తప్ప నగరంలోని మరో ప్రాంతంపై దృష్టి పెట్టడు. పోలీసులకు ఏమాత్రం క్లూ దొరక్కుండా సెల్‌ఫోన్ సిమ్ వేసుకోకుండా కేవలం నెట్‌తో వాట్సాప్ కాల్స్ మాత్రమే వాడుతూ అత్యంత పకడ్బందీగా హైదరాబాద్, ముంబై మధ్య రాకపోకలు సాగిస్తున్నాడు. నాలుగేళ్లుగా బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్న ఈ అంతర్రాష్ట్ర దొంగను ఎట్టకేలకు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సీసీ కెమెరాకు చిక్కి.. బిహార్‌కు చెందిన మహ్మర్ ఇర్ఫాన్ అలియాస్ రాబిన్‌హుడ్ అలియాస్ ఉజ్వల్ (33) ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్‌లలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ నెల 9న జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 10సిలోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నివసించే ధృవ అనురాగ్‌రెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. బంగారు నగలు తస్కరించి అదే రోజు రాత్రి ఇక్కడి నుంచి ఉడాయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగారు. ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నాలుగైదు రోజులపాటు 75కిపైగా సీసీ కెమెరాలను వడపోసినా ఎక్కడా ఇర్ఫాన్ ఆనవాళ్లు చిక్కలేదు. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తూ వెళ్తుండగా వెంకటగిరి సమీపంలో ఓ ఇంటి ముందు ఏర్పాటు చేసిన కెమెరాకు చిక్కాడు. లక్డీకాపూల్‌లోని హోటల్లో మకాం.. పాత నేరస్తుల ఫొటోలను, సీసీటీఎన్ఎస్ పరిశీలనలో రాబిన్‌హుడ్ మామూలోడు కాదని, కరడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ అని తేలింది. నగరానికి దొంగతనానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా లక్డీకాపూల్‌లోని ఓ హోటల్లో తనకు అచ్చొచ్చిన గదిలో ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారం రోజులపాటు ఆ హోటల్ వద్ద కాపు కాశారు. రాబిన్‌హుడ్ రాకను గుర్తించిన పోలీసులు అతన్ని అదే హోటల్ గదిలో అదుపులోకి తీసుకొన్నారు. విచారణ చేయగా ఈ నెల 8న దొంగతనానికి ఇక్కడికి వచ్చానని, ఓ ఖరీదైన కారులో జూబ్లీహిల్స్ ప్రాంతంలో తిరుగుతూ తనకు అనుకూలంగా ఏ ఇల్లు దొంగతనానికి సరిపోతుందో రెక్కీ నిర్వహించినట్లుగా చెప్పాడు. ఓ ఇంటిపైనుంచి మరో ఇంటిపైకి దూకుతూ.. ఓ ప్రముఖ నటుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో చూడగా అక్కడ ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడంతో ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో ధృవ అనురాగ్‌రెడ్డి ఇంటిని లక్ష్యంగా చేసుకొని దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడించాడు. అదే రోజు రాత్రి ముంభైలోని తన రెండో భార్య బార్ గర్ల్ గుల్షన్ ఇంటికి వెళ్లానని, మళ్లీ దొంగతనం చేయడానికి రెండు రోజుల క్రితం అదే హోటల్‌కు వచి్చనట్లు తెలిపాడు. ప్రముఖులు, బడాబాబులు నివసిస్తున్న జూబ్లీహిల్స్‌లోని దొంగతనాలు చేస్తుంటానని, సీసీ కెమెరాలకు చిక్కకుండా ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి 15 నుంచి 20 ఇళ్ల పైకప్పులు దూకుతూ వెళ్తుంటానని చెప్పాడు. తాను చోరీ చేసిన సొత్తులో 50 శాతం పేదలకు ఆహారం, స్కూల్ ఫీజులు, దుస్తులు, ఆసుపత్రుల ఫీజులు కడుతుంటానని చెప్పాడు. అందుకే తనకు రాబిన్ హుడ్ పేరు వచ్చినట్లు వెల్లడించాడు. ఇప్పటికే ముగ్గురు భార్యలు.. మరో యువతితో ప్రేమాయణం చోరీ సొత్తుతో స్వగ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో ఉజ్వల్ అని పేరు పెట్టారని వెల్లడించారు. తన మొదటి భార్య పర్వీన్ బిహార్‌లో జెడ్పీ చైర్పర్సన్ అని.. రెండో భార్య ముంబైలో బార్‌గర్ల్ అని.. మూడో భార్య కోల్‌కతాలో ఉంటోందన్నాడు. ఇటీవలే పూజ అనే యువతితో ప్రేమలో పడ్డట్లు పోలీసులకు వెల్లడించాడు. నిందితుడిపై హైదరాబాద్‌లో నాలుగు కేసులు, బెంగళూరులో 7, న్యూఢిల్లీలో 4 కేసులు నమోదై ఉన్నాయి. ఇళ్ల తాళాలు పగులగొట్టి తనతో తీసుకెళ్లే స్రూ్కడ్రైవర్లు, రాడ్లతో అల్మారాలు తెరుస్తుంటాడని వాటిని స్వాదీనం చేసుకున్నట్లు జూబ్లీహిల్స్ డీఐ వీరశేఖర్ తెలిపారు. -
చైన్‌స్నాచర్ల కట్టడికి త్రిముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చైన్‌స్నాచర్ల కట్టడికి పోలీసులు పక్కా చర్యలు చేపట్టారు. పట్టణాలు, నగరాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులు లాక్కెళుతున్న దొంగల కట్టడికి త్రిముఖ వ్యూహం రూపొందించారు. పట్టణాలు, నగరాల్లోకి ప్రవేశించే రహదారులపై ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, వచ్చిపోయే వాహనాలపై నిఘా ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా హైదరాబాద్‌లో 150 సీసీ, ఆపైన ఇంజన్ సామర్థ్యమున్న బైక్‌లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. ఇక చైన్ స్నాచింగ్‌లలో ఎక్కువగా అంతర్రాష్ట్ర దొంగల హస్తముందని వెల్లడైన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌పై దృష్టి కేంద్రీకరించారు. ఇక ఇప్పటివరకు చైన్ స్నాచింగ్‌కు పాల్పడితే కేవలం చోరీ కేసులే నమోదు చేస్తుండడంతో దొంగలు కొద్ది రోజులకే బయటకొచ్చేవారు. దీంతో చైన్ స్నాచర్లపై పీడీ యాక్టు (ప్రివెంటివ్ డిటెన్షన్) కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా ఏడాది పాటు జైల్లో ఊచలు లెక్కపెట్టక తప్పదు. పైస్థాయి నుంచి ఆదేశాలు.. ఇటీవల శాసనమండలిలో చైన్ స్నాచింగ్‌లపై జరిగిన చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు నిలదీయడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. దీంతో చైన్ స్నాచర్లపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ పెద్దలు పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలోనే చైన్ స్నాచర్లపై ఉక్కు పాదం మోపాలని పోలీసులు నిర్ణయించారు. చైన్ స్నాచర్లపై చోరీ కేసులు మాత్రమే నమోదు చేస్తుండడంతో వారు సులభంగా బెయిల్ పొంది బయటకొచ్చేవారు. దీంతో ఇక నుంచి చైన్స్నాచర్లపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా వారు కనీసం ఏడాది పాటు జైల్లో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అయితే దొంగతనానికి పాల్పడుతూ తొలిసారి పట్టుబడిన వారిపై పీడీ యాక్టు నమోదు చేసే అవకాశం ఉండదు. అలాంటి వారిపై దోపిడీ నేరాల కింద కేసులు పెట్టి ఆర్నెల్ల పాటు జైల్లో ఉండేలా చర్యలు చేపట్టారు. అంతర్రాష్ట్ర ముఠాలపై దృష్టి వరుసగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నది అంతర్రాష్ట్ర దొంగల ముఠాయేనని పోలీసులకు సమాచారం ఉంది. ఇటీవల నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి పారిపోతున్న ఒక ముఠాను బిక్కనూరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఉత్తరప్రదేశ్, బిహార్‌లకు చెందిన దొంగల ముఠాలు డీసీఎం వాహనాలలో ద్విచక్ర వాహనాలను తీసుకొచ్చి చోరీలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో వారికి అడ్డుకట్ట వేయడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణాలు, నగరాల్లోకి ప్రవేశించే రహదారులపై నిఘా పెట్టాలని.. చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడం, సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేయడం వంటివి చేపట్టనున్నారు. పట్టణాలు, నగరాలలో ప్రత్యేక బృందాలతో అంతర్గత తనిఖీలను కూడా ముమ్మరం చేశారు.