breaking news
Comprehensive family survey - 2014
-
మా సంగతేమిటో!
ప్రగతినగర్ :తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే-2014 జిల్లాలో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు జరిగిన సర్వేలో 104 శాతం వరకు కుటుంబాల వివరాలు సేకరించారు. జిల్లాలో 6,95.205 కుటుంబాలను గుర్తించిన అధికారులు 30 వేలపై చిలుకు ఉద్యోగులు, సిబ్బందిని సమగ్ర స ర్వేకు నియమించారు. ఉదయం ఆరు గంటల నుంచే ఎన్యూమరేటర్లు సర్వేకు ఉపక్రమించారు. సర్వే సందర్భంగా, ముంబాయి, భీవండి, జాల్నా, నాందేడ్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున స్వస్థలాలకు తరలిరావడంతో కుటుంబాల సంఖ్య 7,21,775 చేరింది. ఇంకా మున్సిపల్ పరిధిలో సుమారు 10 వేల కుటుంబాల వివరాలు సర్వే చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో జిల్లాలో 7.30 లక్షల కుటుంబాల సమాచారాన్ని పూర్తి చేసినట్లు అవుతుందని కలెక్టర్ తెలిపారు. స్టిక్కర్లు వేసినా ముందుగా స్టిక్కర్లు వేసినప్పటికీ, అధికారులు సర్వే చేపట్టకపోవడంతో అక్కడక్కడ జనం ఇబ్బంది పడ్డారు. తాము తెలంగాణకు చెందినవారమైనా తమను ఎన్యూమరేటర్లు గుర్తించడం లేదని వారు జోనల్ అధికారులకు, రూట్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే 600 మంది మంది ఎన్యూమరేటర్లను రంగం లోకి దింపి రాత్రి పొద్దుపోయే వరకు సర్వే నిర్వహించారు. నగరంలోని పోచమ్మగల్లి, ఎల్లమ్మగుట్ట, చంద్రశేఖర్‌కాలనీ, గౌతంనగర్, సాయినగర్, ఇంద్రపుర్కాలనీ, నా గారం తదితర ప్రాంతాలలో ఎన్యూమరేటర్లు రాలేరని సుమారు వెయ్యి మంది బుధవారం ఉదయం కలెక్టరేట్‌ను ముట్టడించారు. తాము ఏళ్ల తరబడి స్థిర నివాసం ఏ ర్పరుచుకొని ఉదయం నుంచి రాత్రి వరకు సర్వే కోసం వేచి చూసిన ఎన్యూమటర్లే రాలేదని, స్టిక్కర్లు వేసిన ఇళ్లకు కూడా రాలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నగరం లో కొన్ని పొరపాట్లు జరిగిన మాటవాస్తవమేనని, రెండు నుంచి మూడు శాతం వరకు పొరపాట్లు జరిగాయని ఆయన చెప్పారు. సర్వేలో పేర్లు నమోదు చేయని కుటుం బాల వివరాలు ఆయా తహశీల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలలో స్వీకరిస్తామని, ప్రజలు ఆందోళన చెందవల్సిన అవసరం లేదన్నారు.ప్రభుత్వం నుండి మా ర్గదర్శకాలు రాగానే వాటిని పూర్తి చేస్తామని వివరించారు. జిల్లాలోని ఇతర ప్రాంతాలలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. -
సహకరించండి
ఖమ్మం జెడ్పీసెంటర్: నేటి సమగ్ర సర్వేకు ప్రజలందరూ సహకరించాల్సిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. ఇలంబరితి కోరారు. ప్రజల సామాజిక, ఆర్థికస్థితిగతులను తెలుసుకునేందుకే ఈ సర్వే చేపట్టామన్నారు. దీని నుంచి ఆంధ్రపదేశ్‌లో కలిసిన ఏడు మండలాలను మినహాయించినట్లు తెలిపారు. అక్కడ సర్వేను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. కలెక్టరేట్లో సోమవారం ఆయనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 39 మండలాల్లో సమగ్ర సర్వే నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేశామన్నారు. ఇప్పటికే ఏడు మండలాలను ఆంధ్రపదే శ్లో కలుపుతూ ఆర్డినెన్స్ పాస్ అయిందన్నారు. న్యాయపరమైన వ్యవహారాలు, డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ అమలు, ప్రభుత్వ నిర్ణయానుసారం ముంపు ప్రాంతాల్లో సర్వే చేయటం లేదన్నారు. ఈ సర్వేతో పథకాలు రద్దు కావని, అదనపు సౌకర్యాలు కల్పించటం కోసమే అన్నారు. ప్రజలు అనుమానాలు, అపోహలకు గురికావద్దన్నారు. సమాచారం అసంపూర్తిగా కాకుండా నిజాలు వెల్లడించాలన్నారు. ఇప్పటికే ప్రతి ఇంటికి వెళ్లి హౌస్‌హోల్డింగ్ సర్వే చేసి, స్టిక్కర్లు అంటించామన్నారు. జిల్లావ్యాప్తంగా 99 శాతం స్టిక్కరింగ్ పూర్తయిందన్నారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి మారుమూల ప్రాంతంలో సైతం ఎలక్షన్ మాదిరిగా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 33వేల మంది ఎన్యూమరేట్లర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. రహదారులు సరిగా లేని గిరిజన గ్రామాలకు సైతం ఎన్యూమరేటర్లను కార్లు, జీపులు, లాంచీల్లో పంపించామన్నారు. ప్రజలు ఎన్యూమరేటర్లకు సహకరించాలన్నారు. సర్వేకు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచితే ఎన్యూమరేటర్ల పని సులవవుతుందన్నారు. స్టిక్కరింగ్ లేని కుటుంబాలను ప్రత్యేకంగా పరిశీలించి సర్వే చేసేందుకు మొబైల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ సర్వే ప్రత్యేక అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ను నియమించామన్నారు. నేడు సెలవు.. అత్యవసర సేవలు అందించే సంస్థలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలకు ప్రభుత్వం మంగళవారం సెలవుదినంగా ప్రకటించిందన్నారు. సమగ్ర సర్వేలో పాల్గొనేందుకు అన్ని సంస్థలూ ఉద్యోగులకు సెలవు ఇవ్వాల్సిందే అన్నారు. ఫిర్యాదులుంటే టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. -
‘సర్వే’కు వేళాయె..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే - 2014ను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 8,59, 260 కుటుంబాలను సర్వే చేసేందుకు 28,642 మంది ఎన్యూమరేటర్లను (వీరికి అందనంగా మూడువేల సిబ్బందిని) నియమించారు. సిబ్బందికి తగిన వైద్యసౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ 30 కుటుంబాల వివరాలను సేకరిస్తారు. గ్రామాలు, కార్పొరేషన్, మున్సిపల్ వార్డులు కలిపి 758 ప్రాంతాల్లో సర్వే చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి 30 కుటుంబాల వివరాలు సేకరించేంత వరకు కార్యక్రమం కొనసాగుతుంది. తొలుత జిల్లాలోని 46 మండలాల్లో సర్వే నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు చివరి నిమిషంలో దానిని 39 మండలాలకే పరిమితం చేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపు కింద ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యే ఏడు మండలాలను సర్వే నుంచి మినహాయించారు. జిల్లావ్యాప్తంగా 39 మండలాల్లోనే సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి సోమవారం అధికారికంగా ప్రకటించారు. సర్వేకు ప్రజలంతా సహకరించాలని, తమకు సంబంధించిన అన్ని వివరాలూ ఎన్యూమరేటర్లకు చెప్పడం ద్వారా అధికారిక గణాంకాలను నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. సర్వేలో ఏ సమస్య తలెత్తినా..సందేహాలున్నా సంబంధిత తహశీల్దార్లకు ఫోన్ చేయాలన్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూంకు ఫోన్ చేయాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. అందరూ ఉండండి...అన్నీ చెప్పండి సర్వేలో పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తే మంచిదని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ సర్వే సంక్షేమ పథకాల్లో కోత విధించేందుకు కాదని, అర్హులైన అదనపు లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలను వర్తింపజేయడం కోసమే అని కలెక్టర్ అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన గణాంకాలను సేకరించేందుకు మాత్రమేనని చెప్పారు. సర్వే కాగితాలను ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్, జీ, హెచ్, ఐలుగా విభజించి ఉన్న తొమ్మిది విభాగాల సమాచారం మాత్రమే చెప్పాలని, అవసరమైతే వివరాలన్నీ చెప్పిన తర్వాత సర్వే కాగితాన్ని సరిచూసుకొని సంతకం పెట్టాలని అధికారులు చెబుతున్నారు. బంగారు ఆభరణాలతో పాటు సర్వే కాగితంలో లేని ఏ ఇతర వివరాలనూ చెప్పాల్సిన అవసరం లేదని కూడా వారు చెపుతున్నారు. సర్వే వివరాలు చెపుతున్న సందర్భంలో కుటుంబ సభ్యులందరూ ఉంటే మంచిదని, సర్వే సందర్భంగా ఎన్యూమరేటర్లకు ఎలాంటి రుజువులు ఇవ్వాల్సిన పనిలేదని, కేవలం కార్డులు చూపిస్తే చాలని చెపుతున్నారు. ఆధార్, రేషన్, ఓటరు గుర్తింపు... తదితర ఒరిజినల్ కార్డులను చూపించాలని, ఎలాంటి కాగితాలు ఎన్యూమరేటర్లకు ఇవ్వాల్సిన పనిలేదని చెపుతున్నారు. విద్యార్థులు, ఆసుపత్రులలో చేరిన వారు, సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్న వారిని మాత్రం సర్వే నుంచి మినహాయించారు. వారు లేకపోయినా వారి వివరాలను చెపితే సంబంధిత ఎన్యూమరేటర్లు నమెదు చేసుకుంటారు. కుటుంబానికి ఉన్న భూముల వివరాలు చెప్పాలా? వద్దా? అనే సందేహం ప్రజల్లో ఉంది. భూములకు సంబంధించి కాగితాలుంటే వివరాలు చెపితే మంచిదని, చెప్పకపోయినా ఫర్వాలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ సర్వేలో వివరాలు చెప్పడం ద్వారా ఆ భూమిపై హక్కు రావడం గానీ, చెప్పకపోవడం వల్ల హక్కు కోల్పోవడం కానీ జరగదని అంటున్నారు. వృద్ధాశ్రమమో యూనిట్ జిల్లాలోని 39 మండలాల్లో ప్రజలందరి వివరాలు సేకరించేందుకు ఆవాసాల్లో నివాసముంటున్న వారి తో పాటు ఇతరుల కోసం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వృద్ధాశ్రమాలు, జైళ్లు, పోలీసు క్యాంపుల్లో కూడా సర్వే జరపనున్నారు. వృద్ధాశ్రమాల్లో ఉండే వారి కోసం ప్రత్యేకంగా ఎన్యూమరేటర్లను నియమించి వృద్ధాశ్రమమో యూనిట్‌గా వివరాలు సేకరించనున్నారు. ఫ్లాట్‌ఫారంలపై నివసించే వారి వివరాలను కూడా సేకరిస్తారు. ఎవరి వివరాలనైనా సేకరించలేదని తెలిస్తే వెంటనే సంబంధిత తహశీల్దార్‌కు ఫోన్ చేస్తే ఎన్యూమరేటర్లు వచ్చి సర్వే నిర్వహిస్తారని అధికారులు చెపుతున్నారు. ఖమ్మం కార్పొరేషన్లో వార్డుల వారీగా నియమించిన అధికారులకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. మిగిలిన మున్సిపాలిటీలలో సంబంధిత కమిషనర్లకు ఫోన్ చేయాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే జిల్లా కేంద్రంలో ఉన్న కంట్రోల్ రూం నెంబర్‌కు ఫోన్ చేయాలి. ముంపులో లేదు.. పోలవరం ముంపు ప్రాంతాలు కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం రూరల్, బూర్గంపాడులోని ఆరు గ్రామాలను సర్వే నుంచి మినహాయించారు. తొలుత ఈ మండలాల్లో సర్వే నిర్వహించాలని అధికారులు భావించారు. ఇప్పటికే ముంపు మండలాలను ఆంధ్రలో విలీనం చేసే ఆర్డినెన్స్‌కు ఆమోదం రావడం, కొన్ని న్యాయపరమైన అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉండడం, ఉభయగోదావరి జిల్లాల అధికారులు ఆ ఏడు మండలాలను కలుపుకునేందుకు డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ ప్రకారం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయడం, ఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీచైర్‌పర్సన్ ఎన్నికలలో కూడా ఆయా మండలాలను మినహాయించడంతో చివరి నిమిషంలో ఈ మండలాలను సర్వే నుంచి తొలగించారు. స్టిక్కరింగ్ గందరగోళం సర్వేలో భాగంగా కుటుంబాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన స్టిక్కరింగ్ అంశం కొంతమేర గందరగోళానికి దారి తీసింది. ముఖ్యంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఈ సమస్య తలెత్తింది. వాస్తవానికి ఖమ్మంలో 55వేలకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 95వేలకు పైగా స్టిక్కర్లు పంపిణీ చేసినా ఇంకా తమకు స్టిక్కర్లు రాలేదంటూ.. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఖమ్మంతో పాటు జిల్లావ్యాప్తంగా అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. వీలున్నంత మేర స్టిక్కర్ల పంపిణీ చేస్తున్నామని, కొన్ని కుటుం బాల్లో యజమానితో పాటు వారి పిల్లలు కూడా ప్రత్యేకంగా నమోదు చేయించుకోవాలని స్టి క్కర్లు అడుగుతుండటంతో గందరగోళం ఏర్పడుతోందని అధికారులు చెపుతున్నారు. ఏ ఇం టినైనా పొయ్యి ప్రాతిపదికన కుటుంబాలుగా గుర్తిస్తామని, ఒకే ఇంటిలో రెండు పొయ్యిలుంటే రెండు కుటుంబాలుగా పరిగణిస్తారు. వెంటనే డాటా ఎంట్రీ.. ఈ సర్వే పూర్తయిన వెంటనే సంబంధిత ఎన్యూమరేటర్లు ఆ కాగితాలను మండల కేంద్రాలకు తీసుకెళ్లి తహశీల్దార్‌కు అప్పగిస్తారు. ఈ కాగితాల్లో నిక్షిప్తమై ఉన్న సమస్త సమాచారాన్ని ఆన్లైన్లో డాటా ఎంట్రీ చేసేందుకు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని పలు కళాశాలల నుంచి మొత్తం రెండువేల కంప్యూటర్లను తీసుకుంటున్నారు. ఆయా కళాశాలల్లో చదువుకుంటున్న వారిలో ఎవరైనా డాటా ఎంట్రీకి ఆసక్తికనబరిస్తే..వారితో పాటు ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న వారిని డాటా ఎంట్రీకి వినియోగించుకుంటారు. ఈనెల 20న కళాశాలల వారీగా వివరాలు సేకరించి, 21న సూపర్వైజర్లకు శిక్షణ నిచ్చి, ఆ తర్వాత డాటా ఎంట్రీ చేసే వారికి శిక్షణనిస్తామని, ఈనెల 23 నుంచి డాటా ఎంట్రీ ప్రారంభం అవుతుందని అధికారులు చెపుతున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 20 డాటా ఎంట్రీ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యేందుకు కనీసం నెలరోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. ఆయా విభాగాల వారీగా తెలపాల్సిన వివరాలు... విభాగం (ఏ) : పేరు, చిరునామా విభాగం (బీ) : కుటుంబ వివరాలు, మతం, సామాజికవర్గం, రేషన్‌కార్డు ఉందా? ఉంటే ఎలాంటిది?బ్యాంకు ఖాతా ఉందా? వితంతువులు, విడిపోయిన వారు తదితర వివరాలు నమోదు చేస్తారు. విభాగం (సీ) : కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశాలు, పుట్టిన తేదీ, విద్యార్హత, ఉపాధి పొందుతున్న మార్గాలు, ఆధార్ నంబర్, పెన్షన్ వివరాలు నమోదు చేస్తారు విభాగం (డీ) : ఇంటికి సంబంధించిన వివరాలు, స్వంత ఇల్లు ఉందా? లేదా అద్దె ఇంట్లో ఉంటున్నారా? స్వంత ఇళ్ళయితే పక్కా ఇళ్ళా? కాదా? మొత్తం గదులెన్ని? ఇంకా ఎక్కడైనా ఇల్లు ఉన్నాయా?గతంలో హౌసింగ్ పథకంలో ఇల్లు పొంది ఉన్నారా? తదితర అంశాలుంటాయి. విభాగం (ఈ) : ఇంటికి ఉన్న విద్యుత్ సదుపాయానికి సంబంధించిన వివరాలు విభాగం (ఎఫ్) : వికలాంగులకు సంబంధించిన అంశాలు. ఎంత మంది ఉన్నారు. వారి వైకల్యం ఏమిటీ? సంబంధిత సర్టిఫికెట్ ఉందా? ఉంటే దాని నంబర్‌ను నమోదు చేసుకుంటారు. విభాగం (జీ) : కుటుంబంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలు నమోదు చేస్తారు. విభాగం (హెచ్) : వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాలు ఉంటాయి. భూమి వంశపారంపర్యంగా వచ్చిందా? కొనుగోలు చేసిందా? అసెన్డ్ భూమా? శిఖం పట్టానా? కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారా? విభాగం (ఐ) : పశు సంపదకు సంబంధించిన వివరాలు ఉంటాయి. మేకలు, గొర్రెలు, గేదెలు, ఆవులు, ఎడ్లు, కోళ్ళు, పందులు ఎన్ని ఉన్నాయో నమోదు చేస్తారు. విభాగం (జే) : స్థిర, చర ఆస్తులు వివరాలుంటాయి. ద్విచక్ర వాహనం, కారు, ఆటో, జీపు, బస్సు తదితర వాటితో పాటు వ్యవసాయ యంత్రాలు ట్రాక్టర్, పొలం దున్నే యంత్రం, కల్టివేటర్లు తదితర వాటిని కూడా నమోదు చేస్తారు.