breaking news
comedy movie
-
మళ్ళీ కామెడీ రోల్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్
-
లవ్ బాస్కెట్లో...
రెండేళ్లుగా హారర్ మూవీస్‌తో ప్రేక్షకులను భయపెట్టడానికే ఆసక్తి చూపించారు నటి అంజలి. ఈ రూట్‌కి కాస్త బ్రేక్ ఇచ్చి ప్రేక్షకులను నవ్వించాలని నిర్ణయించుకున్నారు. వినోద ప్రధానంగా సాగే ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించారామె. ఈ చిత్రానికి కృష్ణన్ జయరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ హిల్ స్టేషన్ నేపథ్యంలో జరుగుతుంది. ఓ ఆసక్తికర విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో బాస్కెట్ బాల్ ప్లేయర్ కమ్ కోచ్‌గా నటిస్తున్నారు అంజలి. ఈ పాత్ర కోసం ఆమె బాస్కెట్ బాల్లో శిక్షణ తీసుకున్నారు. అంజలిని లవ్ బాస్కెట్లో పడేయాలనుకునే పాత్రల్లో యోగిబాబు, రమర్ నటిస్తున్నారు. ‘‘ఫ్యాంటసీ కామిక్ ఎంటర్టైనర్ చిత్రమిది. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళతాం’’ అన్నారు కృష్ణన్. -
మగ బాస్
తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమాల్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాల జాబితాలో ఉండే ఓ సూపర్‌హిట్ సినిమాలోని సన్నివేశాలివి. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... ఆఫీస్‌లో కొత్తమ్మాయి చేరింది. హారిక. అందరూ పరిచయం చేసుకున్నారు. అభిరామ్ రాగానే హారిక అతనితో మాట కలుపుతూ పరిచయం చేసుకోబోయింది. అభిరామ్ కోపంగా చూశాడు. తాను కొత్తగా జాయిన్ అయిన అసిస్టెంట్ మేనేజర్ని అని చెప్పుకుంది. అభిరామ్ ఆ ఆఫీస్‌లో మేనేజర్. ఆ పదవి విషయం అలా ఉంచితే, నిజానికి అతనిదే ఆ సంస్థ. రావడమే ఆమెతో మాట్లాడటం ఏమాత్రం ఇష్టం లేని వాడిలా తన క్యాబిన్‌కు వెళ్లిపోయాడు. అసిస్టెంట్ మేనేజర్‌గా ఒకమ్మాయి తన ఆఫీసులో పనిచేయడం అభికి ఇష్టం లేదు. ఈ విషయమ్మీద ఇంట్లో తన బాబాయ్‌తో గొడవ పడ్డాడు కూడా. ఆ పదవికి అనే కాదు, తన ఆఫీసులో ఏ పనీ అమ్మాయిలు చెయ్యడం అతనికి నచ్చదు. ఆఫీసు నుంచి బయటికెళ్లినా అమ్మాయిలను చూస్తే విసుక్కుంటాడు. వాళ్లతో మాట్లాడాలంటేనే చిరాకు. అదొక వింత జబ్బు అని అందరూ తిట్టుకుంటూ ఉంటారు. అలా తిట్టుకుంటున్నా బాస్ అన్న కారణంతో సుబ్బారావు తన పెళ్లికి అభిని పిలవడానికి వచ్చాడు – ‘‘మీ ఆశీర్వాదం కావాలి సార్!’’ అన్నాడు. ‘‘పుట్టినరోజా?’’‘‘రేపు నా పెళ్లి సార్!’’‘‘పెళ్లా.. ఎందుకు?’’ అరిచినట్టు అడిగాడు అభి. ‘‘ఎవరైనా పెళ్లంటే ఎప్పుడు అని అడుగుతారు. మీరేంటి సార్ ఎందుకు అని అడుగుతున్నారు?’’ ‘‘అందుకే అడుగుతున్నాను. ఎందుకు?’’‘‘భోజనానికి కష్టమైపోతోంది సార్!’’‘‘కుక్‌ని పెట్టుకో..’’ ‘‘ఇల్లు చూస్కోవడానికి కూడా ఎవ్వరు లేరు సార్..’’‘‘కుక్కని పెంచుకో..’’‘‘ఇప్పటికిప్పుడు కట్నమిచ్చే కుక్క ఎక్కడ దొరుకుతుంది సార్?’’‘‘సెటైరా?’’‘‘మీతో సెటైరేస్తే రిటైరైపోతానని తెలుసు సార్’’ ‘‘ఎన్నైనా చెప్పు సుబ్బారావు.. నువ్వు పెళ్లి చేస్కోవడం నాకిష్టం లేదయ్యా!’’ అభి మాట్లాడుతూ పోతున్నాడు. అతనికి పెళ్లెందుకు ఇష్టం లేదంటే మళ్లీ కారణం ఒక్కటే, అమ్మాయిలంటే అతనికి కోపం. అతనికి ఆ కోపం రోజురోజుకీ ఎక్కువైపోతూనే ఉంది. హారిక అంటే ప్రత్యేకంగా కోపం లేకపోయినా ఆమెపై కూడా విసుక్కుంటున్నాడు, ఒక్కోరోజు ఒక్కో కారణంతో. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు హారిక తన పెళ్లి కుదిరిందంటూ ఆఫీస్‌లో అందరికీ స్వీట్లు పంచుతోంది. ‘‘బాస్‌కి ఈ విషయం చెప్పారా?’’ హారికను అడిగింది ఒక కలీగ్. ‘‘ఆయనకా? పెళ్లిళ్లు కుదరడం, ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలవడం.. ఇలాంటి శుభవార్తలు అలాంటి వాళ్లకు చెప్పకూడదు..’’ ‘‘చెప్తే ఏడుస్తాడు.’’‘‘అహా! వాడు ఏడ్చే టైప్ కాదు.. ఏడిపించే టైపు..’’ హారిక గట్టిగా నవ్వుతూ ఈ మాటన్నప్పుడు అక్కడికి వచ్చాడు అభి. ‘‘నా గురించి అంత కరెక్ట్‌గా ఎలా చెప్పగలిగావు?’’ హారిక మౌనంగా నిలబడింది. అభి మాట్లాడుతూ పోతున్నాడు – ‘‘ఇది ఆఫీసా పుల్లారెడ్డి స్వీట్షాపా.. నీకు నెలకు ముప్ఫై వేలు జీతం. రోజుకి వెయ్యి రూపాయలు. ఇలా రోజూ గంటసేపు స్వీట్లు పంచిపెడుతూ, ఇంకో గంట దాని టేస్టుగురించి మాట్లాడుతూ టైమ్ వేస్ట్ చేస్తే.. నీ జీతం నీకు వచ్చేస్తుంది. కానీ మాకు బోలెడంత లాస్ వస్తుంది. ఆ లాస్‌తో పాటు మా మీద జోకులు, సెటైర్లు... అసలు నిన్ను కాదులే.. నీలాంటివాళ్లను వెతికి మరీ తీసుకొచ్చాడే, అందుకు మా బాబాయ్‌ని అనాలి. ఇన్నాళ్లూ నీకు పని రాదనుకున్నాను. కానీ ఇప్పుడర్థమైంది.. అసలు నువ్వు పనికిరావు’’.ఆఫీస్‌లో అందరిముందూ డస్ట్‌బిన్‌తో హారికను పోల్చాడు అభి. హారిక అక్కడే, ఆ అందరిముందే ఏడ్చేసింది. ఆ తర్వాత పదో నిమిషం.. ‘‘నా రిసిగ్నేషన్ లెటర్ సార్’’ అంటూ చైర్మన్ క్యాబిన్లో నిలబడింది. ‘‘ఏమైందమ్మా? ఏంటి ప్రాబ్లమ్?’’ ‘‘మీ అబ్బాయి సార్! మొదట్లో ఆయన నన్ను తిడుతుంటే నా పని నచ్చలేదేమో అనుకున్నా సార్. కానీ నేనే నచ్చలేదు. నెలకోసారి జీతమిస్తున్నారు కదాని, గంటకోసారి తిడితే పడే ఓపిక నాకు లేదు సార్..’’‘‘వాడి ప్రవర్తన నచ్చక రిజైన్ చేస్తున్నానని చెప్పావు. కానీ వాడెందుకలా బిహేవ్ చేస్తున్నాడో చెప్పలేదు.’’ ‘‘నాకు తెలీదు సార్!’’ ‘‘నాకు తెలుసు. నీకు వాడు రెణ్నెల్ల నుంచి మాత్రమే తెలుసమ్మా! కానీ నాకు వాడు రెండేళ్ల వయసప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు మీరు చూస్తున్న అభి అభి కాదమ్మా! వాడు వేరు. వాడి కోపం ప్రళయం. వాడి ప్రేమ సముద్రం. వాడి జాలి వర్షం..’’ అభిరామ్ గతాన్ని చెబుతూ వచ్చాడు బాబాయ్. అభిరామ్ గతాన్నంతా తెలుసుకున్నాక హారిక ఒక్క మాట మాట్లాడకుండా అభిరామ్ బాబాయ్‌నే చూస్తూ కూర్చుంది. ఆమె కళ్లలో నీళ్లు. ‘‘నేను నీకు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. నువ్వు వాడ్ని గౌరవించకపోయినా ఫర్వాలేదు. అసహ్యించుకుంటే మాత్రం నేను తట్టుకోలేను.’’ చివరగా ఈ మాట చెప్పి ముగించాడు బాబాయ్. చైర్మన్ క్యాబిన్లోంచి హారిక బయటకు రావడం కోసం ఎదురుచూస్తున్నాడు అభి. కచ్చితంగా ఆమెను ఉద్యోగం నుంచి తప్పించి ఉంటారన్న నమ్మకంతో సుబ్బారావుతో కబుర్లు చెబుతూ ఎదురుచూస్తున్నాడు. హారిక వచ్చింది. ‘‘నాకు ప్రమోషన్ ఇచ్చారు’’ అంటూ అభి చేతిలో ఒక లెటర్ పెట్టింది. ‘‘ప్రమోషనా? బాబాయ్ నిన్ను సస్పెండ్ చెయ్యలేదా?’’ అమాయకంగా అడిగాడు అభి.‘‘మేనేజర్‌గా ప్రమోట్ చేశారు.’’‘‘మేనేజర్గానా? మరి నేను?’’‘‘మిమ్మల్ని సస్పెండ్ చేశారు.’’ ‘‘నన్నా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?’’ ‘‘ఎక్కువ షాకవ్వద్దు. ఆ లెటర్ చదువుకోండి’’ అంది హారిక. తాను సస్పెండ్ అయినట్టు ఆ లెటర్ చదువుకొని ఎగిరిపడ్డాడు అభిరామ్. ఇంట్లో బాబాయ్‌తో గొడవపడితే హారిక వదిలేసిన అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఒక్కటే మిగిలింది అతనికి. బాబాయ్‌తో హారిక ఏం మాట్లాడిందో తెలియని, హారికకు తన గతం తెలిసిందని తెలియని అభిరామ్, ఇప్పుడామె కింద పనిచెయ్యాలి. -
పుణేలో... రిస్కీ నిఖిల్!
రిస్క్ తీసుకోవడానికి వెనకాడని యువ హీరోల్లో నిఖిల్ ఒకరు. ఆయన చేస్తున్న సినిమాలు చూస్తే ఆ సంగతి అర్థమవు తుంది. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వెర్సస్ వెర్సస్’... ఇలా వరుసగా రిస్కీ ప్రాజెక్ట్స్ చేస్తూ వస్తున్న నిఖిల్ ఇప్పుడు ఏకంగా అలనాటి క్లాసిక్ ‘శంకరాభరణం’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. ఆ పేరుతో సినిమానా? రిస్క్ కాదా అనుకుంటున్నారా? కాదంటున్నారు చిత్రకథా రచయిత, సమర్పకుడు కోన వెంకట్. ఎందుకంటే, ఆ ‘శంకరాభరణం’కీ, ఈ చిత్రానికీ పోలిక ఉండదని ఆయన చెబుతున్నారు. ఇది క్రైమ్, కామెడీ మూవీ అట. మనుషులు వెళ్లడానికి సాహసం చేయని రిస్కీ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ రిస్క్‌లో ఓ కిక్ ఉందని చిత్రబృందం చెబు తోంది. ప్రస్తుతం పుణేకి అరవై కిలోమీటర్ల దూరంలో గల బోర్, నగరి, వాయ్ గ్రామాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ నెల 25 వరకూ అక్కడ షూటింగ్ చేస్తామని నిర్మాత ఎం.వి.వి. సత్యనారాయణ తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్. -
కామెడీయే కలిసొస్తున్నట్టుంది!
గాసిప్ నేహాశర్మ గుర్తుందా? ‘చిరుత’ సినిమాలో ‘ఏయ్ బాబూ... ఇలా రామ్మా’ అంటూ రామ్‌చరణ్ దగ్గర అహంకారాన్ని ప్రదర్శించే అమ్మాయిగా నటించింది. ఆ తర్వాత కూడా ఒకట్రెండు తెలుగు సినిమాలు చేసినా... అవి విజయం సాధించకపోవడంతో మెరుపులా మాయమైంది నేహా. ఏమయ్యిందబ్బా అని అందరూ అనుకుంటుండగానే బాలీవుడ్లో తేలింది. క్రూక్, తేరీ మేరీ కహానీ, యంగిస్తాన్ వంటి సినిమాల్లో అప్పుడప్పుడూ కనిపించింది కానీ పాపం కెరీర్ అనుకున్నంతగా లేదనే చెప్పాలి. ఇటీవలే ఆమెకి ‘హేరా ఫేరీ’ సినిమా మూడో భాగంలో నటించే చాన్స్ వచ్చింది. ఓకే అయితే చెప్పింది కానీ కామెడీ సినిమా కాబట్టి కాస్త లోలోపల ఫీలవుతోందని సమాచారం. ఇంతకు ముందు కూడా క్యా సూపర్ కూల్ హై హమ్, జయంతిభాయ్కీ లవ్‌స్టోరీ, యమ్లా పగ్లా దివానా 2 వంటి కామెడీ చిత్రాల్లో నటించింది. ఇప్పుడూ అలాంటి సినిమాయే రావడంతో ‘కామెడీయే కలిసొస్తున్నట్టుంది’ అంటూ కొన్ని ముంబై పత్రికలు రాసి పారేశాయ్. దాంతో నేహ కాస్త నొచ్చుకుందని వినికిడి! -
కమల్ తదుపరి సినిమాలో బాలచందర్
ఒకాయన మెగాఫోన్ పట్టుకున్నారంటే.. తిరుగులేదు బ్రహ్మాండమైన హిట్లే. మరొకాయన నటిస్తున్నారంటే అదో అద్భుత చిత్రరాజం అన్నట్లే. అలాంటి వాళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే... ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు కదూ. అవును, అద్భుత చిత్రాల సృష్టికర్త కె.బాలచందర్‌తో కలిసి నవరస నటనా సార్వభౌముడు కమల్ హాసన్ నటించబోతున్నాడు. విశ్వరూపం-2 విడుదలైన తర్వాత షూటింగ్ చేసుకోబోయే తమిళ కామెడీ చిత్రం 'ఉత్తమ విలన్'లో ప్రముఖ దర్శకుడు బాలచందర్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నారు. కమల్ కెరీర్‌ను తీర్చిదిద్దిన బాలచందర్, 1973 నుంచి దాదాపు 30 సినిమాలు ఆయనతో తీశారు. అలాంటిది కమల్‌తో కలిసి నటించడం కోసం ఆయన గెడ్డం కూడా పెంచుతున్నారు. కమల్ వ్యక్తిగతంగా కోరడంతోనే ఈ ప్రాజెక్టు చేయడానికి ఆయన అంగీకరించారు. ఆయన నిజజీవిత పాత్రకు ఆ సినిమాలో పాత్ర చాలా దగ్గరగా ఉంటుందట. 'ఉత్తమ విలన్' సినిమాకు కమల్ స్నేహితుడు, బాలచందర్ శిష్యుడైన రమేష్ అరవింద్ దర్శకత్వం వహించబోతున్నారు. వయసు మీరిపోతున్న ఓ సూపర్‌స్టార్ పాత్రలో కమల్ ఆ చిత్రంలో నటిస్తారు. క్రేజీ మోహన్ ఈ చిత్రానికి డైలాగులు రాస్తారు. గతంలో కమల్ నటించిన మైఖేల్ మదన కామరాజు, విచిత్ర సోదరులు, భామనే సత్యభామనే, పంచతంత్రం లాంటి కామెడీ హిట్ సినిమాలకు క్రేజీ మోహనే సంభాషణలు అందించారు.