breaking news
Chennai factory
-
హ్యుండై విస్తరణ ప్లాన్.. మరిన్ని కొత్త ఉద్యోగాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా సంస్థ హ్యుండై అనుబంధ కంపెనీ హ్యుండై మోటార్ ఇండియా తమిళనాడు ప్లాంటును విస్తరించాలని నిర్ణయించింది. ప్రీ–ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను ఈ మేరకు దాఖలు చేసింది. దీని ప్రకారం కాంచీపురం జిల్లాలోని ఈ కేంద్రంలో రూ.1,500 కోట్లతో ఆధునీకరణ పనులు చేపడతారు.విస్తరణ పూర్తి అయితే 5.4 లక్షల చదరపు మీటర్లున్న ప్లాంటు స్థలం 7.21 లక్షల చదరపు మీటర్లకు పెరుగుతుంది. కొత్తగా 155 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధునీకరణ పనులకు కొత్తగా స్థలం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. మొత్తం 538 ఎకరాల్లో ఈ కేంద్రం నెలకొని ఉంది.ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 8.5 లక్షల యూనిట్లు. అయిదేళ్లలో విస్తరణ పనులు పూర్తి అవుతాయని సంస్థ భావిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రయాణికుల వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ పెట్టుబడి కీలకమని హ్యుండై వెల్లడించింది. -
చెన్నై ఫ్యాక్టరీలో బీఎమ్‌డబ్ల్యూ 50,000వ కారు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎమ్‌డబ్ల్యూ తన 50,000వ కారును చెన్నై ఫ్యాక్టరీలో తయారుచేసింది. దాదాపు 50 శాతం వరకు స్థానిక పరికరాలతోనే దీన్ని రూపొందించినట్టు కంపెనీ చెప్పింది. ఈ 50,000వ కారు బీఎమ్‌డబ్ల్యూ 7- సిరీస్‌కు చెందిందని బీఎమ్‌డబ్ల్యూ చెన్నై ప్లాంటు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. జోచెన్ స్టాల్ క్యాంప్ తెలిపారు. 50,000వ కారును స్థానికంగా తయారుచేయడం తాము గొప్పగా భావిస్తున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇక మీదట అన్ని బీఎమ్‌డబ్ల్యూ కార్లను స్థానికంగానే తయారుచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది న్యూఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్ పోలో బీఎమ్ డబ్ల్యూ 7 సిరీస్ ను ఇండియాలో ఆవిష్కరించారు. 2007 మార్చి 29 నుంచి చెన్నై ప్లాంటులో ఈ కంపెనీ కార్లను తయారుచేస్తోంది. అప్పటినుంచి స్థానికంగా ఉత్పత్తి అయ్యే పార్ట్ ల షేరును పెంచుకుంటూ, బీఎమ్ డబ్ల్యూ తన మోడళ్లలో వాటిని వాడుతూ వస్తోంది. చెన్నై ప్లాంటు ద్వారా తన స్థానిక సామర్థ్యాన్ని 50శాతం మేర పెంచుకోవాలని భావిస్తున్నట్టు బీఎమ్ డబ్ల్యూ చెప్పింది. ప్రస్తుతం చెన్నై ప్లాంటు నుంచి బీఎమ్ డబ్ల్యూ 1 సిరీస్, 3 సిరీస్, 3 సిరీస్ గ్రాన్ టురిస్మో, 5 సిరీస్, 7 సిరీస్, ఎక్స్1, ఎక్స్ 3, ఎక్స్ 5లు మార్కెట్లోకి వచ్చాయి.