breaking news
George Bernard Shaw
-
చనిపోయిన సింహం కంటే
సమయోచితంగా ఛలోక్తులూ, వ్యంగ్యోక్తులూ విసిరి ఎదుటివారిని నోరెత్తకుండా చెయ్యడంలో గొప్ప ప్రజ్ఞావంతుడు బెర్నార్డ్ షా. అయితే అప్పుడప్పుడు ఆయన కూడా దెబ్బతిన్న సందర్భాలున్నాయి. జి.కె.చెస్టర్టన్కీ షాకీ ఎప్పుడూ పడేది కాదు. షేక్స్పియర్ జయంతి సందర్భంగా ఆయన జన్మస్థలమైన స్ట్రాట్ఫార్డ్ ఎవాన్‌లో ఆయన నాటక ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేశారు. ప్రసిద్ధ రచయితలంతా ఆ ఉత్సవానికి హాజరయ్యారు. షా కూడా వెళ్లాడు. అక్కడేవున్న చెస్టర్టన్ పలకరించి ‘‘స్వాగతం మిస్టర్ షా. మీరు కూడా ఇక్కడికి వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఏది ఏమైనా చచ్చిపోయిన సింహం(షేక్స్పియర్) కంటే బతికున్న శునకం మేలు కదా’’ అని వ్యంగ్యంగా ఒక సామెత విసిరాడు. ఆ మాటతో ఏమీ అనలేక కోపంగా వెళ్లిపోయాడు షా. దీని నేపథ్యం ఏమిటంటే, తన నాటకాల్లో నైతిక బోధన ఉంది కాబట్టి షేక్స్పియర్ నాటకాల కంటే తన నాటకాలే గొప్పవని షా అంటూ ఉండేవాడట. - ఈదుపల్లి వెంకటేశ్వరరావు -
సత్యమే ఆయన మతం
సత్యం అనే గమ్యానికి దారి లేదు. ఎవరికి వారు బాట వేసుకుని సత్యాన్ని చేరుకోవలసిందే. ఏ మతం, ఏ మత గ్రంథం, ఏ మతాచార్యుడు, ఏ విశ్వాసం ఏ సిద్ధాంతం సత్యాన్ని మనకు అందించలేదు. సత్యం అంగడిలో దొరికే వస్తువు కాదు. సత్యం ఒకరిస్తే పుచ్చుకునేది కాదు. ఒకరు సత్యాన్ని కనుగొంటే అది అతని సత్యం అవుతుంది. మనది కాదు. మన సత్యాన్ని అన్వేషించి కనుగొనవలసిందే. 1909, ఏప్రిల్ మాసంలో ఓ సాయంత్రం. మద్రాస్‌లోని అడయార్ సముద్రపు ఒడ్డున ఇసుకలో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. తన కార్యదర్శి ప్రొఫెసర్ ఎర్నెస్ట్ ఉడ్‌తో కలసి ఇసుకలో నడుస్తున్న చాల్స్ వెబ్‌స్టర్ లెడ్‌బీటర్ ఆ పిల్లల గుంపులో ఒక బాలుడిని గమనించాడు. ఆయన దివ్యజ్ఙాన సమాజంలో ప్రముఖుడు. అతీంద్రీయ శక్తులు లేదా మానవాతీత శక్తులు కలిగి ఉండేవాడని ప్రతీతి. ఇంతకీ ఆ పిల్లవాడిని లెడ్‌బీటర్ అంత నిశితంగా గమనించడానికి కారణం – అతడు భావి జగద్గురువు –వరల్డ్ టీచర్– అని ప్రగాఢంగా నమ్మడమే. ఆ జగద్గురువు ఆగమనం కోసమే దివ్యజ్ఞాన సమాజం వేచిచూస్తోంది కూడా.అంతమంది బాలల్లో తను చూసిన ఆ అబ్బాయిని, నిరంతరం ఇతడినే వెన్నంటే ఉంటున్న ఇంకొక అబ్బాయిని గురించి తెలుసుకున్నాడు లెడ్‌బీటర్. ఆ ఇద్దరు నారాయణయ్య అనే రిటైర్డ్ తహసీల్దార్ కుమారులని తెలిసింది. ఇంతకీ నారాయణయ్య తమ సంస్థలోనే ఉద్యోగి. అడయార్‌లో ఉన్న వారి ఆశ్రమానికి సమీపంలోనే శిథిలావస్థలో ఉన్న ఒక భవనంలో ఉన్నదా కుటుంబం. లెడ్‌బీటర్ ఆ బాలుడిని చూడగానే ఇలాంటి దివ్యత్వం ఉన్న బాలుడిని ఎక్కడా చూడలేదు అన్నాడట. పక్కనే ఉన్నాడు, ప్రొఫెసర్ ఎర్నెస్ట్ ఉడ్. ఆయన ఎప్పుడూ చూడలేదు మరి. పైగా ఆ ఇద్దరు పిల్లలు ఆయన దగ్గరకి వచ్చి పాఠాలు చెప్పించుకుని వెళుతూ ఉండేవారు. మొదట లెడ్‌బీటర్ తన అభిప్రాయాన్ని దివ్యజ్ఞాన సమాజంలో మరొక ప్రముఖురాలు, ప్రముఖ భారత స్వాతంత్య్ర సమరయోధురాలు అనిబీసెంట్‌కు చెప్పి నమ్మకం కలిగించాడు. తరువాత నారాయణయ్యను ఒప్పించి, అనిబీసెంట్ ఆ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. అందులో లెడ్‌బీటర్ భావి జగద్గురువును చూసిన పిల్లవాడే జిడ్డు కృష్ణమూర్తి. రెండో పిల్లవాడు కృష్ణమూర్తి తమ్ముడు నిత్యానంద. కానీ లెడ్‌బీటర్ మానవాతీతశక్తులు నిజం కాదని కృష్ణమూర్తి జీవితం నిరూపించింది. నీవు జగద్గురువు అని లెడ్‌బీటర్, అనిబీసెంట్ తదితరులు ఆయనను పిలుచుకున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి ఆ రోజుల్లోనే కుప్పలుతెప్పలుగా విరాళాలు వచ్చి పడ్డాయి. తీరా జగద్గురువు పీఠం ఎక్కించడానికి కొంచెం ముందు తాను జగద్గురువును కాదు అని నిష్కర్షగా ప్రకటించారు కృష్ణమూర్తి. అసలు గురువు అనే, నేర్పేవాడు అనే వ్యవస్థకే తాను వ్యతిరేకమని తేల్చి చెప్పారు. ఆ పీఠం, ఆ కోట్లాది రూపాయల విరాళాలు అన్నీ త్యజించి, దివ్యజ్ఞాన సమాజం వీడి బయటకు వెళ్లిపోయారాయన.అసలు కృష్ణమూర్తి (మే 12, 1895–ఫిబ్రవరి 17,1986) జీవితమే ఒక అద్భుతం. ఆయనది గొప్ప రూపం. ఇంత అందగాడిని నేను చూడలేదు అన్నాడట, కృష్ణమూర్తిగారిని చూడగానే, ప్రపంచ ప్రఖ్యాత నాటక కర్త జార్జ్ బెర్నార్డ్ షా. ఒక హాలీవుడ్ సంస్థ అయితే ఆయన కథానాయకునిగా గౌతమ బుద్ధ ఇతివృత్తంతో సినిమా నిర్మించాలని కూడా తలపెట్టింది. అందుకు కృష్ణమూర్తి అంగీకరించలేదు. అలాగే ఆయన ఉపన్యాసాలకు విశ్వవిఖ్యాతి ఉంది. అసాధారణంగా అధ్యయనం చేశారు కాబట్టి ఉపన్యాసం కొంత మార్మికంగా, ఎంతో కవితాత్మకంగా సాగేదని (ఆ ఉపన్యాసాలు చదివినప్పటికి) తెలుస్తుంది. జేకే, కృష్ణజీ, కృష్ణాజీగా విశ్వవిఖ్యాతి చెందిన కృష్ణమూర్తి స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లి. నారాయణయ్య, సంజీవమ్మ దంపతులకు అష్టమగర్భంలో పుట్టారు. అందుకే కృష్ణుడి పేరు పెట్టారు. మొత్తం పదకొండుమంది సంతానం. ఆయన తమ్ముడు నిత్యానంద. యౌవనంలోనే వక్తగా అసాధారణ ప్రతిభ కనపరిచిన కృష్ణమూర్తి ప్రాథమిక విద్య దశలో సర్వ సాధారణమైన విద్యార్థే. పాఠాలు అప్పచెప్పడంలో, వినడంలో ఎప్పుడూ వెనకపడి ఉండేవాడు. దిక్కులు చూస్తూ ఉండేవాడు. తరచూ తండ్రి బదిలీ కావడం వల్ల, మలేరియా వల్ల కూడా కృష్ణమూర్తి చదువు బాగా వెనుకపడింది. దీనితో ఉపాధ్యాయులు చండామార్కులవారయ్యేవారు. ఇలాంటి విద్య వల్లనే ఆయన సంప్రదాయ విద్యను తీవ్రంగా ద్వేషించేవాడని చెబుతారు. పైగా పదేళ్లు వచ్చేసరికి తల్లి మరణించింది. బాల్యానికి అదొక వెలితి. తండ్రి పదవీ విరమణ చేసిన తరువాత అడయారులోనే ఉన్న దివ్యజ్ఞాన సమాజంలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. శని, ఆదివారాలలో కృష్ణమూర్తిని తన బంగ్లాకు తీసుకురావలసిందని లెడ్‌బీటర్ నిత్యానందకు చెప్పేవాడు. అక్కడ మొదట చదువు చెప్పేవారు. తరువాత లెడ్‌బీటర్ కృష్ణమూర్తిని సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకుని తల మీద చేయి వేసి, పూర్వజన్మ వృత్తాంతాలు చెప్పేవారట. అలా అన్వేషించగా అన్వేషించగా ఆయన మహావక్త అవుతాడని తెలిసిందట. తరువాత తాము వేచి చూస్తున్న ‘లార్డ్ మైత్రేయ’ కృష్ణమూర్తిలో ఉన్నాడని క్లెయిర్వాయింట్ ద్వారా తెలిసిందట. ఆ లార్ మైత్రేయే దివ్యజ్ఞాన సమాజం ఎదురు చూస్తున్న జగద్గురువు. ఆయన ఆధునిక ఆధ్యాత్మిక అస్థిత్వమని దివ్యజ్ఞాన సమాజం నమ్మింది. నిజానికి బౌద్ధం నుంచి, కొంత క్రైస్తవం నుంచి ఈ సిద్ధాంతాన్ని మేడమ్ బ్లావట్స్కీ స్వీకరించింది. ఆమె దివ్యజ్ఞాన సమాజ స్థాపకురాలు. ఆమె శిష్యుడు లెడ్‌బీటర్. మైత్రేయ బోధిసత్వుడు మానవాళిని దుఃఖాల నుంచి రక్షించడానికి శ్రీకృష్ణ పరమాత్మగా, బుద్ధునిగా,క్రీస్తుగా జన్మిస్తాడని దివ్యజ్ఞాన పథకుల నమ్మకం. ఆ మైత్రేయుడు ఈ యుగంలో తన సరైన వాహకంగా కృష్ణమూర్తిని ఎంచుకున్నాడన్నదే ఆ నమ్మకంలో కనిపిస్తుంది. అనిబీసెంట్ పర్యవేక్షణలో లెడ్‌బీటర్ సంరక్షణలో పద్నాలుగేళ్ల బాలుడు కృష్ణమూర్తి చదువుకున్నాడు. కానీ పెంపకం అంతా పాశ్చాత్య పద్ధతిలోనే. ఆ సమయంలోనే లెడ్‌బీటర్ మీద అనుమానంతో నారాయణయ్య తన పిల్లలను తనకు అప్పగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు నారాయణయ్యకు అనుకూలంగా తీర్పు చెప్పింది. కానీ అనిబీసెంట్ ప్రీవీకౌన్సిల్‌కు వెళ్లారు. అక్కడ మాత్రం పిల్లల ఇష్టం మేరకు అని తీర్పు వచ్చింది. ఆ ఇద్దరు పిల్లలు బిసెంట్ వద్ద ఉండడానికి మొగ్గుచూపారు. తరువాత బీసెంట్ ఆ ఇద్దరిని లండన్ తీసుకుపోయి అక్కడ ఎమిలీ ల్యూటెన్కు అప్పగించింది. ఆమె న్యూఢిల్లీని నిర్మించిన ల్యూటన్ సతీమణి. ఫ్రాన్స్ పంపి ఫ్రెంచ్ చదివించారు. పిల్లలు ఇద్దరు తెలుగు మరచిపోయారు. శిక్షణ పూర్తయిందని భావించిన దివ్యజ్ఞాన సమాజ నాయకత్వం 1923లో హాలెండ్లోని ఓమెన్ పట్టణంలో జగద్గురువుగా ప్రకటించారు కూడా. ఆయన అధినేతగా ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థకే ధనరాశులు విరాళాలుగా వచ్చి పడ్డాయి. 1925లో మొదటిసారి ఆయన అడయార్‌లో ప్రసంగించారు. ఒక ప్రవక్త మాట్లాడినట్టే ఉందని చెబుతారు. కానీ ఆ పదవి పట్ల ఏదో ఇబ్బందిగానే ఉండేవారు. అప్పుడు పండిట్ ఎ. మహదేవశాస్త్రి వద్ద వేదంలో కొన్ని భాగాలు నేర్చుకున్నారు. మరొక పరిణామం కూడా చోటు చేసుకుంది. దివ్యజ్ఞాన సమాజం స్వర్ణోత్సవాలు జరిగినప్పుడు డిసెంబర్ 21, 1925న భారత సమాజ పూజ జరిపారు. అందులో కృష్ణమూర్తి కూడా పాల్గొన్నారు. అలాంటి ఒక క్రతువులో ఆయన పాల్గొనడం అదే మొదటిసారి. ఇలాంటి పరిస్థితులలో తమ్ముడు నిత్యానంద 1925 నవంబర్‌లో కన్నుమూశాడు. అప్పటికి కాలిఫోర్నియాలోని ఓహై స్థిర నివాసం చేసుకున్నారాయన. అక్కడే నిత్య కన్నుమూశాడు. ఇదొక వెలితి.ఆగస్టు 3, 1929న కృష్ణమూర్తి ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ గురు పీఠాన్ని వదులుకుంటున్నట్టు ప్రకటించారు. తనను ఎక్కడ ఆ పదవిలో పట్టాభిషిక్తుడిని చేశారో, అదే ఓమెన్ పట్టణంలో స్టార్ వార్షిక సమావేశంలో 3,000 మంది ఎదుట తన నిర్ణయం ప్రకటించారాయన. విరాళాలను ఎవరివి వారికి తిప్పి పంపేశారు. కృష్ణమూర్తి ఫౌండేషన్‌ను స్థాపించారు. దానితోనే ఓహై కేంద్రంగా ప్రపంచం అంతా తిరిగి ఉపన్యాసాలు ఇచ్చారు. గురుపీఠాన్ని వదులుకుంటున్న చేసిన ప్రకటనను డిజల్యూషన్ స్పీచ్‌గా చెబుతారు. అందులో, ‘సత్యం అనే గమ్యానికి దారి లేదు. ఎవరికి వారు బాట వేసుకుని సత్యాన్ని చేరుకోవలసిందే. ఏ మతం, ఏ మత గ్రంథం, ఏ మతాచార్యుడు, ఏ విశ్వాసం ఏ సిద్ధాంతం సత్యాన్ని మనకు అందించలేదు. సత్యం అంగడిలో దొరికే వస్తువు కాదు. సత్యం ఒకరిస్తే పుచ్చుకునేది కాదు. ఒకరు సత్యాన్ని కనుగొంటే అది అతని సత్యం అవుతుంది. మనది కాదు. మన సత్యాన్ని అన్వేషించి కనుగొనవలసిందే’. అన్నారాయన. ఇంకా, సత్యం అనేది దారీతెన్నూ లేని దేశం. ఏ దారిన మీరు నడిచినా ఏ మతాన్ని ఏ ఉప మతాన్ని ఆశ్రయించినా మీరు సత్యాన్ని చేరలేరు. అదీ నా దృక్పథం’ అన్నారాయన. అందుకే ఆర్డర్ ఆఫ్‌ది స్టార్‌ను రద్దు చేయవలసిన అవసరం ఉందని కూడా చెప్పారాయన. జిడ్డు కృష్ణమూర్తి అంతశ్శోధన గురించి చెప్పారు. మనిషి దుఃఖానికి అలాంటి శోధనే దివ్యౌషధమని కూడా ఆయన చెప్పారు. అయితే తాను గురువును కాదన్నాడు. అలాంది ఆయన బోధనలు మాత్రం గురుబోధలు ఎందుకవుతాయి. కావనే ఆయన కూడా ఘంటాపథంగా చెప్పారు. కానీ ఆయన గురువును కాదని చెబుతున్నా లక్షలాది మంది ఆయన అనుయాయులుగా ఈ ప్రపంచంలో కనిపిస్తారు. అయితే వారితో మాట్లాడినప్పుడు కూడా కృష్ణమూర్తి తాను ఏమీ బోధించడం లేదనీ, వీరెవరూ శిష్యులు కారని, నాకు మిత్రులని చెప్పేవారు. తనను ఎవరూ అనుసరించరాదనే ఆయన చెప్పారు. ఆయనను విశ్వగురువును చేయాలని దివ్యజ్ఞాన సమాజం భావించింది. డా. గోపరాజు నారాయణరావు -
కుల్‌తిక్రి మహరాణి పంచాయతీ
Progress is impossible without change, and thosewho cannot change their minds cannot change anything. జార్జి బెర్నాడ్ షా ఏనాడో చెప్పిన ఈ సామాజిక సత్యాన్ని గత ఇరవై ఏళ్లుగా ఆచరణలో పెడుతున్నారు పశ్చిమ బెంగాల్‌లోని కుల్‌తిక్రి గ్రామస్తులు. వాళ్ల గ్రామం అభివృద్ధి చెందాలంటే పాలనలో మార్పు రావాలని గ్రహించారు. ఆ పాలనాధికారాన్ని స్త్రీలకిస్తే మరింత మంచి మార్పు వస్తుందని భావించారు. అన్నట్టుగానే 20 ఏళ్ల కిందట కుల్‌తిక్రి గ్రామ పంచాయతీ తాళాలను మహిళలకు అప్పగించారు. అయితే ఇది రిజర్వేషన్ ఇచ్చిన చాన్స్ కాదు. ప్రజలు ఓటుతో ఇచ్చిన తీర్పు. మహిళా సాధికారతలో ఇప్పుడు ఆ గ్రామం దేశానికే మోడల్! పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మెదినిపూర్ జిల్లాలో ఉంటుంది కుల్‌తిక్రి. ఒకప్పుడు మావోయిస్ట్‌ల పట్టు ఈ ప్రాంతం. ఇప్పుడు స్త్రీ సాధికారతకు చిహ్నం. ఇరవై ఏళ్ల కిందట అంటే మహిళలకు అధికారం రాక మునుపు.. దేశంలోని చాలా ఊళ్లలాగే ఇదీ మత్తులో జోగేది. నిరక్షరాస్యత నీడలో నిద్రపోయేది. ఆడవాళ్లను హింసించేది. ఏ అభివృద్ధీ లేక చుట్టచుట్టిన గొంగళిలా ఓ మూలన పడి ఉండేది. వీటన్నిటినీ భరించిన ఆ ఊరి సహనం (ముఖ్యంగా స్త్రీల ఓపిక) గరిష్ట స్థాయిని దాటింది. ఎదురు తిరగడం, తిరిగి ప్రశ్నించడం మొదలు పెట్టింది. ఈ ఊరు ఇలా ఎందుకుంది? ఇంకోలా ఎందుకు ఉండకూడదు? అని ఆలోచించింది. ఊరిని శాసించే పెద్దల్లో మార్పు రావాలి. అంటే అధికారం మారాలి! ఆ అధికారాన్ని స్త్రీలెందుకు తీసుకోకూడదు అనుకుంది. ఈ సంధి స్థితిలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలొచ్చాయి. ప్రతి వార్డు నుంచి సభ్యులుగా స్త్రీలూ నిలబడ్డారు. పురుష అభ్యర్థులు ఓట్లేసే మగాళ్లకు మందు రుచి చూపిస్తుంటే.. స్త్రీలు.. అధికారం తమకిస్తే కుల్‌తిక్రి భవిష్యత్ ఎలా ఉంటుందో వివరించడం మొదలుపెట్టారు. ఆ ఊళ్లోని మహిళలంతా మహిళా అభ్యర్థులకే మద్దతు పలికారు. ఆ మహిళలే ఓటు హక్కున్న యువతనూ ప్రభావితం చేయగలిగారు. పురుషులు మాత్రం పురుషులకే వత్తాసు పలికారు. ఎన్నికలయ్యాయి. ఫలితాలు వచ్చాయి. స్వల్ప మెజార్టీతో స్త్రీలే గెలిచారు. ఈ అవకాశం చాలు.. గెలిచిన మహిళలు ఊరి గతి మార్చాలని అనుకున్నారు. ఓడిన మగవాళ్ల అహం వారికి ఎన్నో అడ్డంకుల్ని పేర్చింది. అవమానాలనూ విసిరింది. అన్నిటినీ చిరునవ్వుతో ఎదుర్కొని పంచాయతీ మెట్లెక్కారు. ప్రతి సమస్య నుంచి ముందుగా తాము పాఠాలు నేర్చుకుంటూ గ్రామానికి పరిష్కారాలు చూపించసాగారు. మొదటితరం మహిళా ప్రతినిధులు కుల్తిక్రిలో చేపట్టిన మొదటి పని.. అక్కడి ఆడవాళ్లను అక్షరాస్యులను చేయడం. రెండోది.. ఊళ్లో వాళ్లకు పని కల్పించడం. ఈ రెండిటి వల్ల మద్యం దానంతట అదే వెనక్కి వెళ్లిపోయేలా చేయగలిగారు. చిత్రంగా ఆ అయిదేళ్లలో వాళ్లు ఒక్కసారి కూడా మద్యం గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడలేదట. రెండోసారి.. ఆ అయిదేళ్లలో చేసిన ఈ పనులకు మహిళలకు మంచి మద్దతు లభించింది. రెండోసారి పెద్దగా కష్టపడకుండానే అధికారం వచ్చింది. అయితే ఈ విడత కొత్త అభ్యర్థులు అవకాశం పొందారు. పంచాయతీ నిధులను సక్రమంగా ఖర్చుపెట్టారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన తెచ్చారు. స్త్రీల అక్షరాస్యతను మరింత పెంచారు. స్త్రీ సాధికారత మీదా దృష్టి పెట్టారు. స్థానికంగా ఉన్న వృత్తులు, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చారు. స్థానిక మార్కెట్‌ను వృద్ధి చేశారు. ఆ మార్కెట్లోకి మధ్యవర్తులు జొరబడకుండా కట్టుదిట్టం చేశారు. ఇవన్నీ ఆ ఊరికి ఊతమిస్తూనే అక్కడి ఆడవాళ్లనూ ఆర్థికంగా నిలబెడుతున్నాయి. అందుకే తర్వాత కూడా కుల్‌తిక్రీ గ్రామ పంచాయతీ మహిళల చేతుల్లోకే వచ్చింది. మూడోసారి.. ఈ సారి యువతరం అధికారంలోకి వచ్చింది. కనీస విద్యార్హత ఇంటర్ ఉన్న వాళ్లు పంచాయతీ సభ్యులయ్యారు. మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ కింద ఉన్న నిధులను చక్కగా వినియోగించారు. అంతకుముందు టెన్త్ వరకే ఉన్న బడిని డిగ్రీ వరకు పెంచుకోగలిగారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించారు. దిగుబడులను పెంచారు. కుటీర పరిశ్రమలను ప్రోత్సహించారు. ఇందులో స్త్రీలకు శిక్షణనూ ఇప్పించి వాళ్లను గ్రామీణ పారిశ్రామికవేత్తలుగా మార్చారు. ఈ యవ పంచాయతీ సభ్యులు అందరూ మధ్యాహ్నం వరకు ఊరి సమస్యలు చూసి మధ్యాహ్నం నుంచి కాలేజీకి వెళ్లేవారు. ఇప్పుడు.. అభివృద్ధికి పిన్కోడ్గా కుల్తిక్రీని ఇవ్వచ్చు. ఆ గ్రామం 70 శాతం మహిళా అక్షరాస్యత, 60 శాతం పురుషుల అక్షరాస్యత సాధించింది. తాజా పంచాయతీలో 20 ఏళ్ల నుంచి 36 ఏళ్లలోపు మహిళలే. వీళ్లలో కొందరు గ్రాడ్యుయేట్స్, ఇంకొందరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్. గ్రామంలో కూడు, గుడ్డ, గూడుతోపాటు అందరికీ భూమి కూడా ఉంది. చేతినిండా పనుంది. అయితే అంతా సవ్యంగా సాగుతుంటే సహించని వాళ్లు కుల్తిక్రీలోనూ ఉన్నారు. మొదట మహిళలకేంటీ అధికారం ఇచ్చేదీ అంటూ అడ్డు తగిలారు. కుదరకపోయే సరికి ఇప్పుడు ఆ గ్రామాన్ని మహిళా రిజర్వేషన్ కిందికి తేవాలని ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల తమకు అనుకూలంగా ఉన్న వర్గంలోని స్త్రీని నిలబెట్టి అధికారం వాళ్లు చలాయించాలనే కుటిలయత్నం చేస్తున్నారు. ఇది నేటి యువతరం ముందున్న పరీక్ష. ఎదుర్కోవడానికే సిద్ధమే అంటున్నారు. అధికారమూ ఉంది.. పోరాటమూ ఉంది ఇరవై ఏళ్ల నుంచి మా ఊరిని మహిళలే మహరాణులు. స్వచ్ఛందంగా దీన్ని ఆల్ విమెన్ పంచాయతీ చేశారు మా ముందుతరం వాళ్లు. ఆ వారసత్వాన్ని మేం నిలబెడ్తున్నాం. నీతి, నిజాయితీలో ఏమాత్రం తగ్గకుండా! కానీ ఈ మధ్యే ఈ యూనిటీని చెడగొట్టడానికి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమన్ రిజర్వేషన్ విలేజ్‌గా మారిస్తే కావల్సిన వాళ్లను సర్పంచ్‌గా పెట్టుకొని మిగిలిన సభ్యులుగా మగవాళ్లే ఉండి ఇష్టారాజ్యం చేయొచ్చని కుట్రలు పన్నుతున్నారు. కానీ మేం అలా కానివ్వం. పోరాడతాం. ఎక్కడిదాకా అయినా వెళ్తాం. సమస్యలను ఎలా చక్కదిద్దుకోవాలో మా పెద్దలు మాకు నేర్పారు. అవసరమైతే మా సమస్యను ముఖ్యమంత్రి దగ్గరకీ తీసుకెళ్తాం. తనూ మహిళే కాబట్టి అర్థం చేసుకుంటుందనే భరోసాతో ఉన్నాం. ఆ నమ్మకం వమ్మయితే ఎలా పోరాడాలో కూడా మాకు తెలుసు. అధికారమే కాదు పోరాటమూ మా వారసత్వంలో ఉంది. - అనామికా సాహు, సర్పంచ్, బెంగాలీ లిటరేచర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్, కుల్‌తిక్రీ అవరోధాలకు ఎదురీత గ్రామస్థాయి ప్రజాస్వామ్యానికి ఇండియాలోనే చక్కటి నిదర్శనం కుల్‌తిక్రీ. 20 ఏళ్ల ఈ ఉనికిని చెడగొట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. వామపక్ష ఉద్యమాలకు కోట అయిన బెంగాల్లో కూడా ఫ్యూడల్ కోరలున్నాయని చెప్పడానికి కుల్తిక్రీలో జరుగుతున్న కుట్రలే నిదర్శనం. - పార్థా ఖన్రా, స్థానిక సామాజిక కార్యకర్త