breaking news
Indian Couples
-
ట్రంప్ దెబ్బకు డెలి‘వర్రీ’
ముందే వచ్చిన పురిటినొప్పులు.. నెలలు నిండకుండానే అగ్రరాజ్యంలో కాన్పులు.. ఆస్పత్రులకు పరుగులు.. ఇప్పుడిదే అక్కడ ట్రెండ్!. రేపటి పరిణామాలు ఎటు దారితీస్తాయో తెలియదు. భారతీయులకు ఎంత ఖర్మ... ఎంత దురవస్థ... ఎన్ని అగచాట్లు... ఎంతటి దుర్గతి!. ‘అమెరికా విధాత’ ట్రంప్ గీసిన కలం గీతకు ఒక్క రోజులోనే మారిపోయింది మనోళ్ల తలరాత. పగవాడికి కూడా రాకూడదు ఈ దీనావస్థ... సీన్ ఇప్పుడే ఇలా ఉంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్... మరుక్షణమే తమ దేశంలో జన్మతః పౌరసత్వ హక్కు(Birth Right Citizenship)ను రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు వెలువరించాడు. అమెరికాలో శాశ్వత నివాసితులు కాని వారికి జన్మించే పిల్లలకు జన్మతః పౌరసత్వం సంక్రమించదంటూ ట్రంప్ ఈ నెల 20న ఆదేశం జారీ చేశాడు. ఉత్తర్వు జారీ అయిన నెల రోజుల తర్వాత ఆ ఆదేశం అమల్లోకొస్తుంది. అంటే గడువు ఫిబ్రవరి 20. ఈ తేదీ ఇప్పుడు అమెరికాలో ఉంటున్న భారతీయ దంపతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్(Executive Order) నేపథ్యంలో ఫిబ్రవరి 20లోపే.. గర్భిణులకు నెలలు నిండక మునుపే... సిజేరియన్ విధానంలో పిల్లల్ని కనేందుకు భారతీయ దంపతులు తొందరపడుతున్నారు. డెలి‘వర్రీ’తో ఆస్పత్రుల వద్ద క్యూ కడుతున్నారు. అమెరికాలోని ఓ రాష్ట్రంలో ప్రసూతి ఆస్పత్రి నడుపుతున్న డాక్టర్ ఎస్.డి.రామాకు గత రెండు రోజులుగా భారతీయ దంపతుల నుంచి ‘ముందస్తు డెలివరీ’(Pre Delivery) అభ్యర్థనలు ఎక్కువయ్యాట. ముఖ్యంగా 8వ నెల, 9వ నెల గర్భిణులు ‘సి-సెక్షన్’ (సిజేరియన్ శస్త్రచికిత్స) కోసం హడావుడి పడుతున్నారట. ఏడో నెల గర్భిణి అయిన ఓ భారతీయ మహిళ ముందస్తు ప్రసవం కోసం సిజేరియన్ ఆపరేషన్ చేయాలంటూ భర్తతో కలసి తనను సంప్రదించినట్టు డాక్టర్ రామా చెబుతున్నారు. వాస్తవానికి ఆమె మార్చి నెలలో ప్రసవించాల్సివుంది. ‘డెడ్ లైన్’ ఫిబ్రవరి 20వ తేదీ తర్వాత కాన్పు జరిగితే పుట్టే శిశువుకు అమెరికా పౌరసత్వం లభించదన్న భయం ఇప్పుడు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందన్నది ఈ పరిణామంతోనే అర్థమవుతోంది. అయితే.. ఇలా నెలలు నిండకుండానే జరిగే కాన్పుల కారణంగా తల్లికి, బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని గైనకాలజిస్టు డాక్టర్ ఎస్.జి.ముక్కాలా (టెక్సాస్) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలలు నిండకుండా పుట్టే శిశువులో ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో రూపొందవని, శిశువు తక్కువ బరువుతో ఉంటుందని, పోషణతోపాటు నాడీ సంబంధ సమస్యలు తలెత్తుతాయని ఆయన తెలిపారు. ఈ అంశాలన్నిటినీ ఆయన తన వద్దకు వస్తున్న భారతీయ జంటలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయమై ఆయన గత రెండు రోజుల్లో సుమారు 15-20 భారతీయ జంటలకు కౌన్సెలింగ్ ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. భారతీయ దంపతులు వరుణ్, ప్రియనే (పేర్లు మార్చాం) తీసుకుంటే... ప్రియ వచ్చే మార్చి నెలలో ప్రసవించాల్సివుంది. వరుణ్ H-1 B వీసాపై భార్యతో కలసి ఎనిమిదేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. గ్రీన్ కార్డుల కోసం ఆ జంట ఆరేళ్లుగా నిరీక్షిస్తోంది. ఇప్పుడు అకస్మాత్తుగా పౌరసత్వ విధానం మారిపోయింది. ప్రస్తుతం తాము నిశ్చింతగా ఉండాలంటే ప్రియ ముందస్తు డెలివరీకి వెళ్లడం ఒక్కటే మార్గమని వరుణ్ భావిస్తున్నాడు. “మేం ఇక్కడికి రావడానికి ఎంతో త్యాగం చేశాం. కానీ మా ఎదుటే తలుపు మూసుకుపోతోంది అనిపిస్తోంది’ అని బాధపడ్డాడు ఓ 28 ఏళ్ల ఇండియన్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్. అతడి భార్య ప్రస్తుతం గర్భవతి. తొలి సంతానానికి జన్మనివ్వబోతోంది. ఇక ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయుల పరిస్థితి వర్ణనాతీతం. కాలిఫోర్నియాలో ఎనిమిదేళ్లుగా అక్రమంగా నివసిస్తున్న విజయ్ (పేరు మార్చాం) తాజా ఫిబ్రవరి 20 ‘డెడ్ లైన్’తో నెత్తిన పిడుగుపడ్డట్టు బెంబేలెత్తుతున్నాడు. ::జమ్ముల శ్రీకాంత్(Courtesy: The Economic Times) -
హనీమూన్‌కు అక్కడికి వెళుతున్నారు
ముంబై(మహారాష్ట్ర): భారతీయ యువజంటల్లో ఎక్కువమంది బాలి ద్వీపానికి హనీమూన్ కోసం వెళ్తున్నట్టు ఓ సర్వేలో తేలింది. ఆ తర్వాతి స్థానాల్లో మల్దీవులు, థాయ్‌లాండ్ ఉన్నాయట. పెళ్లి చేసుకోబోయే జంటలు దాదాపు ఏడాది ముందుగానే తమ హనీమూన్ టూర్‌ను ప్లాన్ చేసుకుంటున్నట్లు తమ సర్వేలో వెల్లడైందని ఈజీగోఒన్ డాట్ కామ్ సీఈవో నీలు సింగ్ తెలిపారు. ఇందులో భాగంగా కొత్త జంటలు వీసా ఆన్ అరైవల్ విధానం అమల్లో ఉన్న దేశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నాయని వెల్లడించారు. వీటిల్లో ఇండోనేసియా కూడా ఉంది. ఈ దేశంలోని ప్రముఖ బాలి దీవి బీచ్‌ల్లో గడిపేందుకు మక్కువ చూపుతున్నారని చెప్పారు. ఈ దీవికి నేరుగా విమాన సౌకర్యం ఉండటంతోపాటు అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీయత పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయన్నారు. అయితే, గ్రీస్, పారిస్, సెచెల్స్ లను కూడా కొత్త జంటలు ఇష్టపడుతున్నాయని చెప్పారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఈ ప్రాంతాల కోసం ఆన్లైన్లో వెతికే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. -
భారతీయ దంపతులకు మాత్రమే....
-
భారతీయ దంపతులకు మాత్రమే....
న్యూఢిల్లీ: సరోగసిని భారతీయ దంపతులకు మాత్రమే అనుమతిస్తామని, విదేశీయులకు అనుమతించబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు బుధవారం అఫిడవిట్ సమర్పించింది. 'కమర్షియల్ సరోగసిని ప్రభుత్వం అనుమతించబోదు. ఇండియాలో విదేశీయులకు సరోగసి సేవలు అందుబాటులో ఉండవు' అని అఫిడవిట్ లో కేంద్రం పేర్కొంది. కమర్షియల్ సరోగసి కోసం అండం దిగుమతి చేసుకోవడంపైనా నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. అయితే పరిశోధనల కోసం వినియోగించే వాటిపై ఆంక్షలు ఉండవని స్పష్టం చేసింది. అలాగే అద్దెగర్భం ద్వారా జన్మించిన వికలాంగ శిశువులను తీసుకునేందుకు నిరాకరించే దంపతులకు జరిమానా విధించాలని భావిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్ర సర్కారు తెలిపింది. సరోగసి విధానాన్ని వ్యాపార వస్తువుగా మార్చకుండా చేసేందుకు రూపొందించిన ముసాయిదాను రాష్ట్రాలను పంపినట్టు వెల్లడించింది. అద్దెగర్భం ద్వారా శిశువులకు జన్మనిచ్చిన మహిళల ప్రయోజనాలు కాపాడేందుకు, కమర్షియల్ సరోగసిని నియత్రించేందుకు సమగ్ర చట్టం తేవాల్సిన అవసరముందని కేంద్రం అభిప్రాయపడింది.కాగా, దీనిపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 24కు వాయిదా వేసింది.