breaking news
ellampalli
-
గోదావరిలో మళ్లీ జలకళ!
సాక్షి, హైదరాబాద్/బాల్కొండ/కడెం/కాళేశ్వరం: రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో గోదావరి నది మళ్లీ జలకళ సంతరించుకుంది. ఎగువన శ్రీరాంసాగర్ నుంచి నది పొడవునా ప్రవాహాలు పెరిగాయి. సోమవారం రాత్రికి ఎగువన శ్రీరాంసాగర్‌లోకి 50 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 16 గేట్లు ఎత్తి సుమారు అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తిస్థాయిలో 90 టీఎంసీలకు చేరింది. ఇక కడెం ప్రాజెక్టుకు వరద 36,560 క్యూసెక్కులకు పెరిగింది. నాలుగు గేట్లను ఎత్తి 56,429 క్యూస్కెకుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 6.5 టీఎంసీలు నిల్వ ఉంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 35,300 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 46,221 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్షి్మ) బ్యారేజీ నుంచి 1,66,970 క్యూసెక్కులు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజీ నుంచి 1,32,480 క్యూసెక్కులు, దుమ్ముగూడెం వద్ద సీతమ్మసాగర్ బ్యారేజీ నుంచి 81,108 క్యూసెక్కులను వదులుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అన్నారం సరస్వతి బ్యారేజీకి సోమవారం రాత్రి గోదావరి ఎగువనుంచి వరద పోటెత్తడంతో 66 గేట్లకు 45 గేట్లు ఎత్తారు. లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఇంజనీరింగ్ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఆ నీరంతా కాళేశ్వరం వైపు తరలివస్తోంది. బేసిన్ పరిధిలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికి గోదావరిలో వరద మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కృష్ణాలో కానరాని ప్రవాహాలు పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావం కొనసాగుతుండటంతో కృష్ణా నదిలో ఎక్కడా పెద్దగా ప్రవాహాలు కానరావడం లేదు. సోమవారం ఆల్మట్టి డ్యామ్‌లోకి కేవలం 5,086 క్యూసెక్కుల ప్రవాహమే నమోదైంది. అక్కడ విద్యుదుత్పత్తి ద్వారా వదులుతున్న 14 వేల క్యూసెక్కులు దిగువన నారాయణపూర్‌లోకి చేరుతున్నాయి. రాష్ట్రంలోని జూరాలకు కేవలం 420 క్యూసెక్కులే వరద ఉంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రకు కూడా కేవలం 559 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి వరద రావడం లేదు. స్థానిక వర్షాలతో నాగార్జునసాగర్‌కు 11,424 క్యూసెక్కులు, మూసీ ప్రవాహంతో పులిచింతలకు 5,546 క్యూసెక్కులు చేరుతున్నాయి. -
ఎల్లంపల్లికి పెరుగుతున్న వరద ఉధృతి
143.71 మీటర్లకు చేరిన నీరు మంచిర్యాల రూరల్ : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఆదివారం మంచిర్యాల మండలంలోని గుడిపేట ఎల్లంపల్లి(శ్రీపాదసాగర్) ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో నిండుగా దర్శనమిచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు తీయడంతో పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టుకు చేరింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం 148 మీటర్ల క్రస్ట్ లెవెల్ కాగా, శనివారం సాయంత్రం వరకు 143.61 మీటర్ల వరకు నీళ్లు ఉన్నాయి. తాజాగా ఈ నీటిమట్టం 143.71 మీటర్లకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 10.19 టీఎంసీల నీటీ నిల్వ ఉంది. కాగా, ప్రస్తుతానికి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 400ల కూసెక్కుల కాగా, 400 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉంది. ప్రభుత్వం ఈ ఏడాది ప్రాజెక్టులో 147 మీటర్ల వరకు నీటి నిల్వ చేయాలని ఉత్తర్వులు జారీ చేయగా అధికారులు ఆ దిశగా ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని ఆర్డీవో అయిషా మస్రత్ ఖానమ్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని ముంపు గ్రామాలకు ఎలాంటి ముంపు లేదని, ప్రాజెక్టుకు నీళ్లు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని తెలిపారు. ముంపు గ్రామాలైన చందనాపూర్, రాపల్లి, కొడపల్లి, కర్ణమామిడి, పడ్తనపల్లి గ్రామాల నిర్వాసితులను అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో వారిని వెంటనే గ్రామాలు ఖాళీ చేయాలని కూడా సూచించామని చెప్పారు. అయితే ముందస్తుగా వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పునరావాస కేంద్రాల్లో తాత్కాలిక పునరావాస ఏర్పాట్లు కూడా సిద్ధం చేసి ఉంచామని వివరించారు.