breaking news
Breast Cancer Centers
-
కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ సెంటర్‌ను సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులు
హైదరాబాద్: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, ఈ రంగంలో సేవలందిస్తున్న ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు కొందరు సందర్శించారు.వీరికి కిమ్స్ గ్రూప్ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ, “మా ఆస్పత్రిని సందర్శించిన మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులందరికీ సాదర స్వాగతం. డాక్టర్ రఘు రామ్ చేపట్టిన ప్రతి పని 100% విజయాల రేటుతో చేస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా ఆయన్ను నేను దగ్గరగా చూస్తున్నాను. మాతృ ప్రేమ, మాతృభూమి పట్ల ప్రేమ అతనిని యూకే నుంచి భారత్‌కు తిరిగి తీసుకొచ్చింది, అక్కడ ఆయన అనేక ఆవిష్కరణాత్మక కార్యక్రమాల ద్వారా క్యాన్సర్ చికిత్స తీరును సమూలంగా మార్చాలన్న లక్ష్యంతో కృషిచేస్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలు. దేశానికి ఆయన చేసిన అందమైన సేవలకు మరిన్ని విజయాలు దక్కుతాయి” అని ఆకాంక్షించారు.మిస్ వరల్డ్ 2025 బృందానికి మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్మన్, సీఈఓ మిస్ జూలియా మోర్బీ నేతృత్వం వహించారు. గత 18 సంవత్సరాలలో ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజ్ సెంటర్ కిమ్స్ ఆస్పత్రుల ద్వారా చేసిన సేవలను కొనియాడారు. ఇక్కడకు హాజరైన పలువురు వైద్యనిపుణులను ఉద్దేశించి మిస్ జూలియా మోర్బీ మాట్లాడుతూ, “డాక్టర్ రఘు రామ్ హైదరాబాద్‌లో దక్షిణ ఆసియాలోనే మొదటిసారిగా ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో తన సొంత ఆలోచనలతో రూపొందించిన ఈ అసాధారణ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం ద్వారా అద్భుతమైన నాయకత్వ పటిమను చాటి చూపించారు. త్వరగా గుర్తించడం ద్వారా 18 ఏళ్లు దాటిన అనేక మంది మహిళల ప్రాణాలను కాపాడేందుకు గణనీయమైన కృషిని ఆయన చేశారు. భారతదేశం, బ్రిటన్ల మధ్య సజీవ వంతెనగా అనేక మార్గాల్లో ఆయన నిలిచారు. భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ చికిత్సకు అపారమైన సేవలు అందిస్తున్నారు” అని తెలిపారు.నందిని గుప్తా (మిస్ ఇండియా 2025), హన్నా జాన్స్ (మిస్ నార్తరన్ ఐర్లండ్ 2025) ఇస్సీ ప్రిన్సెస్ (మిస్ కామెరూన్- మధ్య ఆఫ్రికా), రొమ్ము క్యాన్సర ప్రచారకర్త డాక్టర్ నియోమి మైల్న్ (మిస్ గౌడెలోప్ 2025- ఫ్రాన్స్),డాక్టర్ ఇదిల్ బిల్గెన్ (యూఎస్ఏ) తదితరులంతా డాక్టర్ రఘురామ్ సేవలను ప్రశంసించారు. తన తల్లి డాక్టర్ ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ప్రయాణంతో స్ఫూర్తి పొందిన ఆయన.. ఇలా దేశంలో చాలామందికి అసవరమైన రొమ్ము క్యానన్సర్ అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. తమ తమ దేశాల్లో రొమ్ము క్యాన్సర్ అవగాహనకు చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పారు. డాక్టర్ రఘురామ్ అద్భుతంగా ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ నుంచి తాము చాలా తెలుసుకున్నామని, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ అమలు చేసిన ప్రయత్నాలను తమ స్వదేశంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.ఈ సదర్భంగా కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ, “కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ బ్రెస్ట్ డిసీజెస్ కేంద్రంలో నాణ్యమైన సమయం గడిపేందుకు ముందుకొచ్చిన మిస్ ఇండియా పోటీదారుఉల, మిస్ జూలియా మార్లీలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా పవర్ పాయింట్ ప్రజంటేషన్ గురించి గుండెలకు హత్తుకునేలా చెప్పారు.గత 18 ఏళ్లుగా నేను చేస్తున్న కృషి అందులో ఉంది. మా అమ్మ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రయాణమే నాకు స్ఫూర్తినిచ్చింది. నా సహోద్యోగులు, స్నేహితులు, ప్రభుత్వం అంతా నాకు ఇంతకాలం కావాల్సిన మద్దతు, మార్గదర్శకత్వం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. రొమ్ము క్యాన్సర్‌ను త్వరగా గుర్తిస్తే చాలా జీవితాలను కాపాడవచ్చు. నా మాతృభూమిలో రొమ్ము క్యాన్సర్ చికిత్సలను మెరుగుపచాలన్న నా లక్ష్యానికి జీవితాన్ని అంకితం చేస్తున్నాను” అని తెలిపారు.ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి, క్యాన్సర్ విజేత డాక్టర్ ఆనంద్ శంకర్ జయంత్ మాట్లాడుతూ, “డాక్టర్ రఘురామ్ వద్ద చికిత్స పొందడం నా అదృష్టం. నాకు అందిన అసాధారణ నాణ్యత గల చికిత్స, సానుభూతితో కూడిన సంరక్షణ, చికిత్స కొనసాగినన్నాళ్లు ఆయన నాకు చేసిన కౌన్సెలింగ్ వల్లనే నేను క్యాన్సర్ విజేతగా నిలిచాను. నా ఈ పయనంలో డాక్టర్ రఘురామ్ నాకు స్ఫూర్తినిచ్చి, సానుకూలంగా ఉండేలా చేయడం నాకెంతో సంతృప్తినిచ్చింది. క్యాన్సర్ రోగుల్లో ఒక ఆశను పాదుకొల్పి, త్వరగా గుర్తించాల్సిన అవసరం గురించి అవగాహన నెలకొల్పి, దాదాపు రెండు దశాబ్దాలుగా కృషిచేస్తున్న డాక్టర్ రఘురామ్ సేవలను ప్రశంసిస్తున్నాను”అని చెప్పారు. -
పద్మసిరులు
వైద్యరంగ సరోవరంలో వికసించిన పద్మాలివి. మనకు లభించిన పద్మసిరివరాలివి. భారత ప్రభుత్వ గుర్తింపు పొంది పద్మ‘సిరి’ని సొంతం చేసుకున్న చికిత్సా శస్త్రాలివి. ఈ ఇద్దరి సేవలూ మహిళల కోసమే కావడం మరో విశేషం. ఒకరు మహిళల ‘గైనిక్’ సమస్యలను తీర్చే నిపుణీమణి. మరొకరు ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సర్ గడ్డలను తొలగించే వైద్య శిఖామణి. భారత ప్రభుత్వం బహూకరించే ప్రతిష్టాత్మక అవార్డు అయిన ‘పద్మశ్రీ’ ఈ ఇద్దరూ అందుకున్నారు. అత్యున్నత పురస్కారాల్లో మొదటిదైన ఈ గౌరవం దక్కించుకున్న సందర్భంగా ప్రముఖ వైద్యురాలు, గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల అనగాని, ప్రముఖ రొమ్ము క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రఘురామ్ ‘సాక్షి’ ప్రతినిధితో పంచుకున్న భావాలివి. వైవిధ్యమే విజయసోపానం ఒకవైపు వైద్య సేవలు అందిస్తూనే 2000 సంవత్సరంలో రోటేరియన్‌గా మారి విస్తృతంగా పర్యటనలు చేస్తూ సమాజాన్ని చాలా దగ్గరగా చూశాను. నాకు అర్థమైన విషయం ఏమిటంటే... విద్యాధికుల్లో సైతం తమ శరీరం పట్ల ఏవో అపోహలు ఉంటున్నాయి. పిల్లలు పుట్టాక గర్భసంచిని చాలామంది మహిళలు ఒక అనవసరమైన అవయవంగా భావిస్తున్నారు. అది ‘వేస్ట్ ఆర్గాన్’ ఎంత మాత్రమూ కాదు. ఎంతో విలువైన ఆ భాగాన్ని ఏ క్యాన్సర్ ఉంటేనో తప్ప... అనవసరంగా కత్తిగాటుకు బలి చేయవద్దనే సందేశాన్ని అందించాను. హిస్ట్రెక్టమీ ఆపరేషన్లపై అవగాహన కలిగించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాను. ప్రివెంటివ్ గైనకాలజీ గుండెజబ్బుల వంటివి నివారించుకోవాలంటే సక్రమమైన జీవనశైలిని ఆచరించాలనే స్పృహ చాలామందిలో ఉంది. కానీ ‘గైనకాలజీ’ లోనూ ఈ విధమైన ‘నివారణ’ చర్యలు తీసుకోవచ్చనే అవగాహన సమాజంలో లేదు. మెనోపాజ్‌కు చేరగానే కొన్ని హార్మోన్లు మనకు దూరమవుతాయనీ, దానివల్ల స్వాభావిక రక్షణ పోతుందనీ... కాబట్టి... స్వాభావికమైన ఆ సురక్షిత చర్యలను ముందునుంచే పొంది కొన్ని జబ్బులను నివారించుకోవచ్చనే అవగాహన సాధారణంగా ఉండదు. అందుకే ‘ప్రివెంటివ్ గైనకాలజీ’ భావనను మహిళల్లోకి విశేషంగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాను. ‘మామ్ అండ్ మీ’ స్కూళ్లల్లోని కౌమార బాలికలకు తమ శరీరం మీద తమకు అవగాహన కలిగేలా చేయడం కోసం కృషిచేస్తున్నాం. ఇందుకోసం మేం కొంతమందిమి ఒక బృందంలా ఏర్పడి ‘మామ్ అండ్ మీ’ అనే సంస్థను ఏర్పాటు చేశాం. తలిదండ్రుల సమక్షంలోనే తరుణవయస్కులైన పిల్లలకు అనేక అంశాలమీద, తమకు ఆ వయసులో కలిగే సమస్యల మీద అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం. రోజుల బిడ్డల కోసం ‘ప్రత్యూష’ నెలలు పూర్తిగా నిండకముందే ప్రవసం కావడమో లేదా ఉమ్మనీరు మింగేసి పుట్టడమో జరిగితే, వారికి తక్షణం వైద్యసదుపాయాలు అవసరమవుతాయి. అలాంటి పిల్లలకు అవసరమైన ఆ సదుపాయాలను రెండు మూడు రోజులపాటు అందిస్తే చాలు... వాళ్లు నిండునూరేళ్లూ బతికేస్తారు. సాధ్యమైనంత మేరకు అలాంటి సహాయం అందించేందుకు నేనూ, సినీనటి సమంత, నిర్వాహకురాలు శశి మంధా కలిసి ‘ప్రత్యూష’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాం. శస్త్రచికిత్స సదస్సులు శస్త్రచికిత్స కోసం ఉపయోగించే ఉపకరణాలన్నీ పురుషులకు అనువుగా తయారైనవే. ఓ మహిళా వైద్యురాలి దగ్గర ఎంతగా విజ్ఞానం ఉన్నా సరైన ఉపకరణాలు లేకపోతే శస్త్రచికిత్సలు సమర్థంగా నిర్వహించడం సాధ్యం కాదు కదా. అందుకే ఎర్గానమిక్స్ (పనిచేసేందుకు సులువుగా ఉండటం) పరంగా మహిళలకు అనువైన విధంగా శస్త్రచికిత్స ఉపకరణాలు రూపొందించడంతో పాటు వాటిని సౌకర్యంగా ఉపయోగించడంలో వర్క్‌షాప్‌లు నిర్వహించి, మహిళా వైద్యులకు శిక్షణను ఇస్తున్నాం. అంతేకాదు, ఇప్పుడు అధునాతన శస్త్రచికిత్సలతో పూర్తిగా కోతపెట్టి చేసే ఓపెన్ సర్జరీల స్థానంలో కేవలం రెండు మూడు గాట్లు పెట్టి చేసే మినిమల్ ఇన్వేజివ్ శస్త్రచికిత్సలు చేయించుకునే విషయంలోనూ అవగాహన కల్పిస్తున్నాం. దీనివల్ల అన్ని రిస్క్‌లూ తక్కువ. ఆసుపత్రిలో ఉండాల్సిన వ్యవధి దగ్గర్నుంచి, కోత గాయం మానే వరకూ త్వరగా కోలుకొని, తమ వృత్తులను నిర్వహించుకోవచ్చు. మూసలోకి వెళ్లకండి ఇప్పుడే వృత్తిలోకి వస్తున్న డాక్టర్లకు నేనిచ్చే సలహా ఏమిటంటే- ఎప్పుడూ మూసపద్ధతిలో ఆలోచించకండి. అప్పటికి, అక్కడ ఉన్న పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి. అలా తీసుకున్న నిర్ణయాలను సృజనాత్మకంగా అమలు చేయండి. విజయం తప్పక మీ సొంతం అవుతుంది. అమ్మకోసం జన్మభూమికి... నేను ఇంగ్లండ్‌లో వైద్యుడిగా స్థిరపడ్డ సమయంలో మా అమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ రావడంతో 2007లో ఇక్కడికి వచ్చా. ఆమెకు చికిత్స ఇచ్చే సమయంలో నా మాతృదేశంలో రొమ్ము క్యాన్సర్ రోగుల పరిస్థితిని చూసి, ఇంగ్లండ్‌లో కంటే నా అవసరం ఇక్కడే ఎక్కువగా ఉందని గ్రహించా. రొమ్ముక్యాన్సర్‌లో ఏటా లక్షా నలభై వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రతి పదినిమిషాలకు ఒక మరణం సంభవిస్తోంది. ఈ చేదు నిజాలు తెలుసుకున్న తర్వాత... బ్రెస్ట్ ఆంకాలజీ సర్జన్‌గా ఇక్కడే సేవలు అందించడం ప్రారంభించాను. నా దృష్టి కోణమే వేరు అందరూ తమ చికిత్స కేంద్రాలను ‘బ్రెస్ట్ క్యాన్సర్ సెంటర్స్’గా పేర్కొంటారు. కానీ నేను మొదటిసారిగా ‘బ్రెస్ట్ హెల్త్ కేర్ సెంటర్’గా మార్చాను. ఇది క్యాన్సర్‌కు చికిత్స చేసేది మాత్రమే కాదు... పూర్తిగా రొమ్ము ఆరోగ్యాన్ని పరిరక్షించే చికిత్సాలయం కూడా. దాంతో ఈ కాన్సెప్ట్ నచ్చి, ఎంతో ప్రఖ్యాతి వహించిన కోకిలాబెన్, మేదాంతా హాస్పిటల్ వాళ్లు ఇదే మార్గాన్ని అనుసరించారు. ఇలా ఎన్నో ఆసుపత్రులు అనుసరించేలా ఒక ప్రామాణికత (బెంచ్‌మార్క్)ను రూపొందించడం నాకెంతో సంతోషంగా ఉంటుంది. అమ్మ పేరిట ఫౌండేషన్ మా అమ్మ పేరిట ఉషాలక్ష్మీ ఫౌండేషన్‌ను స్థాపించి రొమ్ము క్యాన్సర్ రోగులకు సేవలందించడం మొదలుపెట్టాను. నా ప్రయత్నంలో రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన కలిగించడానికి సినీనటి గౌతమి, యశ్‌చోప్రా సతీమణి పమేలా చోప్రా, శోభాడే, పూజాబేడీ, షబానా ఆజ్మీ వంటి ప్రముఖులు పాలుపంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాల వారి కోసం... పల్లెప్రాంతాల్లోని మహిళలకు రొమ్ముక్యాన్సర్ విషయంలో అవగాహన చాలా తక్కువని తెలుసుకున్నాను. మొదటి దశలోనే దీన్ని కనిపెట్టే స్క్రీనింగ్ ప్రక్రియలు వారికి తెలిపితే..? ఆ ఆలోచన వచ్చిందే తడవుగా 2013లో రాష్ట్రంలోని ఏఎన్ఎమ్ (ఆరోగ్య కార్యకర్త)లకు రొమ్ముక్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం ఎలాగో నేర్పించడం ప్రారంభించాం. ఇప్పుడు ఉమ్మడిరాష్ట్రం విడిపోయాక... తెలంగాణ మహిళా సమతా సొసైటీ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమతా సొసైటీల పేరిట ప్రయోగాత్మకంగా 15 జిల్లాలలో స్క్రీనింగ్ చేయడం నేర్పించాం. దీని ఫలితం బాగా కనిపించింది. ఎన్నో మరణాల నివారణ జరిగింది. దశాబ్దకాల ప్రణాళిక ఇరు రాష్ట్రాల్లో ఉన్న ఏఎన్ఎమ్లందరికీ శిక్షణ ఇవ్వగలిగితే... అధిక సంఖ్యలో రొమ్ముక్యాన్సర్లను ముందే పసిగట్టగలిగితే ఎంతోమందిని మృత్యువు కోరల నుంచి తప్పించవచ్చు. అందుకే కేంద్ర ఆరోగ్య మంత్రిని కలిసి... వారి ‘నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రోగ్రామ్’తో, నా ‘పాప్యులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ కార్యక్రమా’న్ని కూడా అనుసంధానం (ఇంటిగ్రేట్) చేస్తే... ఎంతోమంది రోగులకు రక్షించినవాళ్లమవుతాం. వచ్చే పదేళ్ల పాటు ఈ కార్యక్రమంతో ఎంతోమంది రొమ్ముక్యాన్సర్ రోగులను రక్షించాలన్నదే నా ప్రణాళిక. ఇతర సర్జన్లతో కలిసి... 2011లో ‘అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా’ అనే ఒక సంస్థను స్థాపించాం. ఈ ఏడాది దాని అధ్యక్షుడిగా నేను ఎంపికయ్యా. 2015 నుంచి 2017 వరకు కొనసాగే నా పదవీకాలంలో అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాలలో ఉన్న అక్కడి డాక్టర్లకూ నా కాన్సెప్ట్స్ వివరించే అవకాశం నాకు దక్కింది. విదేశీయులకూ మన చికిత్సా, నివారణా పద్ధతులను నేర్పి ప్రపంచంలోని కొన్ని దేశాల మహిళలను రొమ్ముక్యాన్సర్ బారినుంచి కాపాడే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. రొమ్ముకాన్సర్ అంటే అక్కడి గడ్డను తొలగించడం మాత్రమే కాదు... రొమ్మును మునపటిలాగే మళ్లీ పునర్నిర్మించడం వంటి ఆంకోప్లాస్టిక్ పరిజ్ఞానాన్ని పంచడానికి ప్రయత్నిస్తున్నాను. నలుగురికి రుణపడి ఉన్నాను పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు ప్రధానంగా నేను నలుగురికి రుణపడి ఉన్నాను. మొదటిది నా కుటుంబం. రెండోవారు నా తల్లిదండ్రులు. మూడోవారు నా ఉపాధ్యాయులు. వారెప్పుడూ నన్ను వైవిధ్యంగా ఉండమనీ, విభిన్నంగా ఆలోచించమనీ ప్రోత్సహించారు. ఈ సమస్యను ఇలా వైవిధ్యంగా ఎందుకు పరిష్కరించకూడదు, ఇలా ఎందుకు ప్రయత్నించకూడదు... అంటూ నేనెంత భిన్నంగా ఆలోచిస్తే అంతగా ప్రోత్సహించారు నా ఉపాధ్యాయులు. ఇక నాలుగోవారు నా పేషెంట్లు. ఎన్నో రుగ్మతల చికిత్స కోసం, ఎన్నో వ్యాధులను దూరం చేయడం కోసం నాకు వచ్చిన ‘ఔటాఫ్ ద బాక్స్’ ఆలోచనలను తమకు చేసే చికిత్సలలో అనుమతించి, నన్ను ప్రోత్సహించారు. ఈ నలుగురూ నా అభివృద్ధికి సోపానాలు. అందుకే వారికి నేనెంతో రుణపడి ఉంటాను. - డాక్టర్ మంజుల అనగాని, సన్‌షైన్ హాస్పిటల్స్ డాక్టర్‌కి సేవాభావం ఉండాల్సిందే! ఒక డాక్టర్ తాను పరిపూర్ణ వైద్యుడిగా రూపొందాక సేవచేయడమే తన ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుంటానంటూ హిప్పోక్రాటిక్ ఓత్ అనే ప్రతిజ్ఞ చేస్తాడు. డాక్టర్ అంటే అతడికి అత్యున్నతస్థాయి నైతిక విలువలు ఉండాలి. సేవ చేయడంలోనూ ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని, దాన్ని అధిగమించడానికి కృషి చేయాలి. ఈ సేవా తపన లేకపోతే ఈ వృత్తిలో ఉండటం సరికాదు. ఎందుకంటే... మనమీద అంత నమ్మకం ఉండబట్టే కదా... ఒక రోగి తన ప్రాణాలను మన చేతుల్లో పెడతాడు. అలాంటి అవకాశం ఉన్న వృత్తి కాబట్టే దీన్ని పవిత్రవృత్తి (నోబుల్ ప్రొఫెషన్)గా అందరూ పేర్కొంటారు. అందుకే ఎంతగా వీలైతే సమాజానికి డాక్టర్ అంతగా సేవలందించాలి. - డాక్టర్ రఘురామ్, కిమ్స్ హాస్పిటల్