breaking news
IDPL
-
HYD: యాచకురాలికి పురుడు పోసిన 108 సిబ్బంది, కానిస్టేబుల్
సాక్షి, జీడిమెట్ల: పురిటి నొప్పులు భరించలేక రోడ్డుపై పడిపోయిన ఓ యాచకురాలికి 108 సిబ్బంది ఓ మహిళా కానిస్టేబుల్ సహాయంతో పురుడు పోశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 11.30గంటల ప్రాంతంలో ఐడీపీఎల్‌లోని డొమినోస్ సందులో ఓ గర్బిని పురిటి నొప్పులతో అవస్థ పడుతున్నట్లు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు 108 సిబ్బంది రాజు, శ్రీనివాస్‌లకు విషయం తెలిపి ఐడీపీఎల్ వద్దకు వాహనం పంపించారు. అప్పటికే ప్రసవ వేదనతో తల్లడిల్లుతున్న మహిళకు 108 సిబ్బంది ఓ లేడీ కానిస్టేబుల్ పురుడు పోయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జీడిమెట్ల సీఐ వపన్ సూచన మేరకు సదరు మహిళను 108 సిబ్బంది గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎవరు ఆమె! సదరు మహిళను పోలీసులు, 108 సిబ్బంది వివరాలు అడగగా తన పేరు కృష్ణవేణి అని తాను యాచకురాలిని అని తెలిపింది. దీంతో పాటు తనకు ఎవరూ లేరంటూ ఒంటిరిగా ఉంటూ భిక్షాటన చేస్తున్నట్లు మాత్రమే తెలిపిందని పోలీసులు అంటున్నారు. -
నేడు చంద్రన్న సంస్మరణ
తెలుగునేల మీద అలలు, అలలుగా ఎదిగిన అనేక ప్రజా ఉద్యమాలతో అర్ధ శతాబ్దం పైబడి నడిచిన దళిత సామాజిక ఉద్యమకారులు, నాటి ఇఫ్టూ కార్మిక నాయకులు, 2004లో నాటి ప్రభుత్వంతో విప్లవ పార్టీ తరఫున శాంతి చర్చల ప్రతినిధి, కల్లెపు చంద్రన్న అలియాస్ చర్చల చంద్రన్న అలియాస్ ఐడీపీఎల్ చంద్రన్న ఈ నెల 12న అమరులైనారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆలేరు దగ్గర టంగుటూరులో 1945 మే, 15న నిరుపేద దళిత కుటుంబంలో ముత్తమ్మ, ఎల్లయ్యలకు జన్మించిన పెద్దకొడుకు చంద్రన్న. చదువుల కోసం అష్టకష్టాలు పడి జనగామలో పదో తరగతి ముగించుకొని పొట్ట చేతపట్టు కుని సికింద్రాబాద్ చిలకలగూడలోని చింతబాయి బస్తీ చేరిండు. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న కాలంలో ఈశ్వరీ బాయిగారి వెంట ఉండి ఆందోళనలో పొల్గొంటూ ఐడీపీఎల్ ఉద్యోగిగా, ప్రాగాటూల్స్, ఆల్విన్, తుంగభద్ర ఇండస్ట్రీస్, బిర్లాప్లాంట్ సహా అనేక ఫ్యాక్టరీలలో విప్లవకార్మిక నాయకుడిగా ఎదిగాడు. దేశం నలు మూలల జాతీయ కార్మిక సంఘాల సభల్లో పాల్గొని, విప్లవ పార్టీ నిర్మాణంలోకి వెళ్ళి అడ్డగుట్ట, పార్సీగుట్ట, జగద్గిర్గుట్ట బతుకమ్మకుంట, భగత్‌సింగ్ నగర్ ఒకటేమిటి మురికివాడల పేదలకోసం, అసంఘటిత కార్మికుల కోసం అనేక పోరాటాలకు ఆయన నాయకత్వం వహించి జనశక్తి పార్టీ తరఫున 2004లో శాంతి చర్చలో పాల్గొన్న చర్చల చంద్రన్నగా మనకు తెలుసు. ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణలో బహుజన నాయకత్వం ఎదగాలని రాజకీయ ఆచరణకు శ్రీకారం చుట్టి మాదిగ ఉప కులాల ఫ్రంట్ ఏర్పాటుచేశారు చంద్రన్న. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏర్పాటు చేసి, అసంఘటిత కార్మిక సంఘాల ఫ్రంట్ నడిపి, తెలంగాణ కోసం పోరా డిన యోధులకు ఒక సంఘం ఉండా లని ‘తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల సంఘం’ నడిపిన చంద్రన్నను స్మరించుకోవడం మన బాధ్యత. సంస్మరణ సభకు జెండా మనమే, ఎజెండా మనమే. నిన్న అంతిమ యాత్రలో కదిలింది మనమే, సంస్మరణ సభలో కదం తొక్కాల్సింది మనమే. జనం కొరకు నిలబడ్డ యోధుడు ‘అన్సంగ్ హీరో’గా కాల గర్భంలో కలిసిపోవద్దు. మన యోధుల చరిత్ర మనమే ఎత్తి పట్టాలి. ఈ సంస్మరణ సభను ఇంటి పార్టీ సమన్వయం చేస్తున్నది. చంద్రన్న అందరివాడు... సభను జయప్రధం చేద్దాం. (నేటి సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కల్లెపు చంద్రన్న సంస్మరణ సభ) -పోతిరెడ్డిపల్లి రామన్న మాదిగ, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర సెక్రటరీ మొబైల్ : 90006 00744 -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
జగద్గిరిగుట్ట: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున నగరంలోని ఐడీపీఎల్ చౌరస్తా వద్ద జరిగింది. వివరాలు.. జగద్గిరిగుట్ట పాపిరెడ్డినగర్‌కు చెందిన సాంబశివరావు (50) బాలానగర్‌లోని ఉషా ఫ్యాన్ల కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం విధులకు నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి వాహనం వివరాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.