breaking news
cheating women
-
ముగ్గుర్ని మోసగించి వివాహమాడిన పోలీసు
టీనగర్: ముగ్గురు మహిళలను మోసగించి వివాహమాడిన చెన్నై పోలీసు కానిస్టేబుల్‌పై అధికారులు చర్యలు తీసునున్నారు. చెన్నై సాయుధ పోలీసు దళంలో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు అరుణన్. ఇతని సొంతవూరు అరంతాంగి. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం జరిగింది. తర్వాత ఆరుణన్ మధురైలో పనిచేస్తూ వచ్చారు. ఆ సమయంలో తిరుప్పరంకుండ్రంకు చెందిన పోలీసు హెడ్ కానిస్టేబుల్ కాళియమ్మాల్తో పరిచయం ఏర్పడింది. ఆమెను వివాహమాడేందుకు అరుణన్ ఇష్టపడ్డారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వనున్నానని, అందుకోసం దరఖాస్తు చేసుకున్నట్లు అరుణన్ తెలిపారు. దీన్ని నమ్మిన కాళియమ్మాల్ అతన్ని వివాహమాడేందుకు సమ్మతిం చింది. కాళియమ్మాల్ పేరును జననిగా మార్చి ఆమెను అరుణన్ వివాహం చేసుకుని విడిగా కాపురం పెటారు. ఆ తర్వాత అరుణన్ చెన్నైకు బదిలీ అయ్యారు. ఆ సమయంలో విదేశాలకు అభ్యర్థులను పంపే సంస్థలో పనిచేస్తున్న కవిత అనే మహిళతో అరుణన్కు పరిచయం ఏర్పడింది. కవితకు ఇదివరకే వివాహమై భర్తతో విడిపోయింది. ఆమె కోట్టూర్‌పురంలో విడిగా జీవిస్తోంది. తనకు భార్య లేదని చెప్పి కవితను అరుణన్ మూడవ వివాహం చేసుకున్నారు. ఇలావుండగా అరుణన్ ముగ్గురిని వివాహమాడినట్లు కళియమ్మాల్కు, కవితకు తెలిసింది. దీని గురించి కవిత మైలాపూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదేవిధంగా కాళియమ్మాల్ కూడా ఫిర్యాదు చేసింది. పోలీసు కానిస్టేబుల్ అరుణన్ వద్ద విచారణ జరిపేందుకు పోలీసులు సమన్లు పంపనున్నారు. అతను మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు రుజువయితే అరెస్టు చేసేందుకు పోలీసులు నిర్ణయించారు. -
మాయగాడితో జర జాగ్రత్త!
కడప అర్బన్ : మూడు పదుల వయసు కలిగి ‘చంద్రు’డివలె చక్కగా ఉన్న ఓ కార్పొరేట్ కళాశాల అధ్యాపకుడు తన వాక్చాతుర్యంతో విద్యార్థినులను లోబరుచుకుంటున్న వైనం వెలుగు చూసింది. ఇతగాడి స్వస్థలం ప్రకాశం జిల్లా పెద్ద పలని. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువతితో 2009లో వివాహమైంది. ఆమె నెల్లూరులోని ఓ కార్పొరేట్ కళాశాలలో అధ్యాపకురాలు. ఇతనూ అక్కడే ఫిజిక్స్ అధ్యాపకుడిగా పని చేస్తూ ఇటీవల తిరుపతిలోని ఓ కార్పొరేట్ కళాశాలకు మారాడు. కడప నగరానికి చెందిన ఓ యువతి ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం రెండు సంవత్సరాల క్రితం నెల్లూరు నగరంలోని ఓ కళాశాలలో చేరింది. ఇతగాని మాయలో పడి 20 రోజుల క్రితం అతనితో వెళ్లింది. ఆ యువతి తల్లిదండ్రుల నుంచి తనకు ఇబ్బంది ఎదురవ్వచ్చని ఊహించి తిరుపతిలోని అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు. మరో వైపు తన తల్లిదండ్రుల నుంచి తనకు హాని ఉందని ఆ యువతి హైకోర్టులో కేసు వేసింది. ఈ నేపథ్యంలో ఈ అధ్యాపకుడిని, ఆ యువతిని కడప మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ వాసుదేవన్ పిలిపించారు. ఆ విషయం తెలుసుకున్న అధ్యాపకుడి భార్య బుధవారం నెల్లూరు నుంచి హుటాహుటిన కడప చేరుకుంది. తన భర్త వల్ల తాను చాలా ఇక్కట్లు ఎదుర్కొన్నానని కన్నీటి పర్యంతమైంది. తమకు ఐదేళ్ల బాబు, ఐదు నెలల పాప ఉన్నారని, తన భర్త తీరును మార్చి తనతో పంపాలని వేడుకుంది. ఇతగాడిపై ఫిర్యాదు చేయడానికి భార్య, అటు ఆ యువతి ఇద్దరూ ఇష్టపడలేదు. దీంతో పోలీసులు చేసేదేమీ లేక అధ్యాపక దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. భవిష్యత్ పాడు చేసుకోవద్దని ఆ యువతిని హెచ్చరించి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, సూటు.. బూటుతో చక్కగా ఉన్న ఈ అధ్యాపకుడిపై ఫిర్యాదు లేని కారణంగా ఎలాంటి చర్య తీసుకోలేకపోయామని పోలీసులు తెలిపారు. ఇలాంటి వారి మాయలో పడకుండా విద్యార్థినుల తల్లిదండ్రులు గమనిస్తుండాలన్నారు. విద్యార్థినులకు ఖరీదైన బహుమతులు ఇస్తూ విలాసవంతమైన జీవితం రుచి చూపిస్తూ లోబరుచుకునేవాడని, తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసి బంగారు ఆభరణాలు కాజేసేవాడని కూడా పోలీసుల విచారణలో తేలింది. మరోమారు తప్పిదానికి పాల్పడితే సుమోటోగా కేసు నమోదు చేస్తామని పోలీసులు అతగాడికి గట్టిగా హెచ్చరించి పంపారు.