Defection Act
-
టీఎంసీలో తిరుగుబాటు.. దీదీ నెత్తిన పాలు పోస్తున్న రాజ్యాంగ సవరణ!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ తిరుగుబాటు ప్రకంపనలు రేపుతోంది. పార్టీకి చెందిన సుమారు 20 మంది లోక్‌సభ సభ్యులు మమతా బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక వర్గంగా ఏర్పడేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సంఖ్యాబలం చూస్తే ఇది దీదీకి భారీ ఎదురుదెబ్బలా కనిపిస్తున్నా.. చట్టపరంగా మాత్రం రెబల్స్‌కే షాక్ తగిలే పరిస్థితి ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.లోక్‌సభలో టీఎంసీకి 28 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో 20 మంది తమవైపే ఉన్నారని తిరుగుబాటు వర్గం చెబుతోంది. అయితే రెండు మూడొంతుల మంది ఎంపీలు ఉన్నారనే కారణంతోనే అనర్హత నుంచి రక్షణ లభించదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి రాజకీయ చీలికలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన 91వ రాజ్యాంగ సవరణ ఇప్పుడు మమతా బెనర్జీ వర్గానికే అండగా నిలుస్తోందని విశ్లేషిస్తున్నారు.ఒకప్పుడు రాజకీయ పార్టీల్లో చీలికలకు చట్టంలో కొంత వెసులుబాటు ఉండేది. శాసనసభ లేదంటే పార్లమెంట్లో మూడింట ఒక వంతు మంది సభ్యులు విడిపోయినా అనర్హత నుంచి రక్షణ పొందే అవకాశం ఉండేది. అయితే 2003లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణతో ఆ నిబంధనను పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి "స్ప్లిట్"(చీలిక) అనే భావనకు చట్టపరమైన గుర్తింపు లేదు. ఇప్పుడు రక్షణ పొందాలంటే "మెర్జర్"(విలీనం) మాత్రమే మార్గంగా మిగిలింది.అక్కడే టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు చిక్కులు మొదలవుతున్నాయి. ఎందుకంటే కేవలం ఎంపీలు విడిపోయి కొత్త బ్లాక్‌గా ఏర్పడితే అది విలీనంగా పరిగణించబడదు. పార్టీ సంస్థ మొత్తం మరో పార్టీలో విలీనం కావడం.. దానికి కనీసం రెండు మూడొంతుల మంది ప్రజాప్రతినిధులు అంగీకరించడం వంటి షరతులు నెరవేరినప్పుడే అనర్హత నుంచి రక్షణ లభిస్తుంది. లేదంటే పార్టీని స్వచ్ఛందంగా వీడినట్టుగా పరిగణించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.ఇదే కారణంగా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మరో ప్రశ్న వినిపిస్తోంది. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అనుసరించిన వ్యూహాన్ని టీఎంసీ తిరుగుబాటు వర్గం అమలు చేయగలదా? శివసేన సంక్షోభంలో షిండే వర్గం కేవలం ఎమ్మెల్యేలను కూడగట్టుకోవడమే కాదు.. తామే అసలైన శివసేన అని ప్రకటించి పార్టీ సంస్థపై హక్కు కోసం పోరాటం చేసింది. చివరకు ఎన్నికల సంఘం ముందు తమ వాదనను నిలబెట్టి పార్టీ పేరు, గుర్తుపై ఆధిపత్యం సాధించింది.టీఎంసీ తిరుగుబాటు వర్గం కూడా అదే దారిలో నడవాలంటే కేవలం ఎంపీల సంఖ్య సరిపోదు. పార్టీ సంస్థలో, రాష్ట్ర స్థాయి నిర్మాణాల్లో, జిల్లా కమిటీల్లో, ఇతర విభాగాల్లో తమకే మెజారిటీ మద్దతు ఉందని నిరూపించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే "అసలైన టీఎంసీ మాదే" అనే వాదనకు బలం చేకూరే అవకాశం ఉంటుంది. లేదంటే ప్రత్యేక బ్లాక్‌గా ఏర్పడటం మాత్రమే జరిగితే అనర్హత ముప్పు తప్పకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అంటే ప్రస్తుతం తిరుగుబాటు ఎంపీల ముందు రెండు మార్గాలే కనిపిస్తున్నాయి. ఒకటి.. చట్టబద్ధమైన విలీనం దిశగా అడుగులు వేయడం. రెండోది.. తామే అసలైన టీఎంసీ అని ప్రకటించి పార్టీపై హక్కు కోసం పోరాటం చేయడం. ఈ రెండింటిలో ఏదీ చేయకుండా కేవలం ప్రత్యేక వర్గంగా కొనసాగితే యాంటీ డిఫెక్షన్ చట్టం వారి మెడకు చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అందుకే రాజకీయ విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేస్తున్నారు. బయటికి చూస్తే ఇది మమతా బెనర్జీకి ఎదురుదెబ్బలా కనిపించినా.. చట్టపరంగా చూస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు ఆమెకే అండగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయ చీలికలను ప్రోత్సహించకుండా తీసుకొచ్చిన 91వ రాజ్యాంగ సవరణే ఇప్పుడు టీఎంసీ తిరుగుబాటుదారులకు అతిపెద్ద అడ్డంకిగా మారిందని చెబుతున్నారు.మొత్తానికి టీఎంసీలో జరుగుతున్నది కేవలం ఎంపీల తిరుగుబాటు మాత్రమే కాదు. ఇది పార్టీపై హక్కు కోసం సాగబోయే పెద్ద రాజకీయ, న్యాయపోరాటానికి నాంది కావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 20 మంది ఎంపీలు ఉన్నంత మాత్రాన చట్టం కళ్లలో రక్షణ లభించదు. "అసలైన టీఎంసీ ఎవరిది?" అనే ప్రశ్నకు సమాధానం దొరికే వరకు ఈ పోరాటం కొనసాగనుంది. -
ఆప్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఆనంద్‌పై అనర్హత వేటు
సాక్షి, ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఆనంద్‌పై అనర్హత వేటు పడింది. బీఎస్పీ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన రాజ్‌కుమార్.. విచారణకు హాజరుకావాలని స్పీకర్ ఆదేశించారు. విచారణకు హాజరుకాకపోవడంతో రాజ్‌కుమార్ అసెంబ్లీ సభ్యత్వంపై అనర్హత వేటు వేసినట్టు స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ శుక్రవారం తెలిపారు. జూన్ 11న విచారణకు హాజరుకావాలని నోటీస్ ఇచ్చినా కానీ ఆయన హాజరుకాలేదని గోయెల్ పేర్కొన్నారు. మరోసారి జూన్ 14న హాజరుకావాలని ఆదేశించినా స్పందించలేదన్నారు. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు స్పీకర్ తెలిపారు.'ఆప్' సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలను రాజ్‌కుమార్ ఆనంద్ నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దళితులకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. గత ఏప్రిల్‌లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీని కూడా వీడారు. ఆప్‌లోని దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, కౌన్సిలర్లకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. గత మేలో బీఎస్పీలో చేరారు. బీఎస్పీ తరఫున ఎంపీ ఎన్నికల్లో రాజ్‌కుమార్ పోటీ చేశారు. -
టీఆర్ఎస్ తీరు అప్రజాస్వామికం
కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్: ‘రాష్ట్ర శాసనసభలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. విపక్ష సభ్యులను గౌరవించకుండా, వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్లాం..’ అని టీపీసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై చర్చించేలా సమయం ఇవ్వాలని మరో మారు స్పీకర్‌ను కోరదలిచాం అని తెలిపారు. అలాగే, ఒక పార్టీ తరపున గెలిచిన వారిపై ఒత్తిళ్లు పెట్టి తమ పార్టీలో చేర్చుకునే దుష్ట సంప్రదాయాన్ని టీఆర్ఎస్ మొదలు పెట్టిందని విమర్శించారు. ఇలాంటి వారిపై చర్య తీసుకోవాలని స్పీకర్‌ను కోరామన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం మేరకు వారి సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆలస్యమైందని, మరోమారు స్పీకర్‌ను కలిసి వివరిస్తామని చెప్పారు. పార్టీ మారిన సభ్యులు ఏకంగా అధికార పక్షానికి చెందిన బ్లాక్‌లో కూర్చుంటున్నారని, ఇదే పెద్ద ఆధారమని అన్నారు. చర్యలు తీసుకోకుంటే, ప్రత్యామ్నాయ మార్గాలు వెదుక్కుంటామని, కానీ, పరిస్థితి అంతదాకా వస్తుందని అనుకోవడం లేదన్నారు. తమ పార్టీకి చెందిన విఠల్‌రెడ్డి, కనకయ్య, రెడ్యానాయక్ పార్టీ మారారని, రెడ్యానాయక్ మాత్రం అధికార పక్షం బ్లాక్‌లో కూర్చుని మాట్లాడారని చెప్పారు. వీరిపై చర్య తీసుకోవాల్సిందేనని భట్టి డిమాండ్ చేశారు.


