breaking news
gold bonam
-
కొండంత బోనం.. కోటంత సంబురం
గోల్కొండ/చార్మినార్: ఆషాఢ మాసం బోనాల జాతరలో భాగంగా గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి గురువారం తొలి బోనం పూజ ఘనంగా జరిగింది. బోనాల జాతరకు వీఐపీలతో పాటు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. బోనాల నిర్వహణ ఉత్సవ కమిటీ చైర్మన్ కె.చంటిబాబు గోల్కొండ చౌరస్తా వద్ద ఘటాలకు స్వాగతం పలికారు. కాగా.. సప్త మాతృకలకు సప్త బంగారు బోనాల్లో భాగంగా జగదాంబిక అమ్మవారికి తొలి బంగారు బోనం సమర్పించారు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో అక్కన్న మాదన్న దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా గోల్కొండ కోటకు బయలుదేరారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, గాజుల అంజయ్య, రాకేష్ తివారి, పొటేల్ సదానంద్ యాదవ్, జనగామ మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్దమ్మ తల్లికి నేడు బంగారు బోనం
చార్మినార్: భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11–30 గంటలకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారికి బంగారు పాత్రలో బోనం సమర్పించనున్నామని కమిటీ అధ్యక్షుడు జె.మధుసూదన్‌గౌడ్ తెలిపారు. ఈసారి జరిగే ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో ఏడు దేవాలయాల అమ్మవార్లకు ఏడు బంగారు బోనాలను సమర్పిస్తున్నామన్నారు. సప్త మాతృకల సప్త బంగారు బోనం పేరుతో గోల్కోండ, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, పెద్దమ్మ దేవాలయం, బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి, చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం, లాల్‌దర్వాజా సింహవాహిణి దేవాలయం అమ్మవార్లకు బంగారు పాత్రలో బోనాన్ని సమర్పించడానికి కార్యాచరణను రూపొందించామన్నారు. ఇప్పటికే గోల్కొండ జగదాంబ అమ్మవారికి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, విజయవాడ కనక దుర్గమ్మ తల్లి, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారికి బంగారు పాత్రలో బోనానంతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించామన్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు ఉప్పుగూడ మహాంకాళి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బంగారు పాత్రలో బోనాన్ని తీసుకెళ్లి పెద్దమ్మ తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు సమర్పించనున్నామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిçస్తూ పరిమిత సంఖ్యలో దేవాలయానికి వెళుతున్నట్లు ఆయన తెలిపారు. -
అమ్మ సేవలో..
చాంద్రాయణగుట్ట: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం బంగారు బోనం సమర్పించారు. గత వారం జరిగిన బోనాల పండుగకు ఆమె చైనాలో జరుగుతున్న పోటీల కారణంగా హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలో ఆదివారం మారుబోనం ఉత్సవంలో ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు సింధు ఆలయానికి విచ్చేశారు. సంప్రదాయ వస్త్రాధారణతో వచ్చిన ఆమెకు మేళతాళాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. లాల్‌దర్వాజా అమ్మవారు తన ఇష్టదైవంగా చెప్పారు. ఏటా బోనాల జాతరకు వస్తుంటానని, అమ్మ దీవెనతోనే తాను అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నట్టు చెప్పారు. త్వరలో జరిగే ఏషియన్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి తిరిగి అమ్మవారిని దర్శించుకుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పి.వై.కైలాష్ వీర్, ప్రతినిధులు కె.వెంకటేష్, జి.మహేష్ గౌడ్, బి.బల్వంత్ యాదవ్, మాణిక్ ప్రభు గౌడ్, తిరుపతి నర్సింగరావు, విష్ణు గౌడ్, కాశీనాథ్ గౌడ్, రాజ్‌కుమార్ యాదవ్, అరవింద్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సింహవాహినికి ‘బంగారు బోనం’
రాష్ట్రప్రభుత్వం తరఫున సమర్పించిన సీఎం కేసీఆర్ పాతనగరంలో వైభవంగా రాష్ట్ర పండుగ సాక్షి, హైదరాబాద్ : అక్కడ భక్తి పరవళ్లు తొక్కింది. లయబద్ధమైన డప్పుల దరువులకు పోతురాజులు అడుగులు కదిపారు. అమ్మ కళను ఆవహించుకున్న శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. అంబరాన్నంటిన సంబరాల మధ్యన ఫలహార బండ్ల ఊరేగింపు సాగింది. బోనాలు పట్టిన మహిళలు అమ్మవారికి తొట్టెలను సమర్పించి పులకితులయ్యారు. ఇదీ ఆదివారం పాతనగరంలో కన్నుల పండువగా సాగిన రాష్ట్రపండగ బోనాల జాతర తీరు. మహానగరిలో కుగ్రామ వాతావరణం ఆవిష్కృతమైన ఘట్టం. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉదయం 11.50 గంటలకు సతీసమేతంగా విచ్చేసి లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.సీఎంకు ఆలయ కమిటీ నిర్వాహకులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతకు ముందు హరిబౌలిలోని అక్కన్న, మాదన్న దేవాలయంలోనూ కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. మీరాలంమండిలోని మహంకాళి దేవాలయంలో హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. బోనాలను రాష్ట్ర పర్వదినంగా గుర్తించడంతో నగరంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించే ఆనవాయితీకి శ్రీకారం చుట్టారు. పవిత్ర పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతా:సీఎం కేసీఆర్ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయాన్ని విస్తరించి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జాతర నిర్వహించుకునే అమ్మవారి ఆలయం చాలా చిన్నదిగా ఉండడం బాధాకరమన్నారు.క్షేత్రంగా విస్తరణకు అవసరమైనస్థలాన్ని సేకరిస్తామన్నారు. బోనం సమర్పించిన అనంతరం ఆయన అక్కడ జరిగిన సభలో ప్రసంగించారు. గతేడాది అమ్మవారి ఆలయానికి రమ్మని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారని.. ఆ సమయంలో తాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని మొక్కుకున్నానని కేసీఆర్ అన్నారు. అమ్మవారి దయతో రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో బంగారు బోనాన్ని సమర్పించి మొక్కు తీర్చుకున్నానన్నారు. రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురిసి పంటలు సస్యశ్యామలంగా పండేలా దీవించాలని తల్లిని మొక్కుకున్నానన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కేసీఆర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిలకు అమ్మవారి ఫొటోలను జ్ఞాపికలుగా అందజేశారు. కిటకిటలాడిన సింహవాహిని ఆలయం తెల్లవారు జామునుంచేమహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి లాల్‌దర్వాజ అమ్మవారికి బోనం సమర్పించడానికి క్యూ కట్టారు. భక్తుల రద్దీతో పరిసర రోడ్లన్నీ కళకళలాడాయి. పాతబస్తీలోని మీరాలం మండి మహంకాళి దేవాలయం, ఉప్పుగూడ, సుల్తాన్షాహి, గౌలిపురా, మురాద్‌మహాల్, అక్కన్నమాదన్నల మహంకాళి దేవాలయం, బేలా ముత్యాలమ్మ, హరిబౌలి, రాంబక్షిబండ ,మేకలబండ, తదితర ప్రాంతాల్లోని అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిక్కిరిసాయి. దక్షిణ మండలం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి స్వయంగా శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ప్రముఖుల సందర్శన సీఎంతో పాటు శాసన సభ స్పీకర్ మధుసూధనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా నిజామాబాద్ ఎంపీ కవిత, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, చింతల రాంచంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రకాష్‌గౌడ్, గీతారెడ్డి, తదితరులు దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. బోనానికి అరకిలో బంగారం లాల్ దర్వాజ మహంకాళికి సీఎం చేతులు మీదుగా సమర్పించిన బంగారు బోనం తయారీకి అరకిలో బంగారాన్ని వినియోగించారు. దాతల సాయంతో శివ అనే భక్తుడు ఈ బోనాన్ని రూపొందించాడు. ఊరేగింపుగా.. ‘నేత’ విలక్షణ శైలిలో మైసమ్మకు చీర సమర్పించిన పద్మశాలీ భక్తులు హైదరాబాద్ : వారు భక్తిని విలక్షణంగా చాటుకున్నారు. హైదరాబాద్ నగరంలోని కార్వాన్ దర్బార్ మైసమ్మ తల్లికి స్థానిక పద్మశాలీ భక్తులు తమ నేత నిపుణతను ప్రదర్శిస్తూ పట్టు చీరను సమర్పించారు. అందర్నీ ఆకట్టుకున్న ఈ ప్రదర్శన ఆదివారం జరిగింది. కార్వాన్‌లోని మార్కండేయ భవన్‌నుంచి కొందరు పద్మశాలీ వర్గానికి చెందిన భక్తులు మగ్గంపై నేతపని చేస్తూనే ఊరేగింపుగా వచ్చారు. తొలుత వారు మార్కండేయ భవన్లో ఉదయం తొమ్మిది గంటలకు నేతను ప్రారంభించి రెండు గంటల వరకూ ఏకధాటిగా సాగించారు. అనంతరం మూడుగంటలకు నేత ఊరేగింపును ప్రారంభిస్తూ నాలుగు గంటలకు ఆలయం వద్దకు చేరుకునే సరికి అల్లిక పూర్తిచేసి అమ్మవారికి పట్టుచీరను భక్తి ప్రపత్తులతో అందించి పులకితులయ్యారు.