breaking news
input subsidies
-
మరోసారి రైతులకు ఏపీ ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ
-
రెండేళ్లు...కన్నీళ్లు
‘అనంత’ కరువుకు చిరునామా.. ప్రకృతికి ఎదురొడ్డి రైతులు పంటలు సాగు చేస్తారు.. అరకొరగా పండినా ఆనందిస్తారు.. పంటమొత్తానికే పోతే..పాలకుల వైపు ఆశగా చూస్తారు..కానీ ప్రచార యావే తప్ప...రైతులను ఆదుకోవాలన్న ధ్యాసలేని సర్కార్...అమాయకులైన రైతుల జీవితాలతో ఆడుకుంటోంది. ఇన్పుట్ సబ్సిడీ పేరుతో కోట్లాది రూపాయలు విడుదల చేసినట్లు గొప్పలు చెప్పిన పాలకులు... అర్హులైన వారికి మాత్రం అందివ్వకుండా వేధిస్తున్నారు. అందువల్లే 2016లోనే అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకూ చాలా మంది రైతుల ఖాతాల్లో పడలేదు. రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా...రైతు గోడు పట్టించుకునేవారు కరువయ్యారు. అనంతపురం అగ్రికల్చర్: 2016 ఇన్పుట్ సబ్సిడీ విషయంలో ఒక్కో రైతుకు ఒక్కో రకంగా అన్యాయం జరిగింది. పంట వేసినా పరిహారం రానివారు కొందరు... పదెకరాల్లో పంట వేసి నష్టపోయినా కేవలం రూ.2 వేలు, రూ.3 వేలు వచ్చిన వారు మరికొందరు, వేరుశనగ పంట స్థానంలో ఇతర పంటల నమోదు చేసి అరకొర పరిహారం దక్కించుకున్న వారు ఇంకొందరు రైతులు ఉన్నారు. అంతా ఆన్లైన్, పారదర్శకతకు పెద్దపీట అంటూ గొప్పగా చెబుతున్నా ఇన్పుట్ సబ్సిడీ జాబితాలు తయారు, పరిహారం వర్తింపు, పంపిణీ మాత్రం ఇష్టారాజ్యంగా తయారైంది. అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకోవడంతో జాబితాలు తారుమారు చేయడంతో అర్హులైన రైతులకు అన్యాయం జరగ్గా అనర్హులకు పరిహారం ఎక్కువగా ఇచ్చిన దాఖలాలు కనిపిస్తున్నాయి. మొత్తమ్మీద 2016 ఇన్పుట్ జాబితాలు, పరిహారాన్ని చూసి లక్షలాది మంది రైతులు కంగుతిన్నారు. అర్జీల పోటు ఇన్పుట్ జాబితాలు ప్రకటించగానే రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. రైతుల కోపాన్ని తగ్గించడానికి రంగంలోకి దిగిన సర్కారు పెద్దలు, అధికార యంత్రాంగం అర్జీలు ఇస్తే జాబితాలు సరిచేసి ప్రతి రైతుకూ న్యాయం చేస్తామని గొప్పలు చెప్పారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి అర్జీలు వెల్లువలా వచ్చాయి. అసలే రాని వారు, అరకొరగా పరిహారం వచ్చిన రైతులు లక్షలాది మంది మండల, డివిజన్, జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయాల్లో పట్టాదారు, ఆధార్, బ్యాంకు పుస్తకం అందించి అర్జీలు సమర్పించుకున్నారు. అందులో అసలే పరిహారం రాని వారు 59 వేల మంది రైతులు అర్జీలు ఇచ్చుకోగా తక్కువగా పరిహారం వచ్చిన వారు 42 వేల మంది అర్జీలు ఇచ్చారు. ఇలా లక్ష మందికి పైగా రైతుల నుంచి రూ.143 కోట్లకు అర్జీలు వచ్చిపడ్డాయి. వాటిని మరోసారి క్రోడీకరించిన అధికారులు రూ.126 కోట్లు పరిహారం అదనంగా అవసరమని నివేదిక తయారు చేశారు. అందులో 52 వేల మంది అసలే పరిహారం రాని రైతులకు రూ.84 కోట్లు, తక్కువగా వచ్చిన 35 వేల మంది రైతులకు రూ.42 కోట్లు అవసరమని తేల్చారు. ఈ మేరకు రూ.126 కోట్లు మంజూరు చేయాలని ఆరు నెలల కిందట ప్రభుత్వానికి, కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపారు. పంపిణీ అస్తవ్యస్తం మరోపక్క మంజూరు చేసిన 2016 ఇన్పుట్ పరిహారం పంపిణీ అస్తవ్యస్తంగా తయారు కావడంతో వేలాది మంది రైతుల ఖాతాల్లోకి ఇప్పటికీ జమ కావడం లేదు. ఏడాదికో పద్ధతిలో పంపిణీ చేస్తుండటంతో గందరగోళంగా మారింది. జేడీఏ కార్యాలయాన్ని పక్కనపెట్టి 2016 సమస్యలు ఇపుడు మండలాలు, డివిజన్ స్థాయిలోనే జాబితాలు తయారీ, మిస్‌మ్యాచింగ్ సర్దుబాట్లు, ఆ తర్వాత పరిహారం జమ చేసే బాధ్యత ట్రెజరీకి అప్పజెప్పడంతో రైతులకు అర్థం కాకుండా పోయింది. పరిహారం రాని రైతులు ఎక్కడ సంప్రదించినా సరైన జవాబు లభించకపోవడంతో దారుణంగా తయారైంది. జాబితాల ఆధారంగా పరిహారం జమ చేసినట్లు ట్రెజరీ అధికారులు చూపిస్తున్నా రైతు ఖాతాల్లోకి జమ కానివి చాలానే ఉండటం విశేషం. డివిజన్ వ్యవసాయశాఖ కార్యాలయాల నుంచి వందలాది మంది జాబితాలు అప్లోడ్ చేసి ట్రెజరీకి పంపిస్తే అందులో 10 శాతం మందికి కూడా పరిహారం జమ కావడం లేదంటున్నారు. అలా పదే పదే జాబితాలు పంపాల్సివస్తోందని వాపోతున్నారు. జిల్లాకు విడుదలైన రూ.1,032 కోట్ల పరిహారంలో ఇంకా రూ.180 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లోకి చేరలేదంటున్నారు. మొత్తమ్మీద 2016 ఇన్పుట్ జాబితాల తయారీ, పరిహారం వర్తింపు, పంపిణీ వ్యవహారం ఘోరంగా తయారైందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లికి ఓ రైతు పేరు ఎం. నాగరాజు.. 2016 ఖరీఫ్‌లో 5.25 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. వర్షం లేక పంట ఎండిపోయి రూ.80 వేలు నష్టం వాటిల్లింది. ఇన్‌పుట్‌సబ్సిడీ కింద గరిష్టంగా రూ.30 వేలు వస్తుందని ఆశలు పెట్టుకున్నాడు. కానీ... జాబితాలో పేరు లేకపోవడంతో కంగుతిన్నాడు. బెళుగుప్ప, కళ్యాణదుర్గం, అనంతపురం వ్యవసాయశాఖ ఏఓ, ఏడీఏ, జేడీఏ కార్యాలయాల్లో అర్జీలు ఇచ్చుకున్నా ఇప్పటికీ నాగరాజు పేరు జాబితాలో చేర్చలేదు. -
రైతులపై చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు
-
రైతులపై చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు
అమరావతి : ఉండవల్లిలోని ప్రజాదర్భార్ హాల్లో ఈ-ప్రగతి ఐఎస్బీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సారి రైతులనుద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సబ్సిడీలకు ప్రజలు బానిసలయ్యారన్నారు.ఇన్ పుడ్ సబ్సిడీ, క్రాప్ సబ్సిడీలకి జనం అలవాటు పడిపోయారు అంటూ మరోసారి రైతులను కించపరుస్తూ మాట్లాడారు. గతంలో చాలా సార్లు రైతులు, వ్యవసాయం పై చంద్రబాబు వివాదాస్పద కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. రైతులు పంట నష్టపోయేటప్పుడు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తారు. దాన్ని కూడా తప్పు పట్టే దోరణిలో చంద్రబాబు మాట్లాడారు. తాను వ్యవసాయానికి సంబంధించి రకరకాల సంస్కరణలు చేపట్టానని చెప్పే క్రమంలో ప్రజలందరూ సబ్సిడీలకు అలవాటుపడ్డారని రైతులను తక్కువ చేస్తూ ప్రసంగించారు. ఇన్ పుట్ సబ్సిడీ అనేది విపత్కర పరిస్థితుల్లో పంట నష్టపోయినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు రైతులకు అందజేస్తాయి. నష్టాల్లో ఉన్న రైతుకు ఇన్ పుట్ సబ్సిడీని చెల్లించడాన్ని తప్పుబడుతూ, రైతులు బానిసైపోయారు అంటూ చంద్రబాబు మాట్లాడటంపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైతుకు సంబంధించినంత వరకు పంట చేతికొచ్చి, మంచి గిట్టు బాటు ధర వస్తే ఏ రైతు కూడా ఇన్ పుట్ సబ్సిడీ కోసం ఎదురు చూడరు. భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసే రైతు విపత్కర పరిస్థితుల్లో వేసిన పంట చేతికి రానప్పుడు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీల కోసం ఎదురు చూస్తారు. వ్యవసాయం అనేది ఇన్పుట్, క్రాప్ సబ్సిడీల కోసమే చేస్తున్నారు అని అర్థం వచ్చేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రైతుల మనోభావాలను దెబ్బెతీసేలా ఉన్నాయి. వ్యవసాయం దండగ అని గతంలో చంద్రబాబు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. -
‘నిధుల్ని దారి మళ్లిస్తున్న కేసీఆర్ సర్కారు’
హైదరాబాద్: రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని భారతీయ జనతాపార్టీ(బీజేపీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. పెట్టుబడి రాయితీ కింద ఆర్నెళ్ల క్రితం కేంద్రం విడుదల చేసిన నిధులను ఇప్పటికీ రైతులకు ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని మండిపడింది. ఇన్పుట్ సబ్సీడీ కింద ఎన్డీఏ ప్రభుత్వం రూ.791 కోట్లు రాష్ట్రానికి ఇచ్చిన నిధులను వెంటనే రైతులకు అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం సచివాలయంలోని సమతా బ్లాక్ ఎదుట బీజేపీ శాసనసభ పక్షనేత జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపించిందని, ఇన్పుట్ సబ్సీడీ ఇవ్వకుండా జాప్యం చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలిస్తే.. స్పష్టత ఇవ్వకుండా దాటవేశారని, దీంతో నిరసన చేపట్టినట్లు తెలిపారు. రబీ సీజన్లో రాయితీ విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఎన్నికల రూ.లక్షలోపు రుణమాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్... ఇప్పుడు అరకొరగా మాఫీచేసి చేతులెత్తేశారని విమర్శించారు. అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నాగం జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాసంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సీడీ ఇచ్చేవరకు ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. ధర్నా అనంతరం పోలీసులు వారిని అరెస్టుచేసి తర్వాత విడుదల చేశారు.