breaking news
Government Colleges students
-
పాలిటెక్నిక్ విద్యలో నవోదయం
ఈ చిత్రంలోని విద్యార్థి పేరు కె. తరుణ్. రావులపాలేనికి చెందిన ఓ రైతు కొడుకు. మూడేళ్ల క్రితం పాలిసెట్‌లో ర్యాంకు సాధించి కాకినాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్‌లో చేరాడు. ఇటీవల నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో విప్రో కంపెనీలో రూ.3.50 లక్షల వేతనంతో ఉద్యోగంతో పాటు నాలుగేళ్ల సర్వీసు అనంతరం బిట్స్ పిలానీ నుంచి బీటెక్ డిగ్రీ ఇచ్చేందుకు కంపెనీ ఆఫర్ ఇచ్చింది. కానీ, ‘పదో తరగతిలో నా స్నేహితులు 10 మంది పాలిసెట్ రాశాం. నలుగురికి ర్యాంకులు వచ్చాయి. నేరు డిప్లొమాలో చేరితే మిగతా వారు ఇంటర్, తర్వాత ఇంజినీరింగ్‌లో చేరారు. వారింకా చదువుల్లో ఉంటే నేను 18 ఏళ్లకే మంచి ప్యాకేజీతో ఉద్యోగం అందుకున్నా. డిప్లొమా వదిలేసినందుకు వారిప్పుడు బాధపడుతున్నారు’.. అని తరుణ్ అంటున్నాడు. ఈ విద్యార్థి పేరు ప్రేమ్‌సాయి. ఊరు ప్రొద్దుటూరు. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఇతను విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ డిప్లొమా కోర్సులో చేరాడు. ఇటీవల క్యాంపస్ ప్లేస్మెంట్లో రూ.6.25 లక్షల వేతనంతో మెట్సో ఒటోటెక్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. కానీ, ఈయన సోదరి ఇంకా బీటెక్ మూడో ఏడాది చదువుతుండగానే ప్రేమ్‌సాయి ఉద్యోగం సాధించేశాడు. విశాఖపట్నానికి చెందిన పి. నవ్యశ్రీని ఆమె తల్లి చిరుద్యోగం చేస్తూ కుమార్తెను చదివించింది. భీమునిపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఈసీఈ డిప్లొమా మూడో ఏడాది చదువుతోంది. రూ.4.06 లక్షల ప్యాకేజీతో స్క్లంబర్గర్ కంపెనీలో కొలువు సంపాదించింది. కంచరపాలేనికి చెందిన జి. గీతాభవాని తండ్రి ఓ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. గీత విశాఖపట్నంలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పెట్రో కెమికల్స్‌లో డిప్లొమా చేసింది. ఇటీవల క్యాంపస్ ఎంపికల్లో రూ.4 లక్షల వేతనంతో అల్ట్రాటెక్ కంపెనీలో కొలువును సొంతం చేసుకుంది. కేవలం 18 ఏళ్ల వయసులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని నాలుగు వేల మందికి పైగా విద్యార్థులు ఏడాదికి సగటున రూ.2.80 లక్షల వేతనంతో కొలువులతో పాటు, ఉన్నత విద్యావకాశాలు కూడా దక్కించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాంగణ ఎంపికల్లో మరో రెండు వేల మందికి పైగా ఉద్యోగాలు సాధిస్తారని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ సి. నాగరాణి గర్వంగా చెబుతున్నారు. ఇదంతా గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, ప్రోత్సాహంతోనే సాధ్యమైందంటున్నారు. సాక్షి, అమరావతి: పదో తరగతి తర్వాత పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థుల గమ్యం మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు. చదువుతో పాటే క్యాంపస్ ప్లేస్మెంట్లలో రూ.లక్షల వేతనాలతో విద్యార్థులు ఉద్యోగాలు దక్కించుకుంటున్నారు. 2022–23 బ్యాచ్‌కు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు 4,000 మందికి పైగా ఇంకా పరీక్షలు పూర్తికాకుండానే మంచి వేతనాలతో క్యాంపస్ కొలువులను సొంతం చేసుకున్నారు. గరిష్టంగా రూ.6.25 లక్షలు, సరాసరి రూ.2.80 లక్షల వార్షిక వేతనాలతో బహుళజాతి సంస్థల్లో ఆఫర్ లెటర్లు అందుకున్నారు. ఇంటర్, ఇంజినీరింగ్ కోర్సులతో ఆరేళ్లు చదివి పూర్తిచేసిన తర్వాత అందుకునే వేతనాలను మూడేళ్ల డిప్లొమాతో 18 ఏళ్ల వయసులోనే అందుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం 400 దాటని అవకాశాలు.. ఇçప్పుడు వేలమందికి అందడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంస్కరణల ప్రభావం ఎంతో ఉంది. దీంతోపాటు ఏపీ సాంకేతిక విద్యాశాఖ చూపిన చొరవతో డిప్లొమా బోధనలోను మార్పులు చేశారు. ప్రభుత్వ కాలేజీల్లోనే అధిక కొలువులు రాష్ట్రంలో 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు, 175 ప్రైవేటు, ఒక ఎయిడెడ్ కాలేజీ ఉన్నాయి. వీటిల్లో గత దశాబ్ద కాలంలో ఏనాడు కొలువులు 450 దాటలేదు. 2019–20లో 575 ఉద్యోగాలు, 2020–21లో 652, 2021–22లో 780 ఉద్యోగాలు అందుకుంటే.. ఈసారి 2022–23లో ఒక్క ప్రభుత్వ కాలేజీ విద్యార్థులే 4,071 మంది ఉద్యోగాలు సాధించారు. మే చివరి వరకు కొనసాగే ఈ నియామక ప్రక్రియలో మరో రెండువేల మందికి పైగా అవకాశాలు పొందుతారని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ సి. నాగరాణి ‘సాక్షి’కి తెలిపారు. అలాగే, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీల్లోని 24,667 మంది విద్యార్థుల్లో రెండువేల మంది విద్యార్థులు ఉద్యోగావకాశాలు దక్కించుకున్నారు. 31 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది స్కిల్ హబ్‌లను ఏర్పాటుచేయడంతో శిక్షణ పొందిన విద్యార్థులు సునాయాసంగా కొలువులను దక్కించుకున్నారు. అత్యధికంగా నంద్యాలలోని ఈఎస్సీ పాలిటెక్నిక్ కాలేజీ నుంచి 352 మంది, విజయవాడ పాలిటెక్నిక్ నుంచి 277 మంది, కాకినాడ ఆంధ్రా పాలిటెక్నిక్ నుంచి 224 మంది, అనంతపురం పాలిటెక్నిక్ నుంచి 215 మంది, విశాఖపట్నం (నేషనల్ హైవే) పాలిటెక్నిక్ నుంచి 174 మంది ఎంపికయ్యారు. ఉద్యోగంతో పాటు ఉన్నత చదువులు గతంలో ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చిందంటే సీనియారిటీ ప్రకారం వేతనాలు పెరిగే పరిస్థితి. ఈ ఏడాది నుంచి సాంకేతిక విద్యాశాఖ చేసిన కృషితో చాలా కంపెనీలు డిప్లొమా విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు ఉన్నత చదువులు చదివేందుకూ అవకాశం కల్పించాయి. వాటిల్లో ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్, విప్రో, స్మార్ట్ డీవీ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, టాటా ప్రాజెక్ట్స్, షాపూర్జీ–పల్లోంజీ, జేఎస్‌డబ్ల్యూ, అల్ట్రాటెక్, మెట్సో ఉటోటెక్ వంటి అగ్రశ్రేణి సంస్థలు ఉండడం గమనార్హం. ఉద్యోగాల్లో చేరిన వారికి నాలుగేళ్లల్లో ‘వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్’ (వైల్) ద్వారా బీఎస్సీ, బీటెక్ డిగ్రీ ఇచ్చేలా ఆయా కంపెనీలు అంగీకరించాయి. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులు చదువులో భాగంగా చేసే 6 నెలలు, ఏడాది ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌లోనే నూరు శాతం ఉద్యోగాలు లభించేలా శిక్షణనివ్వనుంది. ప్రతి కాలేజీలోనూ ప్లేస్మెంట్ సెల్ ఇంజినీరింగ్ చేస్తేనే అవకాశాలు ఉంటాయన్నది అపోహే. ఈ ఏడాది ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 11,604 మంది విద్యార్థులు చివరి సంవత్సరం చదువుతుంటే వారిలో 4 వేల మందికి పైగా పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. కమిషనర్ నాగరాణి ఆయా పరిశ్రమలను స్వయంగా పరిశీలించి ఒప్పందం చేసుకున్నారు. అన్ని కాలేజీల్లోను ప్లేస్మెంట్ సెల్ ఏర్పాటుచేసి కేంద్ర కార్యాలయంతో అనుసంధానించారు. ఫైనలియర్‌లోనే క్యాంపస్ రిక్రూట్మెంట్పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నాం. – డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ (ప్లేస్మెంట్ సెల్) ఇండస్ట్రియల్–అకడమిక్ సౌజన్యంతో.. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యా బోధనలో మార్పులు చేస్తున్నాం. 31 జీపీటీల్లో స్కిల్ హబ్స్‌ను ఏర్పాటుచేశాం. రాష్ట్రానికి బహుళజాతి కంపెనీలూ వస్తున్నాయి. వాటికి అనుగుణంగా విద్యార్థులకు శిక్షణనిస్తున్నాం. ఆ కంపెనీలే క్యాంపస్‌కు వచ్చి ఉద్యోగాలిస్తున్నాయి. అలాగే, మారుతున్న సాంకేతిక, అవసరాలకు తగ్గట్టు బోధన ఉండేలా లెక్చరర్లకు అవసరమైన నైపుణ్య శిక్షణ కూడా ఇస్తున్నాం. ఈ ఏడాది మొదటి విడతగా 84 మంది ప్రొఫెసర్లను ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌కు పంపించాం. చాలామంది విద్యార్థులు డిప్లొమా తర్వాత బీఎస్సీ, బీటెక్ చేయాలనుకుంటున్నారు. అలాంటి వారికి కంపెనీలో ఉద్యోగం ఇస్తూనే నాలుగేళ్లల్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇచ్చేలా యాజమాన్యాలు ఒప్పందం చేసుకున్నాయి. వచ్చే ఏడాది నూరుశాతం ప్లేస్‌మెంట్స్‌కు ప్రణాళిక సిద్ధంచేశాం. – సి. నాగరాణి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ -
కాలేజీల్లో లంచ్..
విద్యారణ్యపురి: కళాశాల విద్యార్థులకు ఇక లంచ్ కష్టాలు తీరనున్నాయి. ప్రభు త్వ జూనియర్, డిగ్రీ, పాలీటెక్నిక్, డైట్, బీఎడ్, మోడల్ స్కూల్ విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరంలో మధ్యాహ్న భోజ నం ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంతో ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో చాలా మంది ఉద యం భోజనం లేదా టిఫిన్ చేసి కళాశాలకు వచ్చేస్తుండగా, కొందరు మాత్రం ఇంటి నుంచి లంచ్ బాక్స్‌లు తెచ్చుకుంటున్నారు. తెచ్చుకున్న లంచ్ బాక్స్‌ను విప్పి తినేందుకు ప్రభుత్వ కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు భోజనం తెచ్చుకునేందుకు కూడా వెనుకాడుతున్నారు. దీంతో ఆకలి తీర్చుకునేందుకు చాయ్, సమోసాలను ఆశ్రయిస్తున్నారు. విద్యార్థులు మధ్యాహ్న భోజ నం చేసేందుకు ఇంటికో, అద్దె రూమ్‌కో వెళ్లిపోతుండడం వల్ల కళాశాలల్లో తరగతులు ఒక పూటే నిర్వహించాల్సి వస్తోంది. మధ్యాహ్నం తర్వాత క్లాస్‌లు ఉన్నా విద్యార్థులు కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతోపాటు తరగతులు రెండు పూటలా జరిగే అవకాశముందని ఆయా కళాశాలల అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్లో 12 వేల మందికి లబ్ధి.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత మూడేళ్లుగా ఇంటర్లో ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా పూర్తి స్థాయిలో ఉచిత విద్యను ప్రభుత్వం అందిస్తోంది. అంతేగాక విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తున్నారు. రెండేళ్ల క్రితమే విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉచిత విద్యతోపాటు అడ్మిషన్ల పెరుగుదలకు మధ్యాహ్న భోజనం కూడా అమలు చేస్తామని ప్రకటించారు. కానీ ఏ కారణంగానో ఇప్పటి వరకు ఆ హామీ అమలుకు నోచుకోలేదు. ఈ పథకం అమలుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 44 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న సుమారు 12 వేల మందికిపైగా ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థుల ఆకలి తీరనుంది. 7,900 మంది డిగ్రీ విద్యార్థులకు ప్రయోజనం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 14 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, అందులో 7,900 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో హన్మకొండలోని ఒక్క కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే 3,618 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాలలో 1600 మంది విద్యార్థినులు, ఏటూరునాగారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 718 మంది విద్యార్థులు, జనగామ డిగ్రీ కళాశాలలో సుమారు 1500 మంది, నర్సంపేట డిగ్రీ కళాశాలలో 213 మంది, మహదేవపూర్ డిగ్రీ కళాశాలలో 192 మంది విద్యార్థులు చదువుతుండగా మిగతా డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగానే ఉంది. పరీక్షల సమయానికి రెండు నెలల ముందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో దాతల సహకారంతోనైనా మధ్యాహ్న భోజనం పెట్టాలని ఉన్నత విద్యా కమిషనర్ మూడేళ్ల క్రితం ఆదేశాలు జారీ చేశారు. దీంతో హన్మకొండలోని పింగిళి డిగ్రీ కళాశాల, మహబాబూబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు కొంత నిధులు వేసుకుని, దాతల సహకారంతో మధ్యాహ్న భోజనం అమలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వమే మధ్యాహ్న భోజనం అందించబోతుండడంతో అధ్యాపకులకు కొంత శ్రమ తప్పినట్లయ్యింది. డైట్, బీఎడ్ విద్యార్థులకు ఊరట... హన్మకొండలో ఒకే ప్రభుత్వ డైట్ కళాశాల ఉంది. అందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియం కలిపి 230 మంది చదువుకుంటున్నారు. అలాగే హన్మకొండలోని ప్రభుత్వ బీఎడ్ కళాశాలలో రెండు వందల సీట్లు ఉండగా అందులో ప్రస్తుతం 130 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ రెండు కళాశాలల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం లేదు. దీంతో వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నవారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వారికి కూడా మధ్యాహ్న భోజనం వర్తింపజేయడంతో కొంత ఊరట కలగనుంది. నాలుగు పాలిటెక్నిక్ కళాశాల్లో 3,240 మంది విద్యార్థులు.. వరంగల్ ప్రభుత్వ పాలీటెక్నిక్ కళాశాల(కోఎడ్యుకేషన్)లో సుమారు 1600 మంది విద్యార్థులు, వరంగల్ ప్రభుత్వ మహిళా పాలీటెక్నిక్ కళాశాలలో 800 మంది విద్యార్థినులు, పరకాల పాలీటెక్నిక్ కళాశాలలో 360 మంది, స్టేషన్ ఘన్పూర్ పాలీటెక్నిక్ కళాశాలలో 480 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మధ్యాహ్న భోజనం వర్తింపజేయబోతుండడంతో వారిలో ఆశలు చిగురుస్తున్నాయి. మోడల్ స్కూళ్లలోనూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 30 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. అందులో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు ఉన్నారు. ఒక్కో మోడల్స్కూల్లో బాలికలకు కొన్ని క్లాస్‌ల వరకు వంద మందికి మాత్రమే హాస్టల్ సౌకర్యం కల్పిస్తున్నారు. మిగతా వారంతా లంచ్ బాక్స్‌లతో వెళ్తున్నారు. ఒక్కో స్కూల్లో 750 నుంచి 800 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి మ«ధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పిస్తే ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న వారంతా పేదవర్గాలకు చెందినవారే ఉంటున్నారు. మధ్యాహ్న భోజనం అమలు నిర్ణయాన్ని ఆయా వర్గాలు స్వాగతిస్తున్నాయి. ప్రభుత్వం అందజేసే భోజనంలో నాణ్యత పాటించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పథకం అమలును అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు అప్పగించాలని మంత్రివర్గం ప్రాథమికంగా నిర్ణయించడం వల్ల త్వరలోనే ఈ పథకం అమలు కాబోతుందని విద్యార్థులు ఆశిస్తున్నారు. -
4నుంచి ‘అడ్వాన్స్డ్’ విద్యార్థులకు శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయి, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కానున్న ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల కోసం మూడువారాల పాటు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియంశ్రీహరి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఫెయిల్ అయిన సబ్జెక్టుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనరల్, వొకేషనల్‌లో కలిపి ద్వితీయ సంవత్సరంలో 2,29,478 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, ఇంటర్ ప్రథమ సంవత్సరంలోనూ మరో 2 లక్షల మంది వరకు విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకోసం ఇంగ్లిషు, సైన్స్, గణితం తదితర సబ్జెక్టుల్లో నిఫుణులైన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లతో మూడు వారాల ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మే 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ ప్రత్యేక శిక్షణను చేపట్టనున్నట్లు చెప్పారు. పట్టణాల్లో ఈ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నందున బాల బాలికలకు ఉచితంగా వసతిని కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. జిల్లాల్లో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, అయితే విద్యార్థుల నుంచి వచ్చే దరఖాస్తులను బట్టి కేంద్రాల సంఖ్యను పెంచుతామని చెప్పారు. ఈ అవకాశం ప్రభుత్వం కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులకు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.