చర్చ్ పార్కు పాఠశాలలో టీచర్ గా దేవయాని
నటి దేవయాని అధ్యాపకురాలి వృత్తి చేపట్టారు. ఇదేదో సినిమా పాత్ర అనుకునేరు. నిజంగానే ఆమె నటనకు దూరంగా ఒక పాఠశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. పక్కింటి అమ్మాయి పాత్రలకు పెట్టింది పేరు దేవయాని. అజిత్ సరసన నటించిన కాదల్‌కోట్టై (తెలుగులో ప్రేమలేఖ) చిత్రంలో ప్రాచుర్యం పొందారు. సూర్యవంశం, ఫ్రెండ్స్, మరుమలర్చి, తెనాలి, వల్లరసు తదితక విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రముఖ హీరోయిన్ స్థాయిని అందిపుచ్చుకున్నారు. తెలుగులోనూ సుస్వాగతం లాంటి చిత్రాలతో గుర్తింపు పొందిన దేవయాని 2001లో దర్శకుడు రాజ్‌కుమార్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఇనియ, ప్రియాంక ఉన్నారు.
సినిమాల్లో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో బుల్లితెరపై దృష్టి సారించారు. అక్కడ రోజుకు లక్ష రూపాయలు పారితోషికం తీసుకున్న నటిగా తన ప్రత్యేకతను చాటుకున్న దేవయాని ప్రస్తుత వయసు 40 ఏళ్లు. ఈమె చిత్ర నిర్మాణం చేపట్టి తన భర్త దర్శకత్వంలో కొన్ని చిత్రాలను కూడా నిర్మించారు. అలాంటిది అనూహ్యంగా నటనకు స్వస్తి చెప్పి అధ్యాపకురాలిగా ఉద్యోగం చేయడం ఆశ్చర్యకరమైన విషయమే. ప్రస్తుతం దేవయాని స్థానిక అన్నాసాలైలో గల చర్చ్‌పార్కు కాన్వెంట్ పాఠశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. దీని గురించి ఆమె స్పందిస్తూ ఇప్పటి పలు సినీ, టీవీ సీరియల్ అవకాశాలు వస్తున్నాయన్నారు.
అయితే ఒకతరహా మూస పాత్రలు చేసి బోర్‌కొడుతోందని పేర్కొన్నారు. దీంతో ఏదైనా భిన్నమైన పని చేయాలని, అది ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తనకు ఉపాధ్యాయరాలిగా పనిచేయాలని చిన్ననాటి నుంచి కోరికని తెలిపారు. దీంతో టీచర్ కోర్సు చదివి ఉత్తీర్ణత పొందానని చెప్పారు. అనంతరం తనపిల్లలు చదువుతున్న చర్చ్ పార్కు పాఠశాలలో అధ్యాపకురాలిగా చేరానని తెలిపారు. అక్కడి విద్యార్థులను చూస్తున్నప్పుడు తాను మళ్లీ కొత్తగా పుట్టినట్టుందన్నారు. జీతం గురించి ఆతోచించాల్సిన అవసరం లేదని ఇక్కడ చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉందని దేవయాని పేర్కొన్నారు.