breaking news
BBMC elections
-
వేటు తప్పదా?
♦ బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ♦ ముఖ్యమంత్రికి పొంచి ఉన్న పదవీ గండం! ♦ ఇన్చార్జ్ మంత్రులతో సీఎం మంతనాలు సాక్షి, బెంగళూరు : బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు పెద్ద తలనొప్పిగా తయారైంది. బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పదవీ గండం ఎదురుకానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సిద్ధరామయ్య వైఖరిపై పార్టీలోని అనేక మంది సీనియర్ నేతల్లో తీవ్ర అసహనం నెలకొన్న విషయం తెలిసిందే. అనేక సందర్భాల్లో ఈ అసమ్మతి భగ్గుమంది కూడా! అయితే ఇప్పటి వరకు సిద్ధరామయ్యపై పరోక్ష విమర్శలకే పరిమితమైన అసంతృప్త వర్గం ఇప్పుడిక సిద్ధరామయ్యను ఆ పదవి నుంచే తప్పించే దిశగా ఎత్తుగడలు వేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే అందుకు సీఎం పనితీరే ముఖ్య కారణమని, కింది స్థాయి కార్యకర్తలను, పార్టీకోసం శ్రమించే వారిని కలుపుకొని పోవడంలో సిద్ధరామయ్య చూపిన నిర్లక్ష్యమే బీబీఎంపీ పట్టం నుంచి కాంగ్రెస్ పార్టీని దూరం చేశాయని హైకమాండ్‌కు నివేదిక అందించే దిశగా అసంతృప్త వర్గమంతా సన్నద్ధమవుతోంది. బీబీఎంపీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన సిద్ధరామయ్య స్వయంగా తానే ‘సిటీరౌండ్స్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు ఎన్నికల వేళ సిద్ధరామయ్య నగరమంతటా విస్తృత ప్రచారాన్ని సైతం నిర్వహించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు, నగరానికి చెందిన మంత్రులు రామలింగారెడ్డి, దినేష్ గుండూరావ్, కృష్ణబేరేగౌడ, రోషన్‌బేగ్, కె.జె.జార్జ్‌లను బీబీఎంపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా కూడా నియమించారు. వీరితో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేను ఇన్చార్జ్గా ఏర్పాటు చేశారు. ఇంత చేసినా బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణ బీబీఎంపీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడం, టికెట్ల పంపకాల సమయంలో ఆ పార్టీలో చెలరేగిన అసమ్మతి వెరసి కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీశాయనేది రాజకీయ విశ్లేషకుల వాదన. ఇన్చార్జ్ మంత్రులతో సమావేశమైన సీఎం! బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన అనంతరం బీబీఎంపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించిన మంత్రులు, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్‌తో కలిసి ముఖ్యమంత్రి సిద్దరామయ్య సమావేశమైనట్లు సమాచారం. మేనిఫెస్టో, విజన్ డాక్యుమెంట్ల పేరిట నగర వాసులపై హామీల వర్షం కురిపించినా నగర ప్రజలు కాంగ్రెస్‌కు ఎందుకు మద్దతునివ్వలేదనే విషయాన్ని ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో దాదాపు 105 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌తో పాటు పార్టీ కూడా అంచనా వేసింది. అయితే ఆశించిన ఫలితం రాకపోవడానికి అనేక ప్రాంతాల్లో స్థానిక నేతల సహాయనిరాకరణే ప్రధాన కారణమని ఇన్చార్జ్ మంత్రులు సీఎం సిద్ధరామయ్యకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీబీఎంపీ ఎన్నికల్లో విజయం సాధించకలేకపోతే కఠిన చర్యలు తప్పవని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇప్పటికే ఇన్చార్జ్ మంత్రులను హెచ్చరించిన నేపథ్యంలో, రానున్న మంత్రివర్గ విస్తరణలో ఈ మంత్రులకు కూడా పదవీగండం తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
కమలం.. ధూంధాం
సాక్షి, బెంగళూరు : బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర బీజేపీ నాయకులకు కొత్త ఉత్సాహం తీసుకువచ్చింది. దీంతో కమలనాథుల సంబరాలు అంబరాన్ని అంటాయి. బీబీఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడటం మొదలయినప్పటి నుంచి దాదాపు ప్రతి వార్డులో బీజేపీ అధిక్యతలోనే కొనసాగుతూ వచ్చింది. దీంతో ప్రతి గంటకూ కమలనాథుల ధూంధాంలు... తీన్మార్లతో ఆయా వార్డులు హోరెత్తి పోయాయి. ఇక విజయం ఖాయమై పోవడంతో అనంతకుమార్, సదానందగౌడ, ఆర్.అశోక్ తదితర అగ్రనాయకులంతా నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకున్నారు. గెలిచిన అభ్యర్థులతో పాటు పార్టీ కార్యకర్తలతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇదిలా ఉండగా బీబీఎంపీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా బెంగళూరుకు మంగళవారం సాయంత్రం చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అగ్రనాయకులను కలుసుకుని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఫలితాలు రానున్న ఎన్నికలకు దిక్సూచి. నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తిరస్కరించారనడానికి ఈ ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ.’ అని వివరించారు. -
ఓటమికి నాదే బాధ్యత
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి సాక్షి, బెంగళూరు : బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. బీబీఎంపీ ఎన్నికల్లో తాము అనుకున్న విధంగా విజయాన్ని పొందలేక పోయామని, అయితే ఈ ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం కాబోదని అన్నారు. బీబీఎంపీ ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారమిక్కడి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కృష్ణాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీబీఎంపీ ఎన్నికల్లో తాము రూపొందించిన మేనిఫెస్టో, విజన్ డాక్యుమెంట్లు తమకు విజయాన్ని చేకూరుస్తాయని ఆశించామని, అయితే తమ ఆశలు ఆవిరయ్యాయని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా సరే ప్రజల తీర్పుకు తలొంచక తప్పదని, అందుకే ప్రజల తీర్పును తాము అంగీకరిస్తున్నామని చెప్పారు. బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనంత మాత్రాన ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తిరస్కరించారనడం సరికాదని పేర్కొన్నారు.