breaking news
Cybill reports
-
రుణ అర్హతలను పెంచుకోండిలా..
మీరు తీసుకున్న రుణమే మీ అర్హతలను నిర్దేశిస్తుంది. భవిష్యత్తులో మీకు అవసరం ఏర్పడితే రుణదాతలు క్యూ కట్టి ‘బాబ్బాబు మేము ఇస్తాం’ అనే విధంగా చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. నేటి రోజుల్లో రుణం లభించడం ఎంత సులభమో.. అంత కష్టం కూడా. ఎందుకంటే ఓ వ్యక్తి రుణ చరిత్ర అంతా క్రెడిట్ బ్యూరోల రికార్డుల్లో వివరంగా నమోదవుతుంటుంది. రుణాల మంజూరుకు ముందు బ్యాంకు అయినా ఎన్బీఎఫ్సీ అయినా దరఖాస్తుదారుని క్రెడిట్ స్కోరును కచ్చితంగా పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోరు మీ రుణ అర్హతను నిర్ణయించడమే కాదు.. ఎంత వడ్డీ రేటు వసూలు చేయాలనే విషయంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. క్రెడిట్ స్కోర్ ఎంత బాగుంటే.. మీకు అంత ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు, కోరుకున్నంత రుణం లభిస్తుందన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే మీ రుణ దరఖాస్తు స్వీకరణ లేదా తిరస్కరణ అనేది మీ క్రెడిట్ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది. అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు? మీ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలన్నది ఓసారి చూద్దాం. ఎలా లెక్కిస్తారంటే... రుణ గ్రహీతల విశ్వసనీయతను.. చెల్లింపుల సామర్థ్యాన్ని కొలిచే ప్రమాణాల్లో క్రెడిట్ స్కోర్ ఒకటి. దరఖాస్తుదారుల రుణ అర్హతను అంచనా వేయడానికి, రుణ మొత్తాన్ని నిర్ణయించడానికి బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తుంటాయి. దీనికితోడు, ఇతర సమాచారం ఆధారంగా రుణాలకు అర్హులా, కాదా? అన్నది నిర్ణయిస్తారు. వడ్డీ రేటుకూ ఇదే ప్రామాణికం అవుతుంది. రుణాల మంజూరు, తిరిగి చెల్లింపుల సమాచారాన్ని రుణ గ్రహీతల పాన్ నంబర్ ఆధారంగా.. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) క్రమం తప్పకుండా నిర్ణీత కాలానికోసారి క్రెడిట్ బ్యూరో సంస్థలకు (సిబిల్ తదితర) అందిస్తుంటాయి. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ స్కోరును నిర్ణయిస్తుంటాయి బ్యూరోలు. సాధారణంగా గత 36 నెలల రుణ చరిత్ర ఆధారంగా క్రెడిట్ స్కోర్ ఉంటుంది. చెల్లింపుల తీరు, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మిశ్రమం ఎలా ఉంది, రుణాల కోసం విచారణలు, రుణాల వినియోగం.. ఈ నాలుగు అంశాలు మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంటాయి. అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆల్గోరిథమ్‌ల సాయంతో.. రుణ చరిత్రతోపాటు వినియోగదారుల దీర్ఘకాలిక ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్ (చెల్లించాల్సిన బకాయిలు), క్రెడిట్ కార్డ్‌ల లావాదేవీల చరిత్ర, కొత్త ఖాతాల ప్రారంభం లేదా తొలగింపులు, తిరిగి చెల్లింపుల నిష్పత్తి వంటివి కూడా క్రెడిట్ బ్యూరోలకు ప్రామాణికంగా మారాయి. సాధారణంగా.. 300 నుంచి 900 వరకు క్రెడిట్ స్కోర్ ఉంటుంది. రుణదాతలకు వ్యక్తిగత రుణాలు లభించాలంటే.. కనీస సిబిల్ స్కోర్ 720 నుంచి 750 మధ్య అయినా ఉండాలి. ఇంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే రుణాన్ని అధిక మొత్తంలో పొందే అర్హత ఉంటుంది. స్కోర్ తక్కువగా ఉంటే రుణం కూడా తక్కువే వస్తుంది. స్కోర్‌ను మెరుగుపరుచుకోవాలంటే.. రుణ వాయిదాల చెల్లింపుల్లో డిఫాల్ట్ కాకుండా చూసుకోవాలి. గృహ, వాహన రుణాలు సెక్యూర్డ్ రుణాల కిందకు వస్తాయి. వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్ రుణాలు అన్‌సెక్యూర్డ్‌గా ఉంటాయి. సెక్యూర్డ్ రుణాల్లో రుణదాత విఫలమైనా, రుణమిచ్చిన సంస్థలకు రిస్క్ పెద్దగా ఉండదు. ఎందుకంటే హామీగా ఆస్తులు ఉంటాయి. వాటిని విక్రయించి సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, అన్సెక్యూర్డ్ రుణాలను ఎగ్గొడితే.. వసూలు చేసుకోవడం రుణమిచ్చిన సంస్థలకు తలనొప్పిగా పరిణమిస్తుంది. అందుకే రుణదాతలు అన్సెక్యూర్డ్స్ రుణాలు, వాటిని తిరిగి ఏ విధంగా చెల్లిస్తున్నారన్న చరిత్ర గురించి లోతైన విశ్లేషణ చేస్తుంటారు. మీ సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించేవి కూడా ఈ అన్సెక్యూర్డ్ రుణాలే. ముఖ్యంగా..జాయింట్ బ్యాంక్ అకౌంట్‌ను కలిగి ఉన్న వారికి హామీ ఇవ్వటంలో జాగ్రత్త వహించాలి. ఒకవేళ ఆయా ఖాతా చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులెదురైనా ఆ బాధ్యత జాయింట్ ఖాతాదారులైన మీ మీద కూడా పడుతుంది. అంతిమంగా దీని ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద కూడా ఉంటుంది. వ్యక్తిగత రుణం, క్రెడిట్‌కార్డు వినియోగం, వాహన రుణం, గృహ రుణం ఇలా రుణ పోర్ట్‌ఫోలియో వైవిధ్యంగా ఉండడం కూడా ప్రభావం చూపిస్తుంది. క్రెడిట్‌కార్డు విషయంలో సకాలంలో చెల్లింపులతోనూ స్కోర్ పెంచుకోవచ్చు. స్కోర్‌ను చెక్ చేసుకోవచ్చు.. క్రెడిట్ బ్యూరో సంస్థలు ఏటా ఒక్కసారి ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ పొందే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఇక వివిధ రకాల ఆర్థిక సేవల సంస్థలు సైతం తమ పోర్టళ్ల నుంచి, యాప్స్ నుంచి క్రెడిట్ స్కోరును ఉచితంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంటాయి. తద్వారా రుణాల ఆఫర్లను అందించొచ్చన్న ప్రయోజనం అందులో దాగుంటుంది. మీకు రుణ అవసరం ఉన్నా, లేకపోయినా క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా తెలుసుకునే సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. పాన్ నంబర్ సాయంతో ఈ వివరాలు తెలుసుకోవచ్చు. మొబైల్ నంబరుకు వచ్చే వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా మీ గుర్తింపును ధృవీకరించిన అనంతరం క్షణాల్లో ఉచితంగా మీ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్‌ను అందుకుంటారు. -
రిటైల్ రుణాల్లో బోలెడన్ని అవకాశాలు
ముంబై: దాదాపు దశాబ్దకాలంగా బ్యాంకులు రిటైల్ రుణాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నప్పటికీ.. ఈ విభాగంలో పూర్తి స్థాయిలో విస్తరించలేకపోతున్నాయి. రుణాలు పొందేం దుకు అర్హత ఉన్న వారిలో కేవలం మూడో వంతు మందినే చేరగలిగాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్ యూనియన్ సిబిల్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం రుణార్హత ఉన్న వినియోగదారులు 22 కోట్ల మందికి పైగా ఉండగా, ఇందులో కేవలం మూడో వంతు మంది... అంటే 7.2 కోట్ల మంది మాత్రమే ఏదో ఒక బ్యాంకు నుంచో, ఇతర ఆర్థిక సంస్థల నుంచో రుణాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వయస్సుపరంగా, ఆదాయాలపరంగా రుణార్హత ఉన్న 15 కోట్ల మంది పైగా వినియోగదారులను చేరేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు పుష్కలంగా వ్యాపార అవకాశాలున్నాయని సిబిల్ తెలిపింది. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, వినియోగవస్తువులకు రుణాలు తదితర సాధనాల ద్వారా ఈ విభాగంలో విస్తరించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అవకాశాలు ఉన్నాయని సిబిల్ తెలిపింది. -
ఏడాదికి 4 సిబిల్ రిపోర్టులు!
రూ.1,200 సబ్‌స్క్రిప్షన్‌తో... సిబిల్ తాజాగా తన కస్టమర్ల కోసం సబ్స్క్రిప్షన్ సర్వీసులను ప్రారంభించింది. రూ.1,200తో సంవత్సరంలో త్రైమాసికానికి ఒకసారి చొప్పున నాలుగు సిబిల్ రిపోర్ట్‌లను పొందొచ్చు. దీని ద్వారా అప్ టు డేట్ క్రెడిట్ స్కోర్ వివరాలు కలిగి ఉండొచ్చు. దీనికోసం https://www.cibil. com.creditscore వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ మనకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. ఒక రిపోర్ట్ (వన్‌టైమ్ ఆప్షన్, రూ.550), రెండు రిపోర్టులు (బైయాన్వల్ ఆప్షన్, రూ.800), నాలుగు రిపోర్ట్లు (క్వార్టర్లీ ఆప్షన్, రూ.1,200). వీటిల్లో ఏ ఆప్షన్నైనా ఎంచుకోవచ్చు. అవసరమైన వివరాలు అందజేసి, ఫీజు చెల్లిస్తే సిబిల్ రిపోర్ట్స్ ఈ–మెయిల్‌కు వస్తాయి. రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు, స్కోర్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని భావించేవారు, సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచుకోవాలనుకునే వారు క్వార్టర్లీ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీని ద్వారా వారు నిర్దిష్ట కాలంలో రిపోర్ట్స్‌ను పొందుతారు. మీరు ఒక సిబిల్ రిపోర్ట్ కోసం రూ.550 చెల్లించాలి. తర్వాత మళ్లీ సంవత్సరంలోపే వేరొక రిపోర్ట్ కావాలంటే మళ్లీ రూ.550 కట్టాలి. అప్పుడు సంవత్సరానికి రూ.1,100 అవుతుంది. అలాంటప్పుడు క్వార్టర్లీ సబ్స్క్రిప్షన్ అప్షన్ ఎంచుకుంటే బాగుంటుంది. ఇక్కడ రూ.1,200తో నాలుగు రిపోర్ట్లు పొందొచ్చు. అయితే తొలిసారి సిబిల్ స్కోర్‌కు దరఖాస్తు చేసుకునే వారు వన్‌టైమ్ రిపోర్ట్ తీసుకోవడం ఉత్తమం.