breaking news
chittamuru
-
జగనన్న విద్యాదీవెన నగదు అప్పునకు జమ
చిట్టమూరు: పేద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పడిన జగనన్న విద్యాదీవెన పథకం సొమ్మును అప్పులకు జమకట్టుకున్న ఒక బ్యాంకు మేనేజరు నిర్వాకమిది. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నాలుగు విడతలుగా ఇవ్వనున్న విద్యాదీవెన నగదును సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమచేసిన విషయం తెలిసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిట్టమూరులోని కెనరా బ్యాంకులో ఖాతాలున్న విద్యార్థుల తల్లులు ఆ నగదును డ్రా చేసుకునేందుకు వెళ్తే బ్యాంకు మేనేజరు అడ్డుకున్నారు. ఆ నగదును గతంలో వారు తీసుకున్న రుణాలకు జమ చేసుకున్నట్లు చెప్పారు. కొందరికి రుణాలు లేకపోయినా.. వారి బంధువులు తీసుకున్న రుణాలు కట్టిస్తేనే ఈ నగదును ఇస్తామని తెలిపారు. జగనన్న విద్యాదీవెన నగదును డ్రా చేసుకుని వారంలోగా కాలేజీలకు చెల్లించకపోతే మిగిలిన మూడు విడతలు జమ కావని ప్రభుత్వం ఓ వైపు హెచ్చరిస్తుండటంతో సుమారు 50 మంది తల్లులు ఆవేదన చెందుతున్నారు. బ్యాంకు మేనేజరు డబ్బు ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఏంచేయాలో దిక్కుతోచడంలేదని బాధపడుతున్నారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్‌ను వివరణ కోరగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. -
యువకుడి హత్య
చిట్టమూరు : మండలంలోని కోగిలి పంచాయతీ వడ్డికండ్రిగకు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మల్లి పాపయ్య (23) నాయుడుపేటలోని ఓ పెట్రోలు బంకులో పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం వేముగుంటపాళెంకు చెందిన తన మేనమామ కుమార్తె కవితతో వివాహమైంది. గురువారం తన తాత సంవత్సరీకానికి పక్కనే ఉన్న వేముగుంటపాళెంకు కుటుంబ సమేతంగా వెళ్లాడు. భార్య, పిల్లలను అక్కడే ఉంచి వదలి పాపయ్య ఒక్కడే స్వగ్రామం వడ్డికండ్రిగకు చేరుకున్నాడు. రాత్రి ఇంటి వద్ద ఒంటరిగా పడుకున్నాడు. శుక్రవారం చుట్టు పక్కల వాళ్లు ఇంట్లోకి వెళ్లి చూడగా పాపయ్య మెడకు తాడుతో ఉరేసుకుని చనిపోయినట్లు ఉన్నాడు. అయితే కాళ్లు మంచాన్ని తగులుతూ అనుమానాస్పదంగా ఉండటంతో మృతదేహాన్ని కిందకు దింపి చూశారు. ఒంటిపై రక్తపు గాయాలు ఉండటం, ఇంటి పక్కనే ఇనుప కమ్మీకి రక్తపు మరకలు అయి ఉండటంతో గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ రత్తయ్య, ఎస్ఐ గోపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఒంటిపై రక్త గాయాలు ఉండటంతో హత్యగా కేసు నమోదు చేశారు. యువకుడు హత్యకు గురికావడంతో అలజడి వాతావరణం నెలకొంది. గతంలో గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ విషయమై గొడవలు జరిగి ఇరువర్గాలు కేసులు పెట్టుకుని ఉన్నారు. ఈ క్రమంలో పాపయ్య హత్య జరగడం సంచలనం కలిగిస్తోంది.


