breaking news
chamomile
-
కడుపు నొప్పి: అల్లం, పుదీనా, గ్రీన్ బనానా.. వీటితో..
ఇంట్లో ఫేవరేట్ వంటలు చేస్తే ఆరోజు మన చేతికి ఎముక ఉండదు. లాగించెయ్యడమే... ఇక రోడ్డు పక్క స్టాల్స్, హోటళ్ల ఇష్టమైన, ఘుమఘుమలాడే చిరుతిండ్లు కనిపిస్తే ఇంకేముంది.. క్షణాల్లో అక్కడ వాలిపోతాం! ఆనక.. తిన్నది అరగక.. పడేతిప్పలు అన్నీఇన్నీకాదు. కడుపునొప్పితో ప్రారంభమై వాంతులు, మలబద్ధకం/విరేచనాలు... ఒక్కోసారి.. క్లైమాక్స్‌లో హాస్పిటల్ బిల్ చూసి మూర్చపోయేంత పనౌతుంది. పిల్లలు, పెద్దల్లో సర్వసాధారణంగా కనిపించే కడుపునొప్పికి వంటింట్లో దొరికే ఈ 5 రకాల పదార్థాలతో ఏ విధంగా ఉపశమనం పొందవచ్చో నిపుణుల మాటల్లో.. అల్లం కడుపునొప్పి సాధారణ లక్షణాలు వికారం, వాంతులు. వీటి నివారణకు ఎప్పుడైతే చర్యలు తీసుకుంటామో అప్పుడు మన శరీరం కొంత తేరుకుంటుంది. వికారం, వాంతులకు సహజమైన నివారణ మంత్రం అల్లం అని చెప్పవచ్చు. అల్లం నేరుగా తిన్నా లేదా వంటల్లో వాడినా ఎంతో మేలు చేస్తుంది. ద్రావణ రూపంలో తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు, తాపనివారణకు అల్లం అద్భుతమైన ఔషధమని ఫోర్టిస్ హాస్పిటల్‌కు చెందిన డా. అహుజా తెలిపారు. సీమ చామంతి కడుపునొప్పితో సహా వివిధ వ్యాధుల నివారణకు పూర్వకాలం నుంచే సీమ చామంతి వాడుకలో ఉంది. పేగు సంబంధిత వ్యాధులు అంటే గ్యాస్, అజీర్ణం, డయేరియా, వాంతులకు ఈ ఔషధమొక్క బాగా పనిచేస్తుంది. దీనిని కషాయం రూపంలో పిల్లలకు పట్టిస్తే కడుపునొప్పి ఇట్టే మాయం అవుతుంది. ఈ వ్యాధుల నివారణలో సీమ చామంతి ఔషదమొక్క కీలకపాత్రపోషిస్తున్నప్పటికీ, దీని పనితీరుపై మరికొంత అధ్యయనం చేయవలసి ఉంది. పెప్పర్మింట్(పుదీనా) ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనేది పెద్ద పేగు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధి. కడుపునొప్పి, ఉబ్బసం, మలబద్ధకం, డయేరియా వంటివి దీని ప్రధాన లక్షణాలు. అసౌకర్యాన్ని కలిగించే ఈ లక్షణాలను పెప్పర్మింట్ హెర్బల్‌తో నివారించవచ్చు. పేగుల్లో ఆకస్మికంగా సంభవించే కండరాల నొప్పి తగ్గించడానికి, వాంతులు, డయేరియాల నివారణకు పెప్పర్మింట్లోని మెంథాల్ ఉపయోగపడుతుందని బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అధ్యయనాలు వెల్లడించాయి. చదవండి: Red Lady Finger: ఎర్ర బెండీ.. భలే భలే.. వాళ్లకి మేలు! గ్రీన్ బనానా డయేరియా తీవ్రతను పచ్చ అరటితో తగ్గించవచ్చు. పచ్చ అరటిలో రెసిస్టెంట్ స్టార్చ్ అనే ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుంది. అది యాంటి డయేరియా కారకాలు కలిగి ఉంటుంది. ఈ రెసిస్టెంట్ స్టార్చ్ పేగుల్లో నెమ్మదిగా పులిసిన షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పేగులు ఎక్కువ నీటిని పీల్చుకొనేలా ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా అరటిలో విటమిన్ ‘బి6’, పొటాషియం, ఫోలిక్ యాసిడ్లు కూడా ఉంటాయి. ఈ పోషకాలు తిమ్మిరి, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. డయేరియా నివారణలో పచ్చ అరటి ప్రయోజనాలపై వెనుజులాకు చెందిన పీడియాట్రీషియన్ డా. థైజ్ అల్వరెజ్ అకోస్టా నిర్వహించిన పరిశోధనాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పెరుగు జీర్ణక్రియ కార్యకలాపాల్లో మార్పుల కారణంగా కడుపునొప్పి సంభవిస్తుంది. అంటే కడుపులోని బ్యాక్టీరియా అసమతుల్యతం అవుతుందన్నమాట. ప్రోబయోటిక్స్ (మంచి సూక్ష్మజీవులు) అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గ్యాస్, ఉబ్బసం వంటి రుగ్మతలకు పుల్‌స్టాప్ పెట్టవచ్చు. పెరుగులో జీవించి ఉండే బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, డయేరియా (అతిసారా) నివారణకు తోడ్పడుతుంది. సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగిన వారు పెరుగు సేవిస్తే సులభంగా జీర్ణం అవుతుంది. ప్రోబయోటిక్ ఉత్పత్తులు ఐబీఎస్ రుగ్మతలకు ఉపశమనం కలిగిస్తాయని యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాలోని జువాలజీ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ ఎనా రే బెనర్జి వెల్లడించారు. చదవండి: Weight Loss: అవిసె గింజలు, అరటి, రాజ్మా.... ఇవి తిన్నారంటే... -
పుష్పవిలాపం!
పతనమైన పూల ధరలు గిట్టుబాటుకాక తోటలోనే వదిలేస్తున్న రైతులు మార్కెట్లోనే పారబోస్తున్న వైనం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: బతుకు ‘పూల’బాటేనని భావించిన రైతాంగానికి ఈ ఏడాది నష్టాల మూటే మిగిలింది. మార్కెట్లో ఒక్కసారిగా ధరల పతనం కావడం.. అకాల వర్షాలు పంటను ముంచేశాయి. దీంతో రైతులు కష్టాల్లో కూరుకుపోయారు. ఒకవైపు పూలసాగు విస్తీర్ణం పెరగడం.. దిగుబడి గణనీయంగా ఉండడం ధరల పతనానికి కారణంగా కనిపిస్తోంది. ఈ సీజన్లో ఏ రకం పూలకయినా డిమాండ్ బాగా ఉండేది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు తలకిందులయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 10 వేల ఎకరాల్లో చామంతి, బంతి, గులాబీ, కనకాంబర పూల తోటలు సాగవుతున్నాయి. నగర శివారు మండలాలైన శంషాబాద్, మొయినాబాద్, షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, మహేశ్వరం, కందుకూరులో పూల పంట విరివిగా సాగుతోంది. ఇక్కడి నుంచి గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌ను ఉత్పత్తులను తరలిస్తారు. ముహూర్తం కుదరక.. సాధారణంగా సంక్రాంతి నుంచి జూన్ వరకు మంచి ముహూర్తాలతో వివాహాలు, శుభకార్యాలు పెద్ద సంఖ్యలో జరుగుతుంటాయి. ఈ సీజన్‌ను దృష్టిలో పెట్టుకున్న రైతులు పుష్పాల సాగు చేపడతారు. గతేడాది చివర్లో అధికమాసం కారణంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈ క్రమంలో ప్రస్తుత ఏడాదిపై గంపెడాశలు పెట్టుకుని పూల రైతులు సాగు విస్తీర్ణాన్ని పెంచారు. చాందిని, బంతి, చామంతి తదితర పుష్పజాతులను వేశారు. జిల్లాలో రైతులు సాగు చేసిన పూబంతులతోపాటు కర్ణాటక నుంచి సుమాలు గుడిమల్కాపూర్ మార్కెట్‌ను ముంచెత్తుతుండడంతో ధరలు పడిపోయాయి. కొనేవారు లేక రైతులు మార్కెట్లోనే పారబోసి వెళుతున్నారు. పూల కట్ట ధర రూ.10:ఇంట్లో జరిగే చిన్నపాటి శుభకార్యం మొదలు పెళ్లి మండపాల వరకు ఎక్కువగా జర్బరా, కార్నేషన్ పూలను అలంకరణ కోసం వాడుతున్నారు. ఈ సారి వీటి ధరలు నేల చూపులు చూస్తుండడంతో ఈ పూల సాగు చేపట్టిన రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. సాధారణంగా ఈ సీజన్లో పది పూల కట్ట ధర రూ.50 నుంచి రూ.100 పలుకుతుంది. ఇవి ప్రస్తుతం పది రూపాయలకే అమ్ముడుపోతున్నాయి. అకాల వర్షాలతో అపార న ష్టం: అర ఎకరంలో హైబ్రీడ్ బంతి సాగుకు రూ.30 వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. దిగుబడి ఆశాజనకంగా ఉన్నా గిట్టుబాటు ధరలు లేక ఆదాయం రావడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ముహుర్తాల రోజున కొంత ధరలు పలుకుతుండగా మిగతా రోజుల్లో రైతుల పూలను మార్కెట్లో పారబోసి వెళ్తున్నారు. వారం రోజుల నుంచి అడపాదడపా కురుస్తున్న అకాల వర్షాలు పూల పంటలపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. పెట్టుబడి 30 వేలు అయింది అర ఎకరంలో హైబ్రిడ్ బంతి సాగు చేశా. విత్తనాలు, కూలీలు, మందుల ఖర్చు రూ. 30 వేలు అయింది. ఇప్పటి వరకు పూలు అమ్మితే కేవలం రూ.2 వేలు వచ్చాయి. చేనులో నిండుగా పూలున్నాయి. ఏమి చేయాలో అర్థం కావడంలేదు. - తూర్పు జగన్‌రెడ్డి, అమ్డాపూర్ కూలీ ఖర్చులు రావడంలేదు.. పూలకు ధరలు లేక చాలా నష్టపోవాల్సి వస్తోంది. ఒక్కోసారి పూలు అమ్ముడుపోకుంటే మార్కెట్లోనే పారబోసి వస్తున్నాం. అర ఎకరంలో చాందిని సాగుచేస్తే కిలో రూ.10కి కూడా ఎవరూ అడగడంలేదు. వర్షాలకు పంట దెబ్బతిన్నది. పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చేలా లేవు. - కట్కూరి శ్రీశైలంగౌడ్, కె.బి.దొడ్డి, డిమాండ్ కంటే ఎక్కువ పంట డిమాండ్ కంటే ఎక్కువ దిగుబడి రావడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు చాందిని, బంతి పూల వాడకం తగ్గింది. జర్బరా, కార్నేషన్ పూల సాగు విస్తీర్ణం పెరిగి దిగుబడి బాగా ఉండడంతో ధరలు లేవు. - బూర్గు మహిపాల్‌రెడ్డి, వ్యాపారి,గుడిమల్కాపూర్ పూల మార్కెట్ ఒడిదుడుకులు సహజమే... ఇటీవల భారీగా పెరిగిన సాగు విస్తీర్ణంతో పూల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అయితే, అంతమాత్రాన దిగాలు పడాల్సిన పనిలేదు. వారం రోజుల్లో ధరలకు మళ్లీ రెక్కలొచ్చే అవకాశముంది. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో శుభకార్యాలు కూడా ఈ మధ్యకాలంలో తక్కువగా జరుగుతున్నాయి. రైతులు కుంగిపోవాల్సిన అవసరంలేదు. జూలై వరకు పూలకు గిరాకీ ఉంటుంది. - వేణుగోపాల్,జిల్లా ఉద్యానశాఖ సహాయసంచాలకులు