breaking news
Captain Shahid aphrid
-
‘ఆఫ్రిది సిగ్గుపడాలి’
కరాచీ: భారతీయులు కురిపిస్తున్న ప్రేమ తమ దేశంలో కూడా చూడలేదని పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలను మాజీ సారథి జావెద్ మియాందాద్ తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవమానకరమని, అలా చేసిన ఆటగాళ్లు తమకు తామే సిగ్గుపడాలని విమర్శించారు. ‘పాకిస్తాన్ జట్టు టి20 ప్రపంచకప్ ఆడేందుకు మాత్రమే భారత్‌కు వెళ్లింది. కానీ ఆటగాళ్లు ఆ దేశాన్ని ఆకాశానికి ఎత్తడానికి కాదు. అసలు భారతీయులు మనకు ఏం ఇచ్చారు? పాక్ క్రికెట్‌కు ఏమైనా చేశారా? పాక్ క్రికెట్‌కు ఎన్నో ఏళ్లు సేవలందించిన వ్యక్తిగా ఆఫ్రిది మాటలు విని షాక్‌కు గురయ్యా’ అని మియాందాద్ పేర్కొన్నారు. మరోవైపు పాక్ ప్రజల మనోభావాలు దెబ్బతీశాడంటూ ఆఫ్రిదికి ఓ సీనియర్ న్యాయవాది లీగల్ నోటీసు కూడా పంపారు. -
భారత్‌లో అభిమానం ఎక్కువ: ఆఫ్రిది
కోల్‌కతా: తమ జట్టుకు పాకిస్తాన్ కంటే భారత్‌లోనే ఎక్కువ ప్రేమ, అభిమానం లభిస్తుందని కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది అన్నాడు. భారత్‌లో భద్రతపై ఎప్పుడూ ఆందోళన చెందలేదన్నాడు. ‘ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఆడటాన్ని నేను ఎక్కువగా ఆస్వాదిస్తాను. భారత్‌లో నాకు లభించిన ఆదరణ ప్రత్యేకమైంది. దీన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటా. పాక్‌లో కూడా మాకు ఇంత ప్రేమ, అభిమానం లభించదు’ అని ఆఫ్రిది పేర్కొన్నాడు. పాక్‌తో పోలిస్తే భారత్‌లోనే క్రికెట్‌ను ఎక్కువగా ఆరాధించే అభిమానులున్నారని మరో క్రికెటర్ షోయబ్ మాలిక్ అన్నాడు.‘ఇక్కడ మాకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలి. నా భార్య భారత్ అమ్మాయి కావడంతో ఇక్కడికి చాలాసార్లు వచ్చా. నాకు ఎలాంటి భద్రతా సమస్యలు రాలేదు. ఇక్కడి ప్రజలు, మీడియా మాపై ఎనలేని ప్రేమ చూపెడుతున్నారు’ అని షోయబ్ మాలిక్ వెల్లడించాడు.