breaking news
beef exports
-
పాపం.. బలి‘పశువులు’
సాక్షి, పిఠాపురం (తూర్పు గోదావరి): పశుగ్రాసం కొరత, వ్యాధులు పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు పశువులను మేప లేక తెగనమ్ముకుంటున్నారు. దీంతో రోజూ వందలాది పశువులు వధించి వందలాది టన్నుల పశు మాంసం రవాణా భారీగా సాగుతోంది. ఇటీవల పశు మాంసంతో వెళుతున్న టాటా ఏస్ వ్యాన్ ఒక వ్యక్తిని గొల్లప్రోలు మండలం తాటిపర్తి రోడ్డులో ఢీకొట్టిన సంఘటనతో పశు మాంసం తరలిస్తున్న విషయం బయటపడింది. ఇతర జిల్లాల నుంచి ఎక్కువ మొత్తంలో పశు మాంసం నియోజకవర్గం మీదుగా తరలిస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల నుంచి పదుల సంఖ్యలో లారీల్లో పశు మాంసాన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. హైవేపై వెళితే ఇబ్బందులు వస్తాయని తుని నుంచి పిఠాపురం నియోజకవర్గం మీదుగా తరలిస్తున్నారు. టన్నుల కొద్దీ రవాణా రోజూ నియోజకవర్గం నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి పశు మాంసం లారీలపై టన్నుల కొద్దీ తరలిస్తున్నారు. పోలీసులు ముడుపులు తీసుకుని పట్టుకున్న మాంసం కొంత ధ్వంసం చేసి మొక్కుబడిగా కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పట్టుబడిన మాంసంలో అధిక శాతం వ్యాపారులు తిరిగి తీసుకువెళ్లేలా లాబీయింగ్ సాగుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. రెండు నెలల్లో పది లారీలకు పైగా పశు మాంసాన్ని పోలీసులు పట్టుకున్నారు. తాజాగా కొత్తపల్లి పోలీసులు సోమవారం ఒక కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న ఆరుటన్నుల పశుమాంసాన్ని, కంటైనర్‌ను స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఆ మాంసాన్ని ఉప్పాడ తీరంలో పూడ్చిపెట్టారు. ఎక్కడ చూసినా అక్రమ కబేళాలే గొల్లప్రోలు మండలం చెందుర్తి, కొడవలి, తదితర గ్రామాలతో పాటు పిఠాపురం పట్టణ నడిబొడ్డున అక్రమ కబేళాలు ఉన్నట్టు సమాచారం. చీకటి పడితే జనరేటర్ల లైట్ల వెలుగులో పశు వధ ప్రారంభమవుతుందని, పశువుల తలలు ఎండిన తరువాత దుమ్ములు, కొమ్ములను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్టు తెలుస్తోంది. 216 జాతీయ రహదారి పక్కనే ఉండడంతో రవాణాకు వీలుగా ఈ ప్రాంతాలను అడ్డాలుగా చేసుకున్నారు. కబేళాల్లో ఎక్కువగా గోవులు, లేగ దూడలను వధిస్తున్నట్టు పలువురు చెబుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం అక్రమ కబేళాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. దాడులు ముమ్మరం చేశాం. అక్రమంగా తరలిస్తున్న పశువులను స్వాధీనం చేసుకుంటున్నాం. పలువురిపై కేసులు నమోదు చేశాం. అనుమానితులను పిలిపించి హెచ్చరికలు జారీ చేశాం. పిఠాపురం పశువుల సంతలో ప్రతి శనివారం పోలీసులను ఏర్పాటు చేసి పాడి పశువులను తప్ప కొనుగోళ్లు సాగుకుండా చూస్తున్నాం. – అప్పారావు, పిఠాపురం సీఐ -
గులాబీ విప్లవం కథా కమామిషు!
బాస్మతిని దాటిన గేదె మాంసం ఎగుమతులు (సాక్షి నాలెడ్జ్ సెంటర్) ‘‘ఈ దేశ ప్రజలు హరితవిప్లవం కావాలనుకుంటున్నారు. అయితే. కేంద్రంలోని పాలకులు ‘గులాబీ విప్లవం’ కోరుకుంటున్నారు. అంటే దానర్థం తెలుసా? పశువులను వధించినపుడు వాటి మాంసం గులాబి రంగులో ఉంటుంది. జంతువులను చంపుతున్నారు, విదేశాలకు పంపిస్తున్నారు. ఇలా పశువులను వధిస్తున్నవారికి ఢిల్లీలోని కేంద్ర సర్కారు సబ్సిడీలిస్తోంది.’’ ఈ మాటలన్నది ఎవరో కాదు, సాక్షాత్తూ ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ. దాదాపు మూడేళ్ల క్రితం లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2014 ఏప్రిల్ 2న బిహార్‌లోని నవాదా పట్టణంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీ అన్న మాటలివి. అప్పటిదాకా ఇతర ప్రాంతాలవారికి గులాబీ క్రాంతి అంటే ఏంటో తెలియదు. బీఫ్ అంటే ఇంగ్లిష్‌లో ఆవు, ఎద్దు మాంసమని అర్ధం. దేశంలో ఈ ఆంగ్ల పదాన్ని గొడ్డుమాంసం లేదా చాలా వరకూ ఆవు మాంసానికి సమానార్ధకంగా భావిస్తారు. వాస్తవానికి ఉత్తర్‌ప్రదేశ్ సహా దేశం నుంచి బీఫ్ పేరుతో ఎగుమతి అయ్యేదంతా గేదె మాంసమే. మొత్తం మాంసం ఎగుమతుల్లో అధిక భాగం గేదె మాంసమే. 1992, 2007 మధ్యకాలంలో ఇండియాలో ఆవుల సంఖ్య 20 కోట్ల 45 లక్షల నుంచి 19 కోట్ల 90 లక్షలకు తగ్గిపోయిందని తేలింది. ఇంగ్లిష్ మీడియాలో కౌ బెల్ట్(ఆవులను పవిత్రంగా చూసే ప్రాంతం), హిందీ బెల్ట్‌గా పిలిచే హరియాణా, యూపీ, బిహార్‌లో కూడా ఆవులు, ఆబోతులు, ఎద్దులసంఖ్య గేదెలు, దున్నపోతుల సంఖ్యతో పోల్చితే తగ్గిపోయింది. అంటే కౌ బెల్ట్‌లో ‘గోమాత’కు ఆదరణ కరువయింది. కృష్ణుడి జన్మభూమిగా భావించే యూపీలోని మథురలో కూడా1,41,326 ఆవులుంటే 7,22,854 గేదెలున్నాయి. పాలలో సగానికి పైగా గెదెల నుంచే! 2011–12లో దేశంలో ఉత్పత్తి అయిన పాలలో దాదాపు 53 శాతం గేదెలదయితే, మిగిలిన 47 శాతం ఆవులది. ఈ ఆవు పాలలో కూడా 54 శాతం సంకర జాతి(విదేశీ జాతుల సంపర్కంతో రూపొందించినవి) ఆవులదే. వ్యవసాయంలో యాంత్రీకరణ ఫలితంగా ట్రాక్టర్లు, ఇతర నూర్పిడీ యంత్రాల ప్రవేశంతో ఎద్దులకు స్థానం లేకుండా పోయింది. అంటే ఆవులను కేవలం పాల కోసమే పెంచడం రైతుకు గిట్టుబాటుకాని వ్యవహారంగా మారింది. మరోపక్క ఈజిప్ట్, గల్ఫ్, సౌదీ అరేబియా, ఇతర పశ్చిమాసియా దేశాలు, ఇండొనీసియా, థాయిలాండ్, మలేసియా, వియత్నాం వంటి ఆసియా దేశాల్లో గేదె మాసం వినియోగం పెరగడంతో భారత దేశంలో గేదె మాంసం ఉత్పత్తి, శుద్ధి, ప్యాకేజింగ్ ప్లాంట్ల సంఖ్య పెరగడానికి అవకాశాలు పెరిగాయి. యూపీలోనే గేదె మాంసం ప్లాంట్లు ఎందుకు ఎక్కువ? ఉత్తర్‌ప్రదేశ్‌లో పశుపోషణ వృత్తిగా ఉన్న సామాజికవర్గాల జనాభాతోపాటు, పాడిపరిశ్రమ, పశుగణాభివృద్ధికి అవసరమైన సదుపాయాలు(నీరు, పచ్చి, ఎండుగడ్డి, దాణా పంటలు) సమృద్ధిగా ఉండడమేగాక వాతావరణం అత్యంత అనుకూలమైంది. దీనికితోడు గేదె మాంసం తినే అలవాటుతోపాటు, మాంసం వ్యాపారం చేసే ముస్లింలు కూడా యూపీలో అధిక సంఖ్యలో ఉన్నారు. దాదాపు 18-19 శాతం ముస్లింలతోపాటు వారిలో మాంసం వ్యాపారం చేసే ఖురేషీ, కసాయీ అనే కులాలవారు కూడా ఉన్నారు. దేశంలో వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహార ఉత్పత్తులు ఎగుమతుల అభివృద్ధి సంస్థ(అపెడా)అనుమతితో నడుస్తున్న ఆధునిక యాంత్రిక జంతు వధశాలలు 75 ఉంటే, వాటిలో 42 యూపీలోనే పనిచేస్తున్నాయి. వాటి యజమానుల్లో దాదాపు 80 శాతం ముస్లింలే. స్థానిక ఖురేషీ ముస్లింలు కూడా కొన్ని ఆధునిక కబేళాలు నిర్వహించడమేగాక, ఎస్పీ, బీఎస్సీ టికెట్లపై పార్లమెంటు, యూపీ అసెంబ్లీ, కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. 2010-14 మధ్య కాలంలో యూపీఏ సర్కారు గేదెల కోడె దూడల పెంపకానికి ఓ పథకం రూపొందించింది. రూ.300 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించి పకడ్బందీగా అమలు చేశారు. అంతకుముందు వ్యవసాయానికి పనికిరావని భావించి కోడె దూడలను పుట్టగానే చంపే దురలవాటుండేది. ఈ దూడలను ఏడాదిపాటు పెంచడానికి రుణాలు సమకూర్చడమేగాక, అవి పెరిగాక ఆధునిక కబేళాలకు పంపడానికి సర్కారు ఈ స్కీము కింద సాయమందించేది. ఫలితంగా గేదె మాంసం కబేళాల నుంచి ఉత్పత్తి, ఎగుమతులు పెరిగాయి. బాస్మతి బియ్యాన్ని దాటిన గేదె మాంసం ఎగుమతులు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చాక 2015 సెప్టెంబర్ ఆఖరులో యూపీలోని దాద్రీ పట్టణంలో ఆవు మాంసం ఇంట్లో దాచారనే ఆరోపణతో మహ్మద్ అఖ్లక్ సాయిఫీ అనే 52 ఏళ్ల వ్యక్తిని ఓ గుంపు దాడి చేసి చంపింది. ఇలాంటి ఘటనలు, ఆందోళల తర్వాత కూడా దేశంలో గేదె మాంసం ఉత్పత్తి, ఎగుమతులు పెరిగాయి. 2016 ఏప్రిల్-ఆగస్టు నాలుగు నెలల కాలంలో దేశంలో మొత్తం వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహారపదార్ధాల ఉత్పత్తుల ఎగుమతుల్లో ఈ కారా బీఫ్ వాటా 23 శాతానికి పెరిగింది. దీని తర్వాత బాస్మతి బియ్యం వాటా 21.86 శాతం కాగా, బాస్మతేతర బియ్యం వాటా 17.25 శాతం. ఈ నాలుగ నెలల కాలంలో జరిగిన గేదె మాంసం ఎగుమతుల విలువ రూ. 9, 368 కోట్లు. ఇప్పుడు యోగీ ఆదిత్యనాథ్ సర్కారు దాడులు ముమ్మరం చేయడంతో 20 ఏళ్లుగా ఈ స్థాయికి వృద్ది చేసిన ‘ఎగుమతి ఆధారిత’ పరిశ్రమ ఏమవుతోందోనని ఈ వ్యాపారం చేసే అఖిలభారత మాంసం, పశువుల ఎగుమతిదారుల సంఘంలోని ముస్లిం, హిందూ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పర్యావరణ, శుభ్రతా ప్రమాణాలు కట్టుదిట్టంగా అమలుచేయడమే సర్కారు లక్ష్యమైతే ఈ తనిఖీలు, దాడులపై అలజడి, ఆందోళన అనవరం.