breaking news
Development of backward regions
-
నిధులు అటేనా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులకు (బీఆర్జీఎఫ్) ఇప్పట్లో మోక్షం లేనట్లే. వచ్చే మార్చి 31 నాటికి ఖర్చు చేయాల్సిన ఈ నిధులు ఇప్పటికీ విడుదల కాలే దు. వాస్తవంగా ఏటా మార్చి, ఏప్రిల్ నెలలలో ప్రతి పాదనలు పంపితే, జూన్‌లో ఈ నిధులు వస్తాయి. ప్రతిపాదనలకు ముందుగా జిల్లా పరిషత్ సర్వస భ్య సమావేశం, తరువాత జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలి. 2014-15 బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలకు స్థానిక, సార్వత్రిక ఎన్నికలు ప్రతిబంధకంగా మారాయి. ఎన్నికల నోటిఫికేషన్, ప్రక్రియ తదితర కారణాలతో ఈ వ్యవహారం డోలాయమానంలో పడింది. కొన్ని జిల్లాల్లో అప్పుడున్న శాసనసభ్యులు, మంత్రులు అధికారులతో మాట్లాడి హైపవర్ కమిటీకి ప్రతిపాదనలు పంపగా, జిల్లాలో మాత్రం బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలకు నోచుకోలేదు. జడ్పీకి కొత్త పాలకవర్గం వచ్చాక సెప్టెంబర్ 22న అత్యవసర సమావేశంలో రూ.25.34 కోట్ల బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపినా, మూడు నెలలైనా నిధుల ఊసు లేదు. జూన్‌లో హైపవర్ కమిటీకి చేరి ఉంటే వెనుకబడిన ఫ్రాంతాల అభివృద్ధి నిధుల కింద చేపట్టే పనులకు ఉన్నతాధికారులు మే నెలలోనే ప్రత్యేకాధికారుల నుంచి ప్రతిపాదనలు కోరారు. నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ మున్సిపాలిటీలు, 36 మండలాలు అప్పట్లోనే రూ.25.34 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. జడ్పీ సర్వసభ్య సమావేశం, డీపీసీ ఆమోదం కోసం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తర్వాత వరుస గా ఎన్నికలు జరిగాయి.కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు చేసిన ప్రతిపాదనలలో తేడా వచ్చింది. కొంతకాలం వేచి చూసిన అధికారులు బీఆర్జీఎఫ్ మార్గదర్శకాల ప్రకారం పనుల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరం కోసం కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలకు రూ.4 కోట్లు, 36 మండలాలకు రూ.21.34 కోట్ల పనులను రూపొందించారు. గ్రామపంచాయతీలు 50 శాతం, మండల పరిషత్‌లు 30 శాతం, జిల్లా పరిషత్ నుంచి 20 శాతం పనులను ప్రతిపాదించారు. కానీ, వీటిని సెప్టెంబర్ మొదటి వారంలోగా ఢిల్లీ హైపవర్ కమిటీకి చేరవేయడంలో జాప్యం జరిగింది. ఫలితంగా పొరుగు జిల్లా ఆదిలాబాద్‌కు రూ.25 కోట్లు విడుదల చేసిన కేంద్రం, జిల్లా ప్రతిపాదనలను మాత్రం ఇంకా కనికరించలేదు. -
బీఆర్జీఎఫ్ పనుల్లో పర్సంటేజీల పర్వం
ఖమ్మం కలెక్టరేట్ : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల(బీఆర్జీఎఫ్)తో చేపట్టే పనుల్లో పర్సంటేజీల పర్వం కొనసాగుతోంది. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో అవసరమైనవి కాకుండా తమకు పర్సంటేజీలు ఎక్కువగా వచ్చే పనులనే ప్రతిపాదిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2014-15కు గాను విడుదల చేసిన ఈ నిధులలో 30 శాతం మేర ఇలాంటి పనులనే ప్రతిపాదించారని విమర్శలు వస్తున్నాయి. స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఈ పనులపై ప్రతిపాదనలు చేసే అవకాశం లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో సర్పంచ్‌లు, మండలస్థాయి అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించారని సమాచారం. గ్రామసభల్లో తీర్మానాలు లేకుండానే అనేక పనులను ప్రతిపాదించినట్లు తెలిసింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ ఏడాది జిల్లాకు రూ.33.42 కోట్లు కేటాయించింది. ఇందులో మున్సిపాలిటీలకు రూ.7,02,74 వేలు, స్థానిక సంస్థలకు రూ.26,39,26 వేలుగా నిర్ణయించారు. స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీలకు 50 శాతం, మండల పరిషత్‌లకు 30 శాతం, జిల్లా పరిషత్‌కు 20 శాతం కేటాయించారు. ఈ నిధులను తాగునీరు, రోడ్లు, ఆరోగ్య కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, శానిటేషన్, పాఠశాల విద్య, వైద్య, ఆరోగ్య, విద్యుత్ తదితర అవసరాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటిలో జిల్లా వ్యాప్తంగా 758 పంచాయతీలకు రూ.13 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.7 కోట్లు, జిల్లా పరిషత్‌కు రూ.5 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి, డీపీసీ (జిల్లా ప్రణాళికా సంఘం) ఆమోదానికి పంపించారు. గ్రామసభలు లేకుండానే తీర్మానాలు.. గ్రామాల్లో ఆయా అవసరాలను బట్టి ప్రజలు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో చేపట్టాల్సిన పనులపై గ్రామ సభలో తీర్మానం చేసి, ఆ ప్రతిపాదనలను ఎంపీడీవోలకు పంపాలనే నిబంధన ఉంది. వారు దాన్ని జిల్లా పరిషత్‌లకు అందజేస్తారు. అయితే కొన్నిచోట్ల గ్రామసభల తీర్మానం లేకుండానే సర్పంచ్ల సంతకాలతో పనులకు ప్రతిపాదనలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామసభల్లో తీర్మానం లేకపోవడంతో ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కావడం లేదని, నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. పర్సంటేజీలు ఉంటేనే పని... మరికొన్ని గ్రామాల్లో పనులకు సర్పంచ్‌లు ప్రతిపాదించినప్పటికీ మండల, జిల్లా పరిషత్ వాటాలో మండల పరిషత్ అధికారులే తమ ఇష్టానుసారంగా వ్యవహరించారని పలువురు ప్రజా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఒక్కో పనికి 10 నుంచి 20 శాతం వరకు ఒప్పందాలు కుదుర్చుకుని ప్రతిపాదనలు చేశారని విమర్శిస్తున్నారు. కిందిస్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు అత్యధిక పర్సంటేజీలు వచ్చే పనులకే ప్రతిపాదనలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజా ప్రజాప్రతినిధుల్లో నిరుత్సాహం.. నూతనంగా ఎంపికైన ప్రజా ప్రతినిధుల్లో నిరుత్సాహం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడి నెలన్నర దాటినా జడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేయలేదు. వారికి అధికారిక హోదా లేకపోవడంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోతోంది. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనప్పటికీ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసే వీలు లేదు. తాజాగా బీఆర్జీఎఫ్ నిధుల కేటాయింపులో కూడా జడ్పీటీసీ, ఎంపీటీసీల జోక్యం లేకపోవడంతో వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. డీపీసీ జరిగేనా... డీపీసీ (జిల్లా ప్రణాళిక సంఘం) సమావేశంపై నీలినీడలు అలముకున్నాయి. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో డీపీసీ సమావేశానికి జడ్పీటీసీ, ఎంపీటీసీలు హాజరయ్యే అవకాశం లేదు. అయితే జిల్లాలోని శాసనసభ్యులు, ఎంపీలతో డీపీసీ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ప్రతిపాదనలు గ్రామాల్లో నోటీసు బోర్డులో ఉంచిన తర్వాతనే ప్రభుత్వ ఆమోదానికి పంపాలనే డిమాండ్ వినిపిస్తోంది.