breaking news
brahmaramba ammavaru
-
తుమ్మెదల సైన్యంతో రాక్షసుడుని అంతమొందించింది కాబట్టే..
పూర్వం అరుణుడు అనే అసురుడు ఉండేవాడు. అతడు పాతాళవాసి, మహా క్రూరుడు. దేవతలంటే అతడికి బద్ధవిరోధం. దేవతలను జయించాలనే సంకల్పంతో బ్రహ్మ కోసం తపస్సు చేయాలనుకున్నాడు. హిమాలయాల దిగువన గంగాతీరంలోని ఏకాంత ప్రదేశంలో ఘోర తపస్సు ప్రారంభించాడు. గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నీరు మాత్రమే తాగుతూ పదివేల ఏళ్లు తపస్సు సాగించాడు. కేవలం గాలి మాత్రమే పీల్చుతూ మరో పదివేల ఏళ్లు తపస్సు సాగించాడు. అతడి తపోగ్రత అంతకంతకు పెరిగి అతడి శరీరం నుంచి మంటలు వెలువడి, లోకాలను దహించడం ప్రారంభించాయి. అరుణుడి తపోగ్రత నుంచి వెలువడిన మంటలు లోకాలను దహిస్తూ ఉండటంతో దేవతలు భీతావహులై, పరుగు పరుగున బ్రహ్మదేవుడి వద్దకు చేరుకున్నారు. దేవతల మొరను ఆలకించిన బ్రహ్మదేవుడు గాయత్రీ సమేతంగా హంసవాహనాన్ని అధిరోహించి అరుణుడి వద్దకు బయలుదేరాడు. అరుణుడి ముందు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన సమయానికి అతడు బొందిలో ప్రాణం మాత్రమే మిగిలి, ఎముకల పోగులా మిగిలి ఉన్నాడు. బ్రహ్మదేవుడు అతడిని చూసి, ‘వత్సా! ఏమి నీ కోరిక’ అన్నాడు. బ్రహ్మదేవుడి నోట ఆ మాట వినగానే అరుణుడు ఆనందపరవశుడయ్యాడు. బ్రహ్మదేవుడి ముందు మోకరిల్లి, నానా విధాలుగా స్తుతించాడు. ‘దేవా! నాకు మరణం లేకుండా వరమివ్వు’ అని అడిగాడు. ‘నాయనా! జీవులకు కాలధర్మం తప్పదు. అది తప్ప ఇంకేదైనా వరమడుగు, తీరుస్తాను’ అన్నాడు బ్రహ్మదేవుడు. ‘అయితే, యుద్ధంలో నాకు శస్త్రాస్త్రాల వల్ల గాని, స్త్రీ పురుషుల వల్ల గాని, రెండుకాళ్ల, నాలుగుకాళ్ల జంతువులతో గాని, రెండు ఆకారాల ప్రాణులతో గాని చావు కలగకుండా వరమివ్వు’ అన్నాడు. ఇదివరకటి రాక్షసులు హతమారిన సందర్భాలను గుర్తుచేసుకుని, అరుణుడు ఎంతో తెలివితో అడిగిన ఈ వరానికి బ్రహ్మదేవుడు ‘తథాస్తు’ అంటూ సమ్మతించాడు. బ్రహ్మదేవుడి నుంచి వరం పొందిన తర్వాత అరుణుడు తిరిగి పాతాళానికి వెళ్లాడు. అక్కడ అసురులందరినీ సమావేశపరచి, బ్రహ్మదేవుడి ద్వారా తాను సాధించిన వరాన్ని గురించి చెప్పాడు. ఆనందభరితులైన అసురులు అరుణుడిని తమ పాలకుడిగా ఎన్నుకున్నారు. వెంటనే అరుణుడు స్వర్గానికి తన దూతను పంపాడు. ‘స్వర్గాన్ని తక్షణమే విడిచిపెట్టి వెళ్లిపోవాలి. లేదా అరుణుడితో యుద్ధానికి సిద్ధపడాలి’ అని ఆ దూత తెచ్చిన సందేశానికి ఇంద్రుడు భయకంపితుడయ్యాడు. ఇంద్రుడు దేవతలతో కలసి బ్రహ్మ వద్దకు వెళ్లాడు. వారు విష్ణువు వద్దకు వెళ్లారు. తర్వాత అందరూ కలసి కైలాసానికి వెళ్లి, పరమేశ్వరుడికి పరిస్థితిని వివరించి, ఆపద నుంచి గట్టెక్కించమని కోరారు. ‘బ్రహ్మదేవుడు అతడికి ఇచ్చిన వరం వల్ల మనమెవ్వరమూ అతణ్ణి ఏమీ చేయలేము. అందువల్ల త్రిభువనేశ్వరి అయిన జగజ్జననిని శరణు కోరుదాం. ఆమె మాత్రమే రక్షించగలదు’ అన్నాడు శివుడు. దేవతలందరూ జగజ్జనని అయిన ఆదిశక్తిని ప్రార్థించారు. వారి మొరను ఆలకించిన ఆమె, ‘అరుణుడు నిత్యం గాయత్రీ మంత్రాన్ని జపిస్తుంటాడు. ఆ జపాన్ని విరమింపజేసినట్లయితే వాడికి చావు మూడుతుంది’ అని పలికింది. జగజ్జనని చెప్పిన తరుణోపాయాన్ని నెరవేర్చడానికి దేవేంద్రుడు దేవతల తరఫున బృహస్పతిని అరుణుడి వద్దకు పంపాడు. బృహస్పతి అరుణుడి వద్దకు వెళ్లాడు. అరుణుడు అతడికి స్వాగతం పలికాడు. ‘మునివరా! ఎక్కడి నుంచి రాక. అయినా నేను మీ పక్షపాతిని కాదు, నీవు మా పక్షపాతివి కాదు. నేను దేవేంద్రుడికి, దేవతలకు శత్రువునని నీవెరుగుదువు కదా’ అన్నాడు. ‘అదంతా సరే, నువ్వూ గాయత్రీ మంత్రజపం చేసేవాడివే, నేనూ గాయత్రీ మంత్రజపం చేసేవాడినే! కాబట్టి నువ్వు మా పక్షపాతివి ఎందుకు కావు?’ అన్నాడు బృహస్పతి. అహం దెబ్బతిన్న అరుణుడు ‘నా శత్రువైన నీవు జపించే మంత్రం నాకెందుకు’ అంటూ గాయత్రీజపాన్ని వదిలేశాడు. వచ్చిన పని నెరవేరడంతో బృహస్పతి అక్కడి నుంచి వెనుదిరిగాడు. వరకారణమైన గాయత్రీమంత్రాన్ని వదిలేసిన తర్వాత అరుణుడు తేజోహీనుడయ్యాడు. దేవతలందరూ తిరిగి జగజ్జననిని ప్రార్థించారు. జగజ్జనని తమ్మెదలు మూగిన పూలమాలలతో ప్రత్యక్షమైంది. తుమ్మెదల సైన్యాన్ని అరుణుడి మీదకు పంపింది. కోటాను కోట్ల తుమ్మెదలు భీషణ ఝుంకార ధ్వనులు చేస్తూ అరుణుడి మీద దాడి చేశాయి. అరుణుడి అసుర సేనలను కుట్టి కుట్టి హతమార్చాయి. తుమ్మెదల దండయాత్రలో అరుణుడు అంతమొందాడు. భ్రమరాలతో రాక్షస సంహారం చేసిన జగజ్జనని భ్రామరీదేవిగా పూజలందుకుంది. -
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు సోమవారం ఉదయం యాగశాల ప్రవేశంతో ప్రారంభం కానున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా ఈ ఉత్సవాల్లో అమ్మవారికి నవదుర్గ అలంకారాలు, ప్రత్యేక నవావరణపూజలు, స్వామి అమ్మవార్లకు వాహనసేవలు, చండీయాగం, రుద్రయాగం నిర్వహించనున్నారు. దసరా మహోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీశైల భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజల అనంతరం అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తారు. -
గుండుగొలను భ్రమరాంబ అమ్మవారికి సారె
పిఠాపురం : పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలనులో కొలువుదీరిన భ్రమరాంబ అమ్మవారికి పిఠాపురం పాదగయ క్షేత్రంలో వేంచేసియున్న పురూహూతికా అమ్మవారి సారె సమర్పించినట్టు ఆలయ ఈఓ చందక దారబాబు తెలిపారు. గుండుగొలను భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో ఐదు రోజులుగా జరుగుతున్న కోటి కుంకుమార్చనకు అమ్మవారి శక్తి పీఠాల నుంచి సారెలు పంపుతుండగా, ఐదో రోజు ఇక్కడి నుంచి సారె సమర్పించినట్టు చెప్పారు. దేవస్థానం తరపున పసుపు, కుంకుమ చీరలను భ్రమరాంభ అమ్మవారికి సమర్పించి, ప్రత్యేక పూజలు చేయించినట్టు ఆయన తెలిపారు.