breaking news
Bajjis
-
అరటిపండ్లతో బజ్జీ ఎప్పుడైనా ట్రై చేశారు?
అరటికాయ బజ్జీల గురించి విని ఉన్నాం. కానీ అరటి పండుతో కూడా బజ్జీలు వేసుకోవచ్చట. ఇదేంటి పండుతో బజ్జీనా..!అనుకోకండి. చక్కగా బజ్జీలు చేసి తినేయొచ్చట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు చక్కగా అరటి గెలను కోసుకొచ్చి ఆయిల్లో డీప్ ఫ్రై చేశారు. వారు గెలతో సహా ఆయిల్లో వేయించారు. ఆ తర్వాత ఆ గెలను ఆయిల్ నుంచి తీసేసి చక్కగా పళ్లు, గెలను వేరు చేశారు. ఆ తర్వాత ఒక్కో అరటి పండును వొలిచి చక్కగా ఓ పాలిథిన్ పేపర్పే పెట్టి మెదిపి దాన్ని ముందుగానే కలిపి ఉంచుకున్న పిండి బేటర్‌లో ముంచి చక్కగా బజ్జీలు మాదిరిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అరటి పండ్ల బజ్జీ రెడీ..!.అబ్బా ఇలా కూడా అరటిపండ్లతో బజ్జీలు చేసుకోవచ్చా అని అనిపిస్తోంది కదూ..!. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి. View this post on Instagram A post shared by Crispyfoodstation (@crispyfoodstation) (చదవండి: రాజ్యసభ ప్రసంగంలో సుధామూర్తి ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ ఎందుకు? మంచిదేనా?) -
తల్లీకొడుకు ప్రాణాలు తీసిన బజ్జీలు
సాక్షి, బెంగళూరు (దొడ్డబళ్లాపురం): విషపూరిత బజ్జీలు తిని తల్లీకొడుకు మృతి చెందిన సంఘటన బెళగావి తాలూకా హుదలి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పార్వతి (53), కుమారుడు సోమనింగప్ప (28) కూలీ పని చేసుకుంటూ జీవిస్తుంటారు. సోమవారం ఇద్దరూ ఇంట్లో బజ్జీలు చేసుకుని తిన్నారు. రాత్రికి ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఇద్దరినీ స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక మృతిచెందారు. బజ్జీల్లో పురుగులు మందు కలిసి ఉంటుందని, ఇది అనుకోకుండా జరిగిందా, లేక ఎవరైనా కుట్ర పన్ని చేశారా? అనేది తేలాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (నటి సంజన వీరంగం..!) -
ఆ చేతి బజ్జీ
చలి గజగజ వణికిస్తున్నా... జోరున వాన కురుస్తున్నా... వెంటనే బజ్జీలు, పునుగుల మీదకు మనసు వెళ్తుంది...ఆవురావురుమంటూ లాగిస్తూ, ప్రకృతిని ఆస్వాదించాలనిపిస్తుంది...పుల్లారావు బజ్జీలకు యమ క్రేజ్... ఏ సీజన్లో అయినా ఆ బజ్జీల రుచి చూడాల్సిందే... స్వచ్ఛమైన బజ్జీ, పునుగులను రుచి చూడటం కోసం బారులు తీరతారు చీరాల వాసులు... 30 సంవత్సరాలుగా బజ్జీ ప్రియులకు విందు చేస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారు పుల్లారావు... ఇక్కడి బజ్జీల కోసం గంటల తరబడి క్యూలో నిలబడి మరీ కొని తింటారు... పుల్లారావు వ్యాపార విజయ రహస్యమే ఈ వారం మన ఫుడ్ ప్రింట్స్... రాత్రి ఏడు గంటలైతే చాలు ఆ ప్రాంతమంతా కమ్మని సువాసనలు వెదజల్లుతుంది. అటుగా వెళ్తున్నవారంతా ఆ వాసన ఏంటా అనుకుంటూ అక్కడకు వస్తారు. అంతే! మరి అక్కడ నుంచి కాలు కదపలేకపోతారు. అప్పటికే అక్కడ క్యూలో నిలబడినవారిని అడిగి విషయం తెలుసుకుంటారు. ఆ ప్రాంతమంతా కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ తిరునాళ్లను తలపిస్తుంది. చిన్నదే అయినా... చూడటానికి చిన్న అంగడే అయినా అక్కడ దొరికే బజ్జీ, పునుగులను ఎవరైనా లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. వేడివేడిగా లభ్యమయ్యే పుల్లారావు బజ్జీలంటే చీరాల పట్టణ వాసులకు యమ క్రేజ్. స్వచ్ఛమైన పదార్థాలతో, రుచికరంగా తయారు చేసే పునుగు, బజ్జీలను గత మూడు దశాబ్దాలుగా చీరాల, చుట్టుపక్కల ప్రాంతాలకు అందిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు పుల్లారావు. స్థానిక కొట్లబజారు రోడ్డులోని తుపాకి మేడ దగ్గర ఊర పుల్లారావు చిన్న బడ్డీ బంకు పెట్టి, అందులోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇలా చేస్తారు... బజ్జీలకు పచ్చి పప్పు మాత్రమే ఉపయోగిస్తారు. వాటి పిండిని బాగా మెత్తగా చేసి ఉప్పు, కారం అన్ని సమపాళ్లలో కలిపి, స్పెషల్‌గా తెచ్చిన మిరపకాయలను కోసి, వాటిలో వాము పొడిని తగినంతగా చేర్చి, కాగిన నూనెలో రెండు సార్లు వేయించుతారు. అందుకే వాటికి అంత రుచి అంటారు బజ్జీ తిన్నవారంతా. మినప్పప్పు, బియ్యప్పిండిని వాడుతూ రుచికరమైన పునుగులను తయారుచేస్తారు. పునుగు పిండితో తయారుచేసిన బరోడా బజ్జీ, బొండాలకు మరింత క్రేజ్ ఉంది. ఆ బజారులో ఎన్నో బజ్జీల షాపులున్నా పుల్లయ్య బజ్జీల షాపు దగ్గరే జనం కనిపిస్తారు. స్వచ్ఛమైన నూనె, మన్నిక కలిగిన పదార్థాలతో రుచికరంగా తయారయ్యే పుల్లయ్య బజ్జీలను తిన్న ఎంతటివారైనా ‘వాహ్వా! పుల్లయ్య బజ్జీ!!’ అని పొగడక మానరు. – సంభాషణ, ఫొటోలు: పి. కృష్ణ చైతన్య, చీరాల అర్బన్ -
వెజ్జీ బజ్జీ
బంగాళాఖాతంలో వాయుగుండం... అల్పపీడనం... హోరున గాలి... జోరున వాన... ఇంకేముంది... నాలుక ఒక్కసారిగా ఒళ్లు విదిల్చింది... వాసన... వాసన... అంటూ నాసికా రంధ్రాలు పెద్దవయ్యాయి... వంట గదిలో పిండి, కూరలు కంటికి ఇంపుగా కనిపించాయి... మరో కుంభకర్ణుడు, మరో ఘటోత్కచుడు ఆవహించారు... అంతే... ఈ రోజు బజ్జీలు పెట్టు అంది ఉదరం... ఆలస్యం దేనికి... వెజ్జీ బజ్జీలు చేసుకుని మనం కూడా నాలుకకు విందు చేద్దాం! బ్రెడ్ బజ్జీ కావలసినవి: బ్రెడ్ స్లైసులు - 3 (త్రికోణాకారంలో కట్ చేయాలి); సెనగ పిండి - కప్పు; మైదా పిండి - టీ స్పూను; వంట సోడా - కొద్దిగా; ఉప్పు - తగినంత; నల్ల ఉప్పు పొడి - చిటికెడు; కారం - టీ స్పూను; కొత్తిమీర - చిన్న కట్ట; పచ్చి మిర్చి - 4; నూనె - వేయించడానికి తగినంత; ఆమ్చూర్ పొడి - టీ స్పూను; ధనియాల పొడి - టీ స్పూను తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, మైదా పిండి వేసి బాగా కలపాలి కొత్తిమీర, పచ్చి మిర్చి మిక్సీలో వేసి మెత్తగా చేసి గ్లాసుడు నీళ్లు పోసి, వడకట్టి, ఆ నీళ్లు పిండిలో పోయాలి ఉప్పు, వంట సోడా, కారం, నల్ల ఉప్పు వేసి కలుపుకోవాలి బాణలిలో నూనె కాగాక, త్రికోణాకారంలో కట్ చేసిన బ్రెడ్ ముక్కలను బజ్జీ పిండిలో ముంచి నూనెలో వేసి బంగారు రంగులో వచ్చేవరకు వేయించాలి చిన్న పాత్రలో ఆమ్ చూర్ పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి, బజ్జీలు వేడిగా ఉండగానే పైన చల్లి వేడివేడిగా అందించాలి. టొమాటో బజ్జీ కావలసినవి: టొమాటోలు - 6 (బెంగళూరు టొమాటోలు, చిన్న సైజువి); పచ్చిమిర్చి తరుగు - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; వంట సోడా - కొద్దిగా; నూనె - వేయించడానికి తగినంత; సెనగ పిండి - కప్పు; బియ్యప్పిండి - కప్పు; కార్న్ ఫ్లోర్ - టీ స్పూను; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను; కరివేపాకు - ఒక రెమ్మ; నిమ్మరసం - టీ స్పూను; ఉల్లి తరుగు - టేబుల్ స్పూను; పల్లీలు - అర కప్పు తయారీ: టొమాటోలను శుభ్రంగా కడగాలి ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి బాణలిలో నూనె కాగాక, టొమాలోలను పిండిలో ముంచి, నూనెలో వేసి దోరగా వేయించాలి కరివేపాకు, కొత్తిమీరలను సన్నగా తరగాలి ఒక పాత్రలో ఉల్లితరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, నిమ్మ రసం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి బజ్జీలను మధ్యకు కొద్దిగా కట్ చేసి, ఉల్లితరుగు మిశ్రమం కొద్దిగా ఉంచి, ఆ పైన రెండు పల్లీలు ఉంచి, వేడివేడిగా అందించాలి. వంకాయ బజ్జీ కావలసినవి : వంకాయలు - పావు కేజీ; సెనగ పిండి - కప్పు; బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు; కార్న్ ఫ్లోర్ - టీ స్పూను; ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను; వంట సోడా - కొద్దిగా; ధనియాల పొడి - టీ స్పూను; జీలకర్ర పొడి - టీ స్పూను; చాట్ మసాలా - టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత; స్టఫింగ్ కోసం... వాము - టీ స్పూను; చింతపండు గుజ్జు - టేబుల్ స్పూను; సెనగ పిండి - టేబుల్ స్పూను తయారీ: ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి, గుత్తి వంకాయ మాదిరిగా నాలుగు పక్షాలుగా తరిగి పక్కన ఉంచాలి (కాయలను ఉప్పు వేసిన నీటిలో ఉంచాలి. లేదంటే నల్లబడతాయి) ఒక పాత్రలో వాము, చింతపండు గుజ్జు, సెనగ పిండి గుజ్జు వేసి బాగా కలిపి, వంకాయలలో స్టఫ్ చేయాలి ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలపాలి ఉప్పు, కారం, వంట సోడా వేసి, తగినన్ని నీళ్లు పోస్తూ కలుపుకోవాలి బాణలిలో నూనె పోసి కాగాక వంకాయలను జాగ్రత్తగా విడిపోకుండా పట్టుకుని పిండిలో ముంచి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు రెండువైపులా వేయించి తీసేయాలి చిన్న పాత్రలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలపాలి బజ్జీలు వేడిగా ఉండగానే కొద్దిగా ఈ పొడి మిశ్రమం బజ్జీల మీద చల్లాలి సాస్‌తో కాని, కొత్తిమీర చట్నీతో కాని వేడివేడిగా అందించాలి. బీరకాయ బజ్జీ కావలసినవి: బీరకాయలు - పావు కేజీ; సెనగ పిండి - కప్పు; బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు; కార్న్ ఫ్లోర్ - టీ స్పూను; ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను; వంట సోడా - కొద్దిగా; ధనియాల పొడి - టీ స్పూను; జీలకర్ర పొడి - టీ స్పూను; చాట్ మసాలా - టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత తయారీ: ముందుగా బీరకాయలను శుభ్రంగా కడిగి, పైన తొక్కు తీసి చక్రాలుగా తరిగి పక్కన ఉంచాలి ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలపాలి ఉప్పు, కారం, వంట సోడా వేసి, తగినన్ని నీళ్లు పోస్తూ జారుగా కలుపుకోవాలి బాణలిలో నూనె పోసి కాగాక బీరకాయ చక్రాలను పిండిలో ముంచి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు రెండువైపులా వేయించి తీసేయాలి చిన్న పాత్రలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలపాలి బజ్జీలు వేడిగా ఉండగానే కొద్దిగా ఈ పొడి మిశ్రమం చల్లాలి సాస్‌తో కాని, కొత్తిమీర చట్నీతో కాని వేడివేడిగా అందించాలి. క్యాలీఫ్లవర్ బజ్జీ కావలసినవి: సెనగ పిండి - కప్పు బియ్యప్పిండి - టేబుల్ స్పూను, కార్న్‌ఫ్లోర్ - టీ స్పూను, కారం - టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి తగినంత, క్యాలీఫ్లవర్ - చిన్నది (క్యాలీఫ్లవర్ని పువ్వులు పువ్వులుగా విడదీసి, గోరు వెచ్చని నీళ్లలో కడిగి పక్కన ఉంచాలి) తయారీ: ముందుగా ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్, కారం, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు జత చేసి జారుగా కలుపుకోవాలి బాణలిలో నూనె కాగాక, క్యాలీ ఫ్లవర్ ముక్కలను ఒక్కొక్కటిగా ముంచి నూనెలో వేసి దోరగా వేయించి తీసేయాలి హాట్ అండ్ స్వీట్ సాస్‌తో సర్వ్ చేయాలి. ఉల్లి బజ్జీ కావలసినవి: ఉల్లిపాయలు - 3 (తొక్క తీసి సన్నగా చక్రాల్లా తరగాలి), సెనగ పిండి - కప్పు, మైదా పిండి - టీ స్పూను, వంట సోడా - కొద్దిగా, ఉప్పు - తగినంత, నల్ల ఉప్పు పొడి - చిటికెడు, కారం - టీ స్పూను, కొత్తిమీర - చిన్న కట్ట, పచ్చి మిర్చి - 4, నూనె - వేయించడానికి తగినంత, ఆమ్చూర్ పొడి - టీ స్పూను, ధనియాల పొడి - టీ స్పూను తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, మైదా పిండి వేసి బాగా కలపాలి కొత్తిమీర, పచ్చి మిర్చి మిక్సీలో వేసి మెత్తగా చేసి గ్లాసుడు నీళ్లు పోసి, వడకట్టి, ఆ నీళ్లు పిండిలో పోయాలి ఉప్పు, వంట సోడా, కారం, నల్ల ఉప్పు వేసి జారుగా కలుపుకోవాలి బాణలిలో నూనె కాగాక, ఉల్లి చక్రాలు బజ్జీ పిండిలో ముంచి నూనెలో వేసి బంగారు రంగులో వచ్చేవరకు వేయించాలి చిన్న పాత్రలో ఆమ్ చూర్ పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి, బజ్జీలు వేడిగా ఉండగానే పైన చల్లి వేడివేడిగా అందించాలి. - సేకరణ: డా. ైవె జయంతి, సాక్షి, చెన్నై