breaking news
Call drop problem
-
బ్రాడ్‌బ్యాండ్‌తో కాల్స్ చేసుకోండిలా..
న్యూఢిల్లీ : సిగ్నల్స్ సరిగ్గా ఉండటం లేదా..? మొబైల్ నెట్వర్క్ పనిచేయడం లేదా..? అయితే ఇక నుంచి మీ ఆఫీసులో లేదా ఇంట్లో ఉన్న వై-ఫై బ్రాడ్‌బ్యాండ్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టేయొచ్చట. బ్రాడ్‌బ్యాండ్‌తో మొబైల్ ఫోన్లకు, అదేవిధంగా ల్యాండ్లైన్లకు కాల్స్ చేసుకునేలా ప్రతిపాదనలు రూపొందాయి. దేశంలో ఇంటర్నెట్ టెలిఫోనీకి అనుమతించేందుకు రూపొందించిన ప్రతిపాదనలకు మంగళవారం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనల ప్రకారం టెలిఫోనీ లైసెన్స్‌ను పొందే టెలికాం ఆపరేటర్లు, ఇతర కంపెనీలు సిమ్ అవసరం లేని కొత్త మొబైల్ నెంబర్‌ను ఆఫర్ చేయనున్నాయి. ఇంటర్నెట్ టెలిఫోనీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఈ సర్వీసులను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. గత అక్టోబర్‌లోనే టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఈ ప్రతిపాదనలను రూపొందించింది. కాల్ డ్రాప్స్ సమస్యతో బాధపడుతున్న వినియోగదారుల కోసం ఈ కొత్త కనెక్టివిటీ ఆప్షన్లను తీసుకొచ్చింది. అంతర్ మంత్రిత్వ టెలికాం కమీషన్ కూడా ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ ఆమోదంతో ఇక రిలయన్స్జియో, బీఎస్ఎన్, ఎయిర్టెల్ లాంటి టెలికాం ఆపరేటర్లు ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసులను ప్రారంభించుకోవచ్చు. ఈ కొత్త కనెక్టివిటీ ఆప్షన్లతో యూజర్లకు ఎంతో మేలు చేకూరనుందని ట్రాయ్ పేర్కొంది. టెలికాం సిగ్నల్స్ బలహీనంగా ఉన్నప్పటికీ, వై-ఫై అందుబాటు చాలా బలంగా ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ సర్వీసుల కోసం యాక్టివేట్ చేసుకునే టెలిఫోనీ ఒక ఆఫరేటర్ది, మొబైల్ నెంబర్ మరో ఆపరేటర్‌ది అయితే, డౌన్లోడ్ చేసుకునే ఇంటర్నెట్ టెలిఫోనీ యాప్ ఆపరేటర్ నెంబర్‌నే యూజర్లు పొందాల్సి ఉంటుంది. డౌన్లోడ్ యాప్, సర్వీసు ప్రొవైడర్ ఒకే ఆపరేటర్‌ది అయితే నెంబర్ మార్చుకోవాల్సినవసరం లేదని ట్రాయ్ అధికారులు చెప్పారు. -
కాల్ డ్రాప్స్ సమస్య తగ్గింది: కేంద్రం
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ సమస్య గడచిన రెండు నెలలుగా గణనీయంగా తగ్గిందని టెలికం మంత్రి మనోజ్ సిన్హా శుక్రవారం పేర్కొన్నారు. అయితే సేవల నాణ్యత మరింత పెరగాలని ఆపరేటర్స్‌కు ఆయన సూచించారు. లేదంటే పోటీపూర్వక మార్కెట్లో నిలదొక్కుకోవడం కష్టమని ఒక ఇంటర్వ్యూలో అన్నారు. రానున్న స్పెక్ట్రమ్ వేలం ఆపరేటర్స్‌కు మరిన్ని రేడియోవేవ్స్ అందుబాటులోకి తెస్తుందని పేర్కొన్న మంత్రి, సేవల మెరుగుదల, ఆదాయాల పెం పునకు ఇది మార్గం సుగమం చేస్తుందని వివరించారు. రానున్న మూడు-నాలుగు నెలల్లో సేవల్లో నాణ్యత మరింత మెరుగుపడుతుం దన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ దిశలో ఫలితాలను సాధించుకోడానికి కంపెనీలు రానున్న స్పెక్ట్రమ్ ఆక్షన్‌లో కంపెనీలు ఉత్సాహంగా పాల్గొంటాయన్న అభిప్రాయాన్నీ ఆయన వ్యక్తం చేశారు. స్పెక్ట్రమ్‌లో పాల్గొనని కంపెనీలు సేవల మెరుగుదలలో తమ లక్ష్యాలను చేరలేవని కూడా మంత్రి పేర్కొన్నారు. వచ్చే నెల నుంచీ ప్రారంభం కానున్న స్పెక్ట్రమ్ వేలం ఇప్పటివరకూ జరిగిన వేలంలో అతి భారీదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.