breaking news
Disabled cricket
-
చారిత్రక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
భారత దివ్యాంగుల క్రికెట్ జట్టు (మిక్స్డ్) చారిత్రక లార్డ్స్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును 2 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ చివరి ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. అంగస్ బ్రౌన్ (47 బంతుల్లో 77; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో చెలరేగాడు. భారత బౌలర్లలో వివేక్ కుమార్, కెప్టెన్ రవీంద్ర సంటే తలో వికెట్లు తీశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. ఓపెనర్ రాజేశ్ ఇరప్పా కున్నూర్ (29), సాయి ఆకాశ్ (34 బంతుల్లో 44) సత్తా చాటడంతో 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో భారత్ ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. దీనికి ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. క్రికెట్ మక్కాగా పిలువబడే లార్డ్స్ మైదానంలో ఇది తొలి దివ్యాంగుల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్. ఈ గెలుపును భారత దివ్యాంగుల జట్టు 1983 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టుకు అంకితమిచ్చింది.ఈ మ్యాచ్ జూన్ 25న జరిగింది. 42 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు లార్డ్స్ మైదానంలో కపిల్ డెవిల్స్ వెస్టిండీస్‌ను చిత్తు చేసి తొలిసారి జగజ్జేతగా అవతరించింది. జూన్ 25ను వరల్డ్ మిక్స్డ్ డిజేబులిటీ డేగా (World Mixed Disability Day) జరుపుకున్నారు. -
పట్టాలపై విషాదం.. రన్నింగ్ ట్రైన్లో ప్రాణాలు కోల్పోయిన దివ్యాంగ క్రికెటర్
రైలు పట్టాలపై ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. రన్నింగ్ ట్రైన్లో ఓ దివ్యాంగ క్రికెటర్ ఛాతీ నొప్పితో మరణించాడు. అత్యవసర సాయం కోసం రైల్వే వైద్య సిబ్బంది కోసం ఎంత ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని చనిపోయిన క్రికెటర్ సహచరులు వాపోతున్నారు. ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. పంజాబ్‌కు చెందిన 38 ఏళ్ల దివ్యాంగ క్రికెటర్ విక్రమ్ సింగ్.. ఓ వీల్‌చైర్ టోర్నమెంట్ కోసం సహచరులతో కలిసి బుధవారం రాత్రి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి గ్వాలియర్‌కు బయల్దేరాడు. ప్రయాణంలో విక్రమ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. విక్రమ్ తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. రైల్వే వైద్య సిబ్బందికి అనేక అత్యవసర కాల్స్ చేసినప్పటికీ ఎలాంటి సాయం అందలేదు. రైలు ఢిల్లీ నుంచి మధుర స్టేషన్‌కు చేరుకునేలోపే విక్రమ్ మరణించాడు.కళ్ల ముందే సహచరుడు ప్రాణాలు కోల్పోవడంతో తోటి క్రికటర్ల బాధ వర్ణణాతీతంగా ఉంది. విక్రమ్ నొప్పితో విలవిలలాడిపోయాడని ఓ క్రికెటర్ చెప్పాడు. అత్యవసర వైద్య సాయం కోసం ఎంత సేపు ప్రయత్నించినా రైల్వే సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోయాడు. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ మిత్రుడు మరణించాడని మరో క్రికెటర్ వాపోయాడు. మధుర రైల్వే స్టేషన్లో విక్రమ్ మృతదేహాన్ని రైల్వే పోలీసులు హ్యాండోవర్ చేసుకున్నారు. అక్కడే పోస్ట్‌మార్టమ్ పూర్తి చేశారు. రైల్వే ఉన్నతాధికారులు తమ వైద్య సిబ్బంది ఆలసత్వంపై అంతర్గత దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ఘటనపై దివ్యాంగ హక్కుల సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఓ దివ్యాంగ క్రీడాకారుడు ఛాతి నొప్పితో విలవిలలాడుతుంటే వైద్య సాయం అందించడానికి ఓ రైల్వే అధికారి కూడా లేకపోవడం సిగ్గు చేటని క్రీడా సమాజం దుమ్మెత్తిపోస్తుంది. -
నేటి నుంచి దివ్యాంగుల క్రికెట్ శిక్షణ శిబిరం
హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దివ్యాంగుల క్రికెట్ ప్రపంచకప్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత జట్టు ఎంపిక కోసం నేటి నుంచి దివ్యాంగుల క్రికెట్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. జింఖానా మైదానంలో మంగళవారం నుంచి ఆదివారం వరకు ఈ శిబిరం జరుగుతుంది. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం శిబిరం కరపత్రాన్ని దివ్యాంగుల క్రికెట్ సంఘం డైరెక్టర్లు హుస్సేన్, నదీమ్, సంయుక్త కార్యదర్శి రవికుమార్ ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా 80 మంది క్రికెటర్లు ఈ శిబిరంలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. దివ్యాంగులకు చేయూతనిస్తే అద్భు తాలు సృష్టిస్తారని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి అన్నారు. ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసేందుకు ఈ క్యాం ప్ను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. క్యాంప్ అనంతరం ఆటగాళ్లను ఐదు జట్లుగా విభజించి ఈనెల 30వ తేదీ నుంచి నవంబర్ 2 వరకు ఎల్బీ స్టేడియంలో టి20 మ్యాచ్‌లను నిర్వహిస్తామన్నారు. మెరుగైన ప్రదర్శన కనబరిచిన వారికి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తుందని తెలిపారు. -
సౌత్‌జోన్ దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ఐదుగురి ఎంపిక
సౌత్‌జోన్ దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ఐదుగురు ఎంపికయినట్లు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి మధుసూదన్‌నాయక్ తెలిపారు. వీరిలో అనంతపురం నుంచి సయ్యద్ నూరుల్ హుదా, రోశిరెడ్డి ఎంపికయ్యారన్నారు. వీరితోపాటు క్రాంతి (వైఎస్సార్ కడప), విజయ్(ప్రకాశం), సుబ్బారావు (ప్రకాశం)లు ఎంపికయ్యారన్నారు. జట్టుకు జిల్లాకు చెందిన సయ్యద్ నూరుల్ హుదా కెప్టెన్‌గా వ్యవహరిస్తారన్నారు. ఈ నెల 12 నుంచి 14 వరకు అనంతపురంలో జరిగిన సౌత్ ఇండియా క్రికెట్ టోర్నీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సౌత్‌జోన్ జట్టుకు ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 1 వరకు ముంబయ్‌లో జరిగే జాతీయ స్థాయి దివ్యాంగుల క్రికెట్ పోటీల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్రం నుంచి ఐదుగురు ఎంపిక పట్ల రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మాంచో ఫెర్రర్, మధుసుధన్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు.