టోఫెల్ పేరిట టోకరా
సాక్షి, హైదరాబాద్: జీఆర్ఈ టోఫెల్ ఎగ్జామ్‌కు సిద్ధమయ్యే యువతే లక్ష్యంగా మోసపూరిత కుట్రకు తెరలేపారు హైదరాబాద్‌లో స్థిరపడిన నల్లగొండవాసి అభిషేక్‌రెడ్డి. దీనికి వంశీ సహకారాన్ని తీసుకున్నాడు. ఇంజనీరింగ్ కోర్సు చదివిన వీరు జీఆర్ఈ టోఫెల్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రాలను పరీక్షకు ముందే మీ చేతుల్లో పెడతామంటూ విద్యార్థులను నమ్మించి డబ్బులు గుంజుతున్నారన్న విషయం సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందింది.
ఈ మేరకు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల సహకారంతో హైదరాబాద్ బేగంపేట రైల్వేస్టేష న్ సమీపంలోని లీలానగర్‌లో వీరు నిర్వహిస్తున్న కార్యాలయంపై ఆదివారం దాడులు చేశారు. నిందితులు అభిషేక్ రెడ్డి, వంశీని అదుపులోకి తీసుకున్నారు.
ఫేస్బుక్కే అడ్డాగా...
నిందితులిద్దరూ రోజు కార్యాలయానికి వచ్చి ఫేస్బుక్ ఓపెన్ చేసి ఇంజనీరింగ్ కోర్సుల్లో బ్యాక్‌లాగ్‌లు ఉన్నవారిని పాస్ చేయిస్తాం. జీఆర్ఈ టోఫెల్ ఎగ్జామ్ గట్టెక్కేలా చేస్తామని యువతకు మెసేజ్‌లు పెడతారు. తమ కాంటాక్ట్ నంబర్‌తో సమాచారాన్ని ఎక్కువగా గ్రూప్ పేజీల్లో పోస్ట్ చేస్తుంటారు. ఆరేళ్ల క్రితం నుంచి నిర్వహిస్తున్న వివిధ జీఆర్ఈ టోఫెల్ ఎగ్జామ్ పేపర్లలోని కొన్ని ప్రశ్నలను ఏరి వీరు కొత్తగా ప్రశ్నాపత్రాన్ని రెడీ చేసి జరగబోయే పరీక్ష ప్రశ్నాపత్రమిదేనని నమ్మిస్తున్నారు.
అలా ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. కాగా టోఫెల్ పేపర్ని ఆన్లైన్లో హ్యాక్ చేశారన్న ప్రచారం వట్టిదేనని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.